ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్‌ భావోద్వేగం | Forgive me if I ever hurt anyone: CJI DY Chandrachud last day at work: | Sakshi
Sakshi News home page

ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్‌ భావోద్వేగం

Published Fri, Nov 8 2024 5:03 PM | Last Updated on Sat, Nov 9 2024 8:36 AM

Forgive me if I ever hurt anyone: CJI DY Chandrachud last day at work:
  • బాధపెట్టి ఉంటే క్షమించండి
  • ఘనంగా వీడ్కోలు పలికిన సుప్రీంకోర్టు 
  • దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వకారణం  
  • నా జీవితం తెరిచిన పుస్తకం.. విమర్శలను వినమ్రంగా స్వీకరించా
  • సోషల్‌ మీడియా ట్రోలర్స్‌ ఇక నిరుద్యోగులైనట్లే..    

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ పదవీ కాలం ముగిసింది. శుక్రవారమే చివరిరోజు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్‌లో నలుగురు సభ్యులతో కూడిన సెర్మోనియల్‌ బెంచ్‌ ఆయనకు వీడ్కోలు పలికింది. జస్టిస్‌ చంద్రచూడ్‌తోపాటు కాబోయే సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. 

తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు అందరినీ నవి్వంచారు. జైన పదం ‘మీచా మి దుఖఃదాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రేపటి నుంచి నేను ఇలా న్యాయం చేయలేను, కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. 

 రూపురేఖలను బట్టి తనను చాలామంది యువకుడిగానే భావించేవారని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు తన వద్దకు వచ్చి ‘మీ వయసు ఎంత’ అని అడిగారని గుర్తుచేశారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేరి్పంచిందని అన్నారు. యువ లాయర్‌గా కోర్టుల్లో ఎన్నో వాదనలు విన్నానని, న్యాయవాదుల్లో నైపుణ్యాలు గమనించానని, విలువైన కోర్టురూమ్‌ టెక్నిక్‌లు నేర్చుకున్నానని తెలిపారు. 

కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని, వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లారని పేర్కొన్నారు. తాను వెళ్లిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని, తన తర్వాత మరొకరు ఈ పదవిలోకి వస్తారని చెప్పారు. సమర్థుడైన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం తనకు ఉందని వివరించారు. 

న్యాయమూర్తి అనే పదవి తనను ఇన్నాళ్లూ ఉత్సాహంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేరి్పంచాయని చెప్పారు. 

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాట్లాడుతూ.. అణగారిన యువత, నిరుపేదల బాగు కోసం జస్టిస్‌ చంద్రచూడ్‌ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో విజయం సాధించిందని, కొన్ని ఓడిపోయిందని, తమ అభిప్రాయాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ ఓపిగ్గా విన్నారన్న సంతృప్తి తమకు ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేసన్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ను న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసోసియేషన్‌ సభ్యులు, ఉద్యోగులు సత్కరించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పారంటే...  

అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు  
‘‘అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయగల శక్తి కలిగి ఉండడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మనకు తెలియని, మనం ఎప్పుడూ కలవని వ్యక్తులకు సేవ చేయడం, వారి జీవితాలను ప్రభావితం చేయడం అదృష్టమే. వృత్తిలో విజయాలు సాధించడంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఉన్నంతకాలం కొత్త విషయాలు నేర్చుకోలేదు అని భావించిన రోజు ఒక్కటి కూడా లేదు. 

న్యాయ విద్యారి్థగా కోర్టులో చివరి వరుసలో కూర్చున్న రోజుల నుంచి సుప్రీంకోర్టు కారిడార్ల దాకా నా ప్రస్థానం సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి నా వంతు సేవ చేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. దాదాపు రెండేళ్లపాటు సీజేఐగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పారదర్శకత తీసుకొచ్చేందుకు కృషి చేశా. ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్‌ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు. దూషించారు. నన్ను తప్పుపట్టారు. వాటిని మర్చిపోలేను. నేను ఇక పదవీ విరమణ చేస్తున్నా. ట్రోలర్స్‌కు, విమర్శకులకు సోమవారం నుంచి పని ఉండదు. వారంతా నిరుద్యోగులైపోతారు.  



ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేం   
మా తండ్రి పుణేలో ఒక ఫ్లాట్‌ కొన్నారు. న్యాయమూర్తిగా చివరి రోజు దాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు చెప్పారు. నిజాయతీ, సమగ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయన చెప్పిందే ఆచరించాను. న్యాయమూర్తిగా మారిన తర్వాత మొదట ఎదుర్కోవాల్సింది మనలోని భయాన్నే. మన పరిమితులు మనం తెలుసుకోవాలి. న్యాయవాద వృత్తి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ అధికార పరిధిని కూడా గుర్తుంచుకోవాలి. న్యాయమూర్తిగా ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేమని కోర్టులో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు చట్టబద్ధమైన పాలనలోనే అన్యాయాలు జరుగుతూ ఉండొచ్చు. 

చట్టబద్ధ పాలనకు అవతల జరిగే అన్యాయాలను మనం సరిదిద్దవచ్చు. బాధితులకు ఉపశమనం కలిగించడం అనేది ఓదార్పు ఇచ్చే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వారి కష్టాలను, సమస్యలను ఓపికతో వినగలిగే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లు తొలగించే శక్తి సూర్యకాంతికి ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు తెలుసు. సోషల్‌ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా. నా బాహువులు విశాలమైనవి కాబట్టి అన్ని రకాల విమర్శలను వినమ్రంగా స్వీకరించా. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృత కోర్టు. అందులో ఎలాంటి మార్పు ఉండదు.  

పెండింగ్‌ కేసులు పరిష్కరించా  
న్యాయ వ్యవస్థను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకత పెంచడానికి కృషి చేశా. పెండింగ్‌ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. నేను సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,500 ద్రస్తాలు రిజి్రస్టార్‌ కప్‌బోర్డులో పడి ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోకపోవడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించా. సుప్రీంకోర్టులో నమోదయ్యే ప్రతి కేసుకు ఒక నెంబర్‌ కేటాయించి, వరుసగా పరిష్కరించే విధానం ప్రారంభించా. దీనివల్ల వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాక్‌లాగ్‌ కేసుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కేసుల పెండింగ్‌ విషయంలో మాపై ఎన్నోవిమర్శలు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 82,000 కేసుల్లో రిజిస్టర్‌ కాని కేసులు చాలా ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు. గత రెండేళ్లలో పెండింగ్‌ కేసుల సంఖ్య 11,000కు తగ్గిపోయింది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు.  

మానవత్వంతో కూడిన తీర్పులిచ్చారు  
సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ అందించిన సేవలను పలువురు న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కొనియాడారు. భారత న్యాయ వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారని ప్రశంసించారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ తదితరులు మాట్లాడారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడంతోపాటు మానవత్వంతో కూడిన తీర్పులు ఇచ్చారని చెప్పారు. ఆయనకు అంతులేని సహనం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి ఆయన సొంతమని అన్నారు. 

క్లిష్టమైన తీర్పులు ఇచ్చే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేవారని, న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టారని వివరించారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ నిత్యం యువకుడిలా కనిపిస్తారని, ఆయనను చూసి తాము వృద్ధులమైపోయినట్లు భావిస్తామని అన్నారు. ‘‘జస్టిస్‌ చంద్రచూడ్‌ పూర్తిగా శాకాహారి. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆయనది క్రమశిక్షణతో కూడిన జీవితం. సమోసాలంటే ఆయనకు ఇష్టం. కానీ, సమావేశాల్లో ఏమీ తీసుకోరు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోర్టుల్లో టెక్నాలజీ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా పనిని మరింత సులభతరం చేశారు’’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.      

సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ చివరి తీర్పు 
సుప్రీంకోర్టులో తన చివరి రోజు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ చంద్రచూడ్‌ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యాసంస్థ హోదా విషయంలో కీలక తీర్పు వెలువరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement