ఆమె పెళ్లికి అంగీకారం తెలపండి
తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున, వివాహమాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైలులో పెట్టే అధికారం మీకు లేదు.
మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె ఓ వస్తువు కాదు. ఆ పెళ్లికి ఆమోదం తెలపండి’అని సూచించింది. పెళ్లయిన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి, లైంగిక దాడి చేశాడంటూ మహిద్‌పూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేననీ, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment