న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు.
ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment