ఎల్‌ఐసీ సేవా దృక్పథం ప్రశంసనీయం
నెల్లూరు(వేదాయపాళెం) :
వ్యాపార అభివృద్ధే ధ్యేయంగా కాకుండా సామాజసేవలో తమవంతు చేయూతనందిస్తున్న ఎల్‌ఐసీ సంస్థ ప్రశంసించదగినదని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని స్వర్ణవేదిక కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ఎల్‌ఐసీ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్‌ఐసీ సంస్థ బీమా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. నెల్లూరు డివిజన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఎల్‌ఐసీ సంస్థ వైద్య సేవలకు లక్షలాది రూపాయలు కేటాయించడం గర్వించదగిన విషయమన్నారు. ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ పి.రమేష్‌బాబు మాట్లాడుతూ సంస్థ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రగతి సాధించిందన్నారు. మార్కెటింగ్ మేనేజర్ కె.మునికృష్ణయ్య, ఎల్‌ఐసీ పాలసీల ప్రయోజనాలను వివరించారు. అనంతరం వివిధ అనాథాశ్రమాలకు 100 బస్తాల బియ్యాన్ని వితరణగా అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు మెమోంటోలు అందజేశారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, పోలీసు, ఉపాధ్యాయ శాఖల్లో అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా సన్మానించారు. సేల్స్‌మేనేజర్ కృష్ణమూర్తి, ఎల్‌ఐసీ సంస్థ ఉద్యోగులు, పలు కళాశాలల ప్రిన్సిపల్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.