జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్‌లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..
బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లు
సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్‌లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్‌పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?
55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.
మరణిస్తే చెల్లింపులు ఇలా..
ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్‌తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్‌పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.
ప్రత్యామ్నాయం..
బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.
35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పైప్లాన్‌లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ
ఉదాహరణ తెలియజేస్తోంది.
కాంపౌండింగ్ ఉండదు..
విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్‌తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.
ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్‌కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్
బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్‌ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.
ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment