
పోటీతో కూడిన మార్కెట్లోనే పనిచేస్తున్నాం
యూఎస్ ట్రేడ్ ఏజెన్సీ ఆరోపణలకు ఖండన
ప్రభుత్వరంగ దిగ్గజ బీమా సంస్థ ప్రకటన
న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్‌ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది.
యూఎస్‌టీఆర్ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్‌ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్‌డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్‌లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్‌ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది.
హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు..
‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్‌ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్‌ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్‌టీఆర్ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్‌ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్‌ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్ సాధనంగా ఎల్‌ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్‌ఐసీ తెలిపింది.