బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్‌లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఎల్‌ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్‌బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్‌ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.
ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment