హక్కులు సరే.. విధుల సంగతేంటీ?
వైద్య ఉద్యోగ సంఘాల నేతలను నిలదీసిన ఉప ముఖ్యమంత్రి
గాంధీ వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో రాజయ్య సీరియస్
హైదరాబాద్ : ‘కొంత మంది వైద్యులు సామాజిక బాధ్యతనే కాదు, మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. కళ్ల ముందే రోగి ప్రాణాలు పోతున్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవ చేస్తున్నారు. జూనియర్ వైద్యులు, వైద్య, ఇతర సంఘాల నాయకులు, తమ హక్కుల కోసం కొట్లాడటంలో తప్పులేదు కానీ, విధుల సంగతేంటి..? ఎవరూ... ఎక్స్‌ట్రా టైమ్ పని చేయాల్సిన అవసరం లేదు. నిర్దేశిత సమయానికి ఆస్పత్రికి చేరుకుని వచ్చిన రోగులను చీదరించుకోకుండా ఆప్యాయంగా పలకరిస్తే చాలు’ అని ఉపముఖ్యమంత్రి రాజయ్య హితబోధ చేశారు. గాంధీ వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆదివారం ఘనంగా జరిగాయి.
ఉప ముఖ్యమంత్రితో పాటు వుంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఎంపీలు బండారు దత్తాత్రేయ, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డీఎంఈ పుట్టా శ్రీనివాస్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు, అలుమ్ని భవనంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో డాక్టర్ యాదయ్యగౌడ్ మెమోరియల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. అనంతరం మంత్రి రాజయ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి, ఒక్కో ఆస్పత్రిలో నలుగురు వైద్యులను నియమించనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను, పారా మెడికల్ స్టాఫ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రోగులకు సేవ చేయాలంటే వైద్యులకు ఎంతో సహనం అవసరమని, దురదృష్టవశాత్తూ జూనియర్ వైద్యులకు ఆ ఓపిక కూడా ఉండటం లేదన్నారు.
వైద్యుల ఆలోచనా ధృక్పథంలో మార్పురావాలని సూచించారు. కోర్సు పూర్తైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలనే నిబంధన ఉన్నా.. ఇందుకు జూడాలు నిరాకరిస్తున్నారని, ఇది వారికి తగదని చెప్పారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ సనత్‌నగర్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చాలా పరికరాలు పని చేయడం లేదని, వైద్య పరికరాల కొనుగోలుకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రవుంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.