అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి  | Venkaiah Naidu Speech At International Conference For Development Discourse | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి 

Published Sun, Feb 10 2019 2:42 AM | Last Updated on Sun, Feb 10 2019 2:42 AM

Venkaiah Naidu Speech At International Conference For Development Discourse - Sakshi

సదస్సులో ప్రసంగిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ప్రాంగణంలో ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇఫ్లూ), రీసెర్చ్‌ ఫర్‌ రీసర్జెన్స్‌ ఫౌండేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఎఫ్‌), ఇతర సంస్థల సహకారంతో నిర్వహించిన ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ డిస్కోర్స్‌’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇఫ్లూ వజ్రోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారకాన్ని(పైలాన్‌) ఆవిష్కరించారు. ప్రకృతితో కలసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందని, పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చారన్నారు. సామాజిక అభివృద్ధితోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు.

జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు దారిద్య్ర నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాలస్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా అభివృద్ధి భావనను విద్యార్థుల్లో కలిగించాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో గ్రామాలను అంతర్భాగం చేయాలన్నారు. ప్రతి అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణం అయ్యేందుకు ఐదు ‘‘పి’’లు అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. పీపుల్‌(ప్రజలు), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), ప్లానెట్‌ (భూగ్రహం), పీస్‌(శాంతి), పార్ట్నర్‌షిప్‌(భాగస్వామ్యం) అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిమార్గంలో ముందుకు పోవాలని ఆయన సూచించారు.  

స్థిరమైన ఆర్థికవృద్ధే సమాజాభివృద్ధి 
జీడీపీ, వినియోగం, మానవ అభివృద్ధి, ఆదాయ స్థాయి, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, పాశ్చాత్యీకరణ లాంటి అనేక భావనలతో అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుందని వెంకయ్య అన్నారు. స్థిరమైన ఆర్థికవృద్ధి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో వేగవంతమైన పురోగతే దేశాభివృద్ధికి సూచిక అని అన్నారు. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, కుల–లింగ వివక్ష, నల్లధనం, ఉగ్రవాదం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు కృషి చేయడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement