
జాతీయ వ్యవసాయ అకాడమీ(National Academy of Agricultural Sciences) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో భానుప్రకాష్ చేసిన విస్తృతపరిశోధనలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవకాశం దక్కిందని ఎన్‌ఐఎన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మనిషికి ఎంత పోషకాహారం కావాలి? పోషకాహార లోపాలు, నిత్యం ఉపయోగించే వంట దినుసులతో అనేక వ్యాధులను ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే అంశాలపై భానుప్రకాష్ దశాబ్దాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

వంట దినుసులతో మధుమేహాన్ని(Diabetes) ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే దానిపై విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయంగా 250 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఐసీఎంఆర్-బసంతి దేవి అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను భానుప్రకాష్ అందుకున్నారు.