ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్‌కు తీరుపట్ల యూకేలోని రాయల్ సొసైటీ సైంటిస్ట్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో న్యూరో సైకాలజిస్ట్ ప్రొఫెసర్, గతంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకున్న డొరొతీ బిషప్ తన ఫెలోషిప్‌కు రాజీనామా చేశారు. ఇలాన్‌మస్క్ వివాదాస్పద ప్రవర్తనను నిరసిస్తూ బిషప్ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాయల్‌సొసైటీ ప్రముఖ సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, టెక్నాలజీస్ట్‌లకు వేదికని ఆమె అన్నారు.
బిషప్ ‘గట్ రియాక్షన్’
రాయల్‌సొసైటీ ఫెలోషిప్ అందుకున్న మస్క్ ప్రవర్తన సరిగా లేదని, అలాంటి వ్యక్తితో సమానంగా ఫెలోషిప్ పంచుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. రాయల్‌సొసైటీలో ఇలాన్‌మస్క్ సభ్యత్వాన్ని కొనసాగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధానపరమైన నిష్పాక్షికతకు రాయల్ సొసైటీ సింబాలిక్‌గా నిలిచిందన్నారు. అలాంటిది మస్క్ చర్యలతో సంస్థ ప్రతిష్ట మసకబారుతుందని పేర్కొన్నారు. బిషప్ రాజీనామాను కొందరు ‘గట్ రియాక్షన్’గా అభివర్ణించారు. మస్క్ తన అపారమైన సంపదను, పలుకుబడిని ఉపయోగించి తనతో విభేదించిన వారిని, ముఖ్యంగా శాస్త్రవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బిషప్ విమర్శించారు. ఆమె మస్క్‌ను ‘బాండ్ విలన్’తో పోల్చారు.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
డబ్బు విరాళం ఇచ్చి డోజ్ సారథిగా..
అంతరిక్ష అన్వేషణ, ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణలో చేసిన కృషికి గాను 2018లో రాయల్ సొసైటీ ఫెలోగా ఇలాన్‌మస్క్ ఎన్నికయ్యారు. క్రమంగా తాను కొన్ని అంశాలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ పలుకుబడి, సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలకు సంబంధించి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి ఆయన పెద్ద మొత్తంలో డబ్బును విరాళం ఇచ్చారని, దానివల్ల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథిగా నియమితులయ్యారనే వాదనలున్నాయి. ఈ చర్యలను పరిగణించి రాయల్ సొసైటీ తన ఫెలోషిప్‌ను పునఃపరిశీలించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment