Royal Society
-
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
మత్స్య జాతులు మాయం!
వాషింగ్టన్: భవిష్యత్‌లో శీతోష్ణస్థితి మార్పుతో సముద్రాలు అనూహ్యంగా వేడెక్కి చేపల జాతులు తగ్గిపోతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ వివరాలను రాయల్ సొసైటీ బీకి చెందిన జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రెడేటర్– ప్రే సంబంధాలు (ఇతర జీవులను చంపి తినే జీవిని ప్రెడేటర్ అంటారు. ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ప్రే అంటారు) మార్పు చెందిన పలు జాతులు బతికేందుకు అవసరమైన పరిస్థితులు మారిపోతాయని తెలిపింది. కేవలం పెద్ద జాతుల చేపలే కాకుండా, వాణిజ్యపరమైన చేపల జాతులు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. ఉదాహరణకు అట్లాంటిక్‌లో జాలరికి 200 ఫిష్ ఇయర్స్ తర్వాత ప్రస్తుతం దొరికేదాని కన్నా తక్కువగా చేపలు దొరుకుతాయని వివరించిది. చేపలు తగ్గే కొద్దీ వాటి వేట అధికమవుతుందని, దీనివల్ల జీవవైవిధ్యతలో భారీ మార్పులు వస్తాయని పరిశోధనలో పాల్గొన్న మలిన్ పింక్సీ చెప్పారు. కంప్యూటర్ మోడల్స్‌ను ఉపయోగించి ప్రెడేటర్– ప్రే సంబంధాలను విశ్లేషించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ లక్షల చేపల జాతులు ధృవప్రాంతాలకు పోతాయని, దీనివల్ల భూమిపై జీవరాసుల బంధాల్లో సైతం గణనీయమార్పులు వస్తాయని చెప్పారు. -
ఆరు రెట్లు అధికంగా కరోనా వైరస్ వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా అతలకుతలం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ), మెల్బోర్న్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 15 దేశాలలో మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన కేసుల కంటే సగటున 6.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’లో ప్రచురించారు. ఇది యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు నివేదించిన దానికంటే చాలా ఎక్కువ. ఇటలీ విషయంలో 17 రెట్లు ఎక్కువని తెలిసింది. డేటా ప్రకారం, 15 దేశాలలో ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఆస్ట్రేలియాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే వ్యాధి వ్యాప్తి రేటు ఆగస్టు చివరిలో అధికారికంగా నివేదించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పీటీఐ తెలిపింది. 800 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 11 యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలో వాస్తవ సంఖ్య కంటే వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు అంచనా వేశారు. (చదవండి: కోవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు) ధ్రువీకరించబడిన కేసుల కంటే అధికం... ‘అనేక దేశాలలో ధ్రువీకరించబడిన కేసుల కంటే కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిని నియంత్రించడంలో, వ్యాప్తి సంభావ్యత రెండింటికీ అడ్డుగా మారింది. ఉదాహరణకు, ఒక విశ్లేషణలో 5.4 మిలియన్లకు పైగా జనాభా ఉన్నా యూకేలో సుమారు 8 శాతం జనాభాకు కరోనావైరస్ సంక్రమించింద’ని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ క్వెంటిన్ గ్రాఫ్టన్ తెలిపిన విషయాన్ని పిటిఐ వెల్లడించింది. ‘ఈ పరిశోధనలు కరోనావైరస్ మహమ్మారిపై మనం ఎలా వ్యవహరించాం, ప్రస్తుతం కరోనా బారినపడే వ్యక్తుల అనారోగ్యం, జీవితకాలంలో వారి ఆరోగ్యంపై ఏర్పడే ప్రభావాలతో పాటు, లాక్డౌన్లను ఎలా అమలు చేశాం, ఉపయోగించుకున్నాం. ఈ మహమ్మారిని నియంత్రించడంలో ఎంతవరకు ముందున్నామ’నే విషయాలను తెలుపుతుందని గ్రాఫ్టన్ చెప్పారు. కరోనావైరస్ మరణాలను పరిశీలించేందుకు "బ్యాక్కాస్టింగ్" అనే ప్రక్రియను పరిశోధకులు ఉపయోగించారు. దీనిని వ్యాధి వ్యాప్తి నుంచి లక్షణాల వరకు, వ్యాధి లక్షణాల నుంచి మరణం వరకు ఉన్న సమయంతో పోల్చారు. ఈ ప్రక్రియతో వ్యాధి వ్యాప్తి రేటును సుమారు 95 శాతం వరకు కచ్చితంగా నిర్థారించినట్టు గ్రాఫ్టన్ తెలిపారు. "సరళంగా చెప్పాలంటే, ఒక దేశంలో కోవిడ్-19తో ఎంత మంది మరణించారనే దానిపై మేము గణాంకాలను విశ్లేషించాం. ఎంత మందికి వ్యాధి సోకి చనిపోయారో అనే విషయాన్ని గత వివరాలు ఆధారంగా కనుగొన్నాం. కరోనా మరణాల సంఖ్యపై, వాస్తవ వ్యాప్తి రేటును అంచనా వేయడానికి సులభమైన పద్ధతి ఇద"ని ఇకిగై రీసెర్చ్ స్టీవెన్ ఫిప్స్ ను పీటీఐ ఉటంకించింది. -
యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్
లండన్: మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు ది రాయల్ సొసైటీ నడుం బిగించింది. వివిధ దేశాల్లో కరోనా చూపుతున్న ప్రభావం, గణాంకాలను విశ్లేషించి ప్రాణాంతక వైరస్ సృష్టిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. భారత సంతతికి చెందిన, నోబెల్ అవార్డు గ్రహీత, యూకే రాయల్ సొసైటీ చైర్మన్ వెంకీ రామకృష్ణన్ ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు. కరోనా అంతర్జాతీయ గణాంకాలను విశ్లేషించి... దాని వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి మహమ్మారి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడంపై కమిటీ దృష్టి సారించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన స్వతంత్ర సైంటిఫిక్ అకాడమీగా పేరొందిన ది రాయల్ సొసైటీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.(మార్కెట్లను పునరుద్ధరిస్తాం: ట్రంప్) డేటా ఎవల్యూషన్ అండ్ లెర్నింగ్ ఫర్ ఎపిడిమిక్స్(డీఈఎల్‌వీఈ) గ్రూపు ఆధ్వర్యంలో మహమ్మారిని తరిమికొట్టేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా కరోనా యూకేలో దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి తాము వేసిన ముందడుగును ప్రభుత్వం స్వాగతించిందని పేర్కొంది. డీఈఎల్‌వీఈ జాతీయ, అంతర్జాతీయ డేటాను విశ్లేషించి ప్రజారోగ్యం, సామాజిక, ఆర్థిక అంశాలను మెరుగుపరచడం కొరకై వ్యూహాలు రచిస్తుందని వెల్లడించింది. అదే విధంగా ఈ సమాచారాన్ని అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటుందని తెలిపింది.(వూహాన్లో 50% పెరిగిన మృతులతో మరో జాబితా) ఈ డిసిప్లినరీ కమిటీలో మొత్తం మూడు గ్రూపులు ఉంటాయని.. వర్కింగ్ గ్రూపునకు భారత సంతతి ప్రొఫెసర్ దేవీ శ్రీధర్ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. ఇక నిపుణుల కమిటీలో చైర్ వెంకీ రామకృష్ణన్‌తో పాటు మొత్తం 14 మంది ఉంటారని.. వెంకీ రామకృష్ణన్ సోదరి లలితా రామకృష్ణన్ కూడా ఇందులో భాగస్వాములేనని పేర్కొంది. కాగా తమిళనాడులో జన్మించిన రామకృష్ణన్ 2009లో రసాయన శాస్త్రం విభాగంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు. ఇక కరోనాపై పోరులో రాపిడ్ అసిస్టెన్స్ ఇన్ మోడలింగ్ ది పాండెమిక్(ఆర్‌ఏఎంపీ) ఇన్షియేటివ్తో ముందుకు సాగుతామనిది రాయల్ సొసైటీ పేర్కొంది. కాగా యునైటెడ్ కింగ్డంలో ఇప్పటి వరకు 14,500 కరోనా మరణాలు సంభవించాయి. -
ఓటమిని కాదు..సవాళ్లను స్వీకరించండి
ప్రతిష్టాత్మక లండన్ రాయల్ సొసైటీలో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ ఎంపికయ్యారు. అంతేకాదు రాయల్ సోసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళా సైంటిస్ట్‌గా కాంగ్ ఘనతను దక్కించుకున్నారు. సైన్స్ రంగంలో వారి అసాధారణమైన రచనలు చేసిన ప్రపంచవ్యాప్తంగా 51 ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాను ఏప్రిల్ 16న ప్రకటించింది. వీరిలో కాంగ్ ఒకరు. రాయల్ సొసైటీ విజ్ఞాన శాస్త్రంలో శ్రేష్ఠమైనది. తన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్. వెల్లూరులోని ప్రముఖ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూర్ గాస్ట్రో ఇంటెస్టినల్ సైన్స్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న కాంగ్, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (బయోటెక్నాలజీ సెన్సెస్, సాంకేతిక మంత్రిత్వ విభాగానికి అనుబంధ సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ప్రాణాంతకమైన రోటా వైరస్ అంటువ్యాధుల నిరోధంపై ఆమె చేసిన కృషికిఈ గుర్తింపును గడించారు. భారతీయ పిల్లల్లో సహజంగా రోగనిరోధక శక్తే తక్కువగా ఉండటమే రోటా వైరస్ అంటురోగాలకు కారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో రోటా వైరస్ టీకా ఎందుకు సమర్థవంతమైంది కాదు అనే అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఆమె ఏర్పాటు చేసిన క్లినికల్ లాబ్ పరిశోధనలు సహకరించాయి. భారతదేశం సహా చైనా, బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలకు, టీకా తయారీ దారులకు ఈ ల్యాబ్ శిక్షణ ఇస్తుండటం విశేషం. అందుకున్న అవార్డులు 2010లో అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీ ఫెలోషిప్, 2011లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2013లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2015లో పబ్లిక్ హెల్త్ ఫ్యాకల్టీ, 2006లో భారత ప్రభుత్వం నుంచి విమెన్ బయోసైంటిస్టు ఆఫ్ ది ఇయర్ , 2016 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డున, అవార్డును కూడా గెలుచుకున్నారు. 2016 లో (లైఫ్ సైన్సెస్) ఇన్ఫోసిస్ సైన్స్ బహుమతిని అందుకున్నారు. మహిళలకు ఆమె ఇచ్చే సలహా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోని మహిళలకుఏ సలహా ఇస్తారు అని అడిగినపుడు ‘పెద్ద ఛాలెంజెస్ను స్వీకరించండి..మీకు మీరే గానీ, ఇతరుల సహకారంతోగానీ ప్రతి అంశాన్ని పూర్తిగా అన్వేషించండి..ఎట్టి పరిస్థితులలోనూ ఓటమిని అంగీకరించకండి’ అని చెప్పారు. నిజానికి ప్రొఫెషనల్ సలహా విషయంలో మహిళలకు, పురుషులకు పెద్ద వ్యత్యాసం ఉండదన్నారు. అయితే మహిళలను వెనక్కి నెట్టకుండా సాధికారిత వైపు నడిపించాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందనన్నారు. అలాగే నాయకత్వం స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళల సాధికారతకు మద్దతు అందించడం చాలా అవసరమని కాంగ్ అభిప్రాయపడ్డారు. -
అక్కడ మరో ఇద్దరు చంద్రుళ్లు..!
భూ గ్రహానికి ఒక ఉపగ్రహం మాత్రమే ఉందనీ.. అది చంద్రుడనీ అందరికీ తెలుసు. మనం అనుకుంటున్నట్టు భూమికి చంద్రుడితో పాటు మరో రెండు ఉపగ్రహాలున్నాయనీ హంగేరీకి చెందిన ఆస్ట్రనామర్లు, భౌతిక శాస్త్రవేత్తలు తేల్చారు. దట్టమైన దుమ్మూ, ధూళితో కూడిన చంద్రుని వంటి నిర్మితాలు రెండు భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో 50 ఏళ్ల క్రితం మొదలైన ‘చంద్ర పరిశోధన’ లకు ఫలితం దక్కినట్టయింది. కాగా, రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ ఈ పరిశోధనలపై కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. భూమికి ఉపగ్రహాలుగా మరో రెండు చంద్రుళ్లున్నాయని నిరూపించేందుకు అవసరమైన డేటా హంగేరీయన్ శాస్త్రవేత్తల వద్ద ఉంది. దుమ్మూ, ధూళితో నిర్మితమైయున్న ఈ పదార్థాలు భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటాయని వెల్లడైంది. అనగా ఈ నిర్మితాలు భూమికంటే 45 వేల నుంచి 65 వేల మైళ్ల వెడల్పుంటాయి. కొన్ని ముఖ్య విషయాలు.. చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు అంతరిక్షంలో ఉన్నాయనీ, అవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే అంచనాలు 1961లోనే మొదలయ్యాయి. పోలండ్‌కు చెందిన ఆస్ట్రనామర్ కజిమియర్జ్ కార్డ్లీస్కీ దుమ్మూధూళితో కూడిన చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. ఈయన పేరుమీదనే వాటిని కార్డ్లీస్కీ మేఘాలుగా పిలుస్తున్నాం. కాగా, తాజాగా వెలుగుచూసిన కార్డ్లీస్కీ మేఘాలు తేలికపాటి దుమ్ము, ధూళి అణువులతో నిర్మితమై ఉన్నందున పెద్దగా బరువుండవు. కానీ, సూర్యకిరణాలు ఈ మేఘాలపై పడినప్పుడు అవి కాంతిమయమవుతాయని రాయల్ సొసైటీ తెలిపింది. ఈ నిర్మితాలు చంద్రుని కన్నా భూమికి దగ్గరగా ఉన్నా.. సూర్యుడు, నక్షత్రాలు, అంతరిక్ష వెలుతుర్ల కారణంగా మనకు కనిపించడం లేదని ఈ రిపోర్టు వెల్లడించింది. కార్డ్లీస్కీ మేఘాలు తరచూ మార్పులకు లోనవుతాయి. ఇవి ఒకే క్షక్ష్యలో తిరుగుతూ వేల సంవత్సరాలు ఉనికిలో ఉంటాయి. అయితే తేలికపాటి పదార్థాలతో నిర్మితమైనందున వాటిలో అంతర్గంతంగా ఉన్న అణువులు ఒకదాన్నొకటి రాసుకూంటూ ఉంటాయని కథనం ప్రచురించింది. కాగా, కార్డ్లీస్కీ మేఘాలు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఒంటి కాలిపై ఎందుకు నిల్చుంటాయంటే...
ఫ్లెమింగోలు... ఆకాశంలో అరుదైన విన్యాసాలతో ఆకట్టుకునే అందమైన పక్షులు. శీతాకాలం ప్రారంభం కాగానే వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ మన దేశానికి వలస వచ్చే ఈ రాజహంసలను చూడటానికి పర్యాటకులు ముచ్చటపడుతూ ఉంటారు. అయితే వేల కిలో మీటర్ల పొడవునా ఒకే మార్గాన్ని అనుసరించడంలో, సుదీర్ఘంగా ఎగరడంలో, వేగంగా నీళ్లలో నడవడంలోనూ వాటికవే సాటి. ఇలాంటి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఫ్లెమింగోలు గంటల తరబడి ఒంటి కాలిపైనే నిలబడతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకునేందుకే ఫ్లెమింగోలు ఇలా నిల్చుని ఉంటాయని గతంలో చాలా మంది చాలా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే తాజాగా... చనిపోయిన ఫ్లెమింగోల శరీరాలపై వరుస ప్రయెగాలు చేసిన యంగ్ హుయ్ చాంగ్ అనే ప్రొఫెసర్ అసలు కారణం ఇదేనంటూ రాయల్ సొసైటీ బయాలజీ లెటర్స్‌లో పలు ఆసక్తికర అంశాలను ప్రచురించారు. అసలు కారణం ఇదే.. ‘నిలబడి ఉన్నపుడు తక్కువ కండర బలాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లెమింగోలు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోగలవు. అందుకే ఒంటి కాలిపై నిలబడేందుకే అవి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రెండు కాళ్లపై నిల్చునే కంటే ఒంటి కాలిపై నిల్చోడమే వాటికి తేలికైన పని. అందుకోసం తక్కువ టార్క్ బలం అవసరమవుతుంది కాబట్టి.. అలాంటి భంగిమలో ఉన్నపుడు అవి పక్కకు ఒరిగే అవకాశం ఉండదు. తద్వారా ఒంటి కాలిపై నిల్చునే గంటల తరబడి నిద్ర పోగలవు కూడా’ అంటూ తాజా అధ్యయనంలో యంగ్ హుయ్ అనేక విషయాలు పొందుపరిచారు. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. పరిశోధనల్లో భాగంగా చనిపోయిన ఫ్లెమింగోలను రెండు కాళ్లపై నిలబెట్టడం అసలు సాధ్యపడలేదు గానీ, ఒంటి కాలిపై చాలా సులభంగా నిలబెట్టామని యంగ్ హుయ్ తెలిపారు. -
‘రాయల్’ సభ్యులుగా భారతీయ శాస్త్రవేత్తలు
లండన్: ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉండే బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు సభ్యులుగా ఎన్నికయ్యారు. కేంబ్రిడ్జ్ వర్సిటీకి చెందిన క్రిష్ణ చటర్జీ, న్యూయార్క్ వర్సిటీకి చెందిన సుభాష్ కోఠ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన యద్వీందర్ మల్హీలకు ఈ గౌరవం దక్కింది. అకాడమీ సభ్యులుగా 2017 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన 50 మంది శాస్త్రవేత్తల బృందంలో వీరికి స్థానం లభించింది. భారతసంతతికి చెందిన రాయల్ సొసైటీ అధ్యక్షుడు, నోబెల్ ప్రైజ్ విజేత వెంకీ రామక్రిష్ణన్ శుక్రవారం తాజా బ్యాచ్‌కు స్వాగతం పలికారు. -
చింపాంజీలు కూడా వంట చేస్తాయట...
సాక్షి: ఈ భూమ్మీద మానవుల్తో దగ్గరి పోలికలు కలిగిన జీవి చింపాజీ. ఇవి మనుషులు చేయగలిగిన అనేక పనులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నట్లు అనేక పరిశోధనల్లో రుజువైంది. చింపాంజీల మీద ఈ విషయమై పలు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చింపాంజీల సామర్థ్యం గురించి మరో విషయం బయటపడింది. ది రాయల్ సొసైటీకి చెందిన పరిశోధకులు వెల్లడించిన నివేదిక ప్రకారం చింపాంజీలు కూడా మనుషుల్లాగే వంట చేయగలవట. వాటికి వండటం నేర్పిస్తే అవి నేర్చుకోగలవని ఆ అధ్యయనం వెల్లడించింది. అన్ని చింపాంజీలు వంట చేయలేకపోయినా కనీసం మైక్రోవేవ్‌ని వాడగలిగే శక్తి మాత్రం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆహార పదార్థాల్ని వండి తినగలిగే ఏకైక లక్షణం మానవులకు మాత్రమే ఉంది. కానీ చింపాంజీల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. వండిన ఆహార పదార్థాలు తినడం వాటికి అలవాటు చేశారు. దీని వల్ల పచ్చి ఆహారం కన్నా వీటికే అవి ఎక్కువగా అలవాటు పడిపోయాయి. చివరికి వాటికి మెల్లగా వండడం నేర్పించారు. వండిన ఆహారాన్ని తినడానికి అలవాటు పడిన చింపాంజీలు సొంతంగా వండుకునే పరిస్థితుల్ని కలిగించారు. దీంతో అవి కనీసం మంటల్లో ఆహారాన్ని వేడి చేసి తినగలిగే స్థితికి చేరుకున్నాయి. మైక్రోవేవ్ లాంటి పరికరాన్ని చింపాంజీలకు ఇచ్చారు. దీనికోసం ‘చింపాంజీ మైక్రోవేవ్’ అనే పరికరాన్ని వారు రూపొందించారు. ఇందులో అవి ఆహారాన్ని ఉంచి, అది వేడెక్కిన తర్వాతే తినడం మొదలెట్టాయి. దీన్ని బట్టి చింపాంజీలకు కూడా వంట చేసి తినగలిగే సామర్థ్యం ఉన్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు.