13,000 కిలోమీటర్లు వలస వెళ్లిన భారీ జలచరం
వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
వాతావరణ మార్పుల పెను ప్రభావాలు జలచరాలపై పడతాయని చెప్పే ప్రబల నిదర్శనమొకటి తాజాగా వెలుగుచూసింది. మహాసముద్రాల ఉపరితజలాల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చేపలు, తిమింగలం వంటి జలచరాల ఆహార లభ్యతలో మార్పులు సంభవిస్తున్నాయి. జత కట్టడానికి తోడు కోసం అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తున్నాయని తేలింది.
చిన్న తిమింగలాల పెంపకానికి అనువైన వాతావరణం, పిల్లల్ని కనడానికి అనువైన సముద్రజలాల ఆవరణ కోసం ఈ భారీ జలచరం ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించిందని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. సరైన ఆవాసం, ఆహారం, తోడు కోసం దక్షిణ అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం దాకా వలస యాత్ర మొదలెట్టిన తిమింగలం.. ప్రయాణంలో భాగంగా ఏకంగా రెండు మహాసముద్రాలను దాటి మూడో మహాసముద్ర జలాల్లో తచ్చాడుతోంది. తిమింగలం తిప్పల కథ క్లుప్తంగా..
9 సంవత్సరాల్లో..
కొలంబియా దేశం సమీపంలో పసిఫిక్ మహా సముద్ర జలాల్లోని ‘గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా’లో తొలిసారిగా 2013 జూలై పదో తేదీన ఒక బృందం ఈ మెగాప్టేరా నోవాఏంగ్లీ రకం హంప్‌బ్యాక్ మగ తిమింగలాన్ని చూశారు. దీని ఫొటోలను తీసి తిమింగలం వివరాలను పొందుపరిచే happywhale. com వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నాలుగేళ్ల తర్వాత దీనిని బహియే సోలానో ప్రాంతంలో కలియతిరగడం చూశారు.
మళ్లీ ఐదేళ్ల తర్వాత అంటే 2022 ఆగస్ట్ 22న ఏకంగా 13,046 కిలోమీటర్ల దూరంలోని ఆఫ్రికా ఖండంలోని హిందూ మహాసముద్ర ప్రాంతం ఝాంజిబార్ చానల్ వద్ద చూశారు. దీనికి సంబంధించిన వేలాది ఫొటోలను కృత్రిమ మేధతో సరిపోల్చి 2013లో దక్షిణ అమెరికాలో కనిపించిన తిమింగలం ఇదేనని తేల్చారు.
మొదటిసారి చూసిన ప్రాంతానికి, 2022లో కనిపించిన ప్రాంతానికి మధ్య దూరం సరళరేఖా మార్గంలో చూస్తే 13వేల కి.మీ.లు ఉంటుందని, ఒక వేళ ఇది అర్ధచంద్రాకార మార్గంలో ఇక్కడికి చేరుకుని ఉంటే ఇది ఏకంగా 19,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందని లెక్కతేల్చారు. ‘‘ ఒక తిమింగలం ఇంతదూరం వలసరావడం చరిత్రలో ఇదే తొలిసారి. సరైన ఆహారం, తోడు దొరక్క సుదూరాలకు ప్రయా ణిస్తోంది’’ అని టాంజానియా సెటాసియన్స్ ప్రోగ్రామ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎకటేరినా కలష్నికోవా చెప్పారు. కలష్నికోవా పరిశోధనా వివరాలు రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment