యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్‌ | Nobel Laureate Venki Ramakrishnan Chairs UK Covid 19 Expert Committee | Sakshi
Sakshi News home page

యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్‌

Apr 18 2020 10:22 AM | Updated on Apr 18 2020 10:27 AM

Nobel Laureate Venki Ramakrishnan Chairs UK Covid 19 Expert Committee - Sakshi

లండన్‌: మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతున్న మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు ది రాయల్‌ సొసైటీ నడుం బిగించింది. వివిధ దేశాల్లో కరోనా చూపుతున్న ప్రభావం, గణాంకాలను విశ్లేషించి ప్రాణాంతక వైరస్‌ సృష్టిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. భారత సంతతికి చెందిన, నోబెల్‌ అవార్డు గ్రహీత, యూకే రాయల్‌ సొసైటీ చైర్మన్‌ వెంకీ రామకృష్ణన్‌ ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు. కరోనా అంతర్జాతీయ గణాంకాలను విశ్లేషించి... దాని వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి మహమ్మారి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడంపై కమిటీ దృష్టి సారించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన స్వతంత్ర సైంటిఫిక్‌ అకాడమీగా పేరొందిన ది రాయల్‌ సొసైటీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.(మార్కెట్లను పునరుద్ధరిస్తాం: ట్రంప్‌)

డేటా ఎవల్యూషన్‌ అండ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఎపిడిమిక్స్‌(డీఈఎల్‌వీఈ) గ్రూపు ఆధ్వర్యంలో మహమ్మారిని తరిమికొట్టేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా కరోనా యూకేలో దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి తాము వేసిన ముందడుగును ప్రభుత్వం స్వాగతించిందని పేర్కొంది. డీఈఎల్‌వీఈ జాతీయ, అంతర్జాతీయ డేటాను విశ్లేషించి ప్రజారోగ్యం, సామాజిక, ఆర్థిక అంశాలను మెరుగుపరచడం కొరకై వ్యూహాలు రచిస్తుందని వెల్లడించింది. అదే విధంగా ఈ సమాచారాన్ని అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటుందని తెలిపింది.(వూహాన్‌లో 50% పెరిగిన మృతులతో మరో జాబితా)

ఈ డిసిప్లినరీ కమిటీలో మొత్తం మూడు గ్రూపులు ఉంటాయని.. వర్కింగ్‌ గ్రూపునకు భారత సంతతి ప్రొఫెసర్‌ దేవీ శ్రీధర్‌ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. ఇక నిపుణుల కమిటీలో చైర్‌ వెంకీ రామకృష్ణన్‌తో పాటు మొత్తం 14 మంది ఉంటారని.. వెంకీ రామకృష్ణన్‌ సోదరి లలితా రామకృష్ణన్‌ కూడా ఇందులో భాగస్వాములేనని పేర్కొంది. కాగా తమిళనాడులో జన్మించిన రామకృష్ణన్‌ 2009లో రసాయన శాస్త్రం విభాగంలో నోబెల్‌ పురస్కారం అందుకున్నారు. ఇక కరోనాపై పోరులో రాపిడ్‌ అసిస్టెన్స్‌ ఇన్‌ మోడలింగ్‌ ది పాండెమిక్‌(ఆర్‌ఏఎంపీ) ఇన్‌షియేటివ్‌తో ముందుకు సాగుతామనిది రాయల్‌ సొసైటీ పేర్కొంది. కాగా యునైటెడ్‌ కింగ్‌డంలో ఇప్పటి వరకు 14,500 కరోనా మరణాలు సంభవించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement