లండన్/వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే డెల్టా వేరియెంట్ తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై.4.2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ను వణికిస్తున్నాయి.
అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్‌లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియెంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిత్యం 50 వేలకుపైగా కేసులు
బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా లండన్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు.
రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు, కేసులు
మాస్కో: రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్ ప్రజల ను కోరారు. మాస్క్ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి మూసి వేయనున్నారు.
పిల్లలకీ ఫైజర్ టీకా సురక్షితం!
91% సమర్థంగా పనిచేస్తోందన్న కంపెనీ
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఈ కంపెనీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
పిల్లల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన అధ్యయనం వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తన సొంత సమీక్ష చేసిన తర్వాత పిల్లలకు వ్యాక్సిన్‌ను సిఫారసు చేయనుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీకాపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో 5–11 ఏళ్ల వయసు మధ్య వారు దాదాపుగా 2.8 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ టీకాలు ఇవ్వాలని, అప్పుడే నిర్భయంగా పిల్లలందరూ స్కూళ్లకి వస్తారని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలకిచ్చే టీకాలకు సంబంధించి సూదుల్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment