జీవిత బీమా ఉద్యోగుల సంఘం డిమాండ్
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: జీడీపీ మందగమనం
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment