Insurance Premium
-
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బీమా ప్రీమియం చెల్లించేందుకు రుణాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్‌కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్‌కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్‌లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్ను ఆపరేషన్స్ హెడ్‌గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్‌కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది. -
ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి
ముంబై: దేశీయంగా బీమాను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్బీఐ ఎకోరాప్ ఒక నివేదికలో తెలిపింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నారెగా) వర్కర్లను ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల్లో తప్పనిసరిగా చేర్చాలని పేర్కొంది. అలాగే బీమా పథకాలపై విధిస్తున్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని క్రమబద్ధీకరించాల్సి ఉంటుందని సూచించింది. వివిధ రంగాల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పథకాలను కూడా ప్రవేశపెట్టడం ద్వారా బీమా పరిధిలోకి మరింత మందిని తీసుకువచ్చేందుకు వీలవుతుందని నివేదిక తెలిపింది. ‘నారెగా అనేది జీవనభృతిపరమైన భద్రత కల్పిస్తోంది. ఈ వర్కర్లు .. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవైలోకి చేరడం తప్పనిసరి చేయాలి. ఇందుకోసం అయ్యే రూ. 342 వ్యయాన్ని ప్రభుత్వమే భరించవచ్చు‘ అని ఎస్బీఐ ఎకోరాప్ పేర్కొంది. కేవలం 10 శాతం కుటుంబాలు/వ్యక్తులే 100 రోజుల పని దినాలను పూర్తి చేస్తారని, దీన్ని బట్టి చూస్తే తప్పనిసరి ఎన్రోల్మెంట్కు సంబంధించిన భారం రూ. 400–500 కోట్లు మాత్రమే ఉంటుందని .. దీన్ని ప్రభుత్వమే భరించవచ్చని తెలిపింది. 2001 ఆర్థిక సంవత్సరంలో 2.71 శాతంగా ఉన్న బీమా విస్తృతి, స్వేచ్ఛాయుత విధానాల కారణంగా 2009 ఆర్థిక సంవత్సరం నాటికి 5.2 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాత నుండి తగ్గుముఖం పట్టి 2014 ఆర్థిక సంవత్సరం నాటికి 3.30 శాతం స్థాయికి పడిపోయింది. అయితే, ఆ తర్వాత సార్వజనిక బీమా పథకాలు, ప్రభుత్వ మద్దతుతో మళ్లీ క్రమంగా పుంజుకుని 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 4.20 శాతానికి చేరినట్లు నివేదిక వివరించింది. ప్రధాన మంత్రి పథకాలివీ.. గ్రామీణ ప్రాంతాల వారికి ఏటా 100 రోజుల పాటు కచ్చితంగా పని, ఆదాయం కల్పించేందుకు నారేగా పథకాన్ని ఉద్దేశించారు. 18–50 ఏళ్ల మధ్య వారికి ఏటా రూ. 330 ప్రీమియంతో పీఎంజేజేబీవై బీమా పథకం అందుబాటులో ఉంది. దీని కింద రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. ఇక 18–70 ఏళ్ల మధ్యవారికి ఏటా రూ. 12 ప్రీమియంతో ప్రమాద బీమా పీఎంఎస్బీవై పథకం కూడా అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించినా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా దీని కింద రూ. 2 లక్షల కవరేజీ ఉంటుంది. పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష వరకూ కవరేజీ లభిస్తుంది. నివేదికలో మరిన్ని అంశాలు.. ► దేశీయంగా బీమా విస్తృతి చాలా తక్కువగా ఉంది. కేవలం 20–30 శాతం మందికి మాత్రమే ఏదో ఒక తరహా ఇన్సూరెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమాపై పన్నులు వేయడమనేది పురోగమన చర్య కాబోదు. ప్రస్తుతం అన్ని బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీన్ని 5 శాతానికి లేదా సున్నా రేటు స్థాయికి తగ్గిస్తే చాలా మంది జనాభాను బీమా పరిధిలోకి తేవచ్చు. అలాగే ప్రీమియంలను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు ఇది సరైన సమయం. ► జన సురక్షా తరహాలోనే వివిధ రంగాల కోసం కొన్ని ప్రామాణిక పథకాలను ప్రవేశపెట్టాలి. ► కోవిడ్–19 మహమ్మారి పరిస్థితిలోనూ దేశీ బీమా రంగం గట్టిగా ఎదురునిల్చింది. ప్రీమియం వసూళ్ల తగ్గుదల స్వల్ప స్థాయికే పరిమితమైంది. బీమా రంగం వేగంగా రికవర్ అయ్యింది. ► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం (ఎన్బీపీ) 8.4 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరింది. ► ప్రతి మూడు జీవిత బీమా పాలసీల్లో ఒక పాలసీ .. మహిళలకు జారీ అవుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు జారీ చేసిన పాలసీల సంఖ్య 93 లక్షలుగా నమోదైంది. జారీ అయిన మొత్తం పాలసీల్లో ఇది దాదాపు 33 శాతం. చదవండి: బీఎస్ఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ.. కేంద్రం వివరణ..! -
వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...
అన్‌లాక్ తుది దశకు చేరినప్పటికీ... కోవిడ్ సెకండ్ వేవ్ మళ్లీ బలంగా పుంజుకుంటోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో దాదాపుగా 40శాతం తమ ఉద్యోగులను ఇకపై ఇంటి నుంచే పనిచేసేందుకు వీలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి అవకాశం ఇవ్వాలని అత్యధిక సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయని వర్క్‌ప్లేస్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే అంశపై బిసిజి వెలువరించిన నివేదిక వెల్లడించింది. ఉద్యోగులు సైతం ఈ విధానానికే మొగ్గు చూపుతున్నారని, అత్యవసరమైతే తప్ప ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వాహన బీమా ఖర్చు వీరికి అనవసర అదనపు వ్యయంగా పరిణమించింది. దీనిపై పాలసీ బజార్ డాట్ కామ్ హెడ్ సజ్జా ప్రవీణ్ చౌదరి ఏమంటున్నారంటే... వర్క్ ఫ్రమ్‌హోమ్...నో కార్ ఆన్ రోడ్... వచ్చే 7 నుంచి 8 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చాలా సంస్థలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో చేసే ఉద్యోగులు... తమ వాహన బీమా విషయంలో కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారంటే రోడ్లపై ఎక్కువగా కార్లు ఉండవని అర్ధం.మరి మన వాహనాన్ని మనం ఎక్కువగా వినియోగించనప్పుడు... కారు భధ్రత కోసం అధిక ఖర్చుతో కూడిన బీమా పాలసీలు అనవసరమని, రోజూ మనం కారును విరివిగా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ప్రమాదాలు, వాటి కారణంగా వచ్చే డ్యామేజీలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాని పక్షంలో...బీమా పాలసీలకు పెట్టిన ఖర్చు వృధాయేనని అనుకోవడంలో తప్పులేదు. అలాగని పూర్తిగా బీమాకు దూరమవడం కూడా సరికాదు. వాహనం వినియోగం సగానికిపైగా తగ్గిపోయిన పరిస్థితుల్లో... తక్కువ ఖర్చుతో తగినంత బీమా భధ్రత కల్పించే పాలసీల కోసం చూడాలి.. థర్డ్ పార్టీ తప్పనిసరి... వ్యక్తిగత వాహన భధ్రత కోసం బీమా తీసుకోవడం అనేది వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఆధారపడినా,ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి వాహనానికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్(టిపి కవరేజ్) మాత్రం తప్పనిసరి. ఆఫీసులకు రాకపోకలు లేని పరిస్థితుల్లో యాక్సిడెంటల్ డ్యామేజెస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే టిపి కవర్ మాత్రం తప్పదు. అలాగే మన వాహనం మన ఇంటి దగ్గర నిలిపి ఉంచినప్పుడు కూడా కొన్ని రకాల డ్యామేజీలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి డ్యామేజీలకు పరిహారం వచ్చేలా కూడా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా వాహనాలు ఎక్కడైనా పార్క్ చేసి ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది వాహనాల చోరీ.. దేశంలో రోజుకి దాదాపుగా 100 వాహనాలు చోరీకి గురవుతున్నట్టు అంచనా. ఈ నేపధ్యంలో వాహనాల చోరీ నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీ కూడా అవసరమే. అదే విధంగా ఆగి ఉన్న వాహనాలు దగ్థం అంటూ ఈ మధ్య కొన్ని సంఘటనలు తరచు చూస్తున్నాం. కారణాలేవైనా గానీ అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాలు కూడా పరిపాటిగా మారాయి. మన కారుకు నష్టం కలిగించిన, దొంగిలించిన వ్యక్తిని కనిపెట్టడం సులభం కాదు కాబట్టి ముందుగానే అందుకు తగిన భధ్రత కల్పించడం ముఖ్యం. త్రీ ఇన్ వన్...గో టిపి, ఫైర్, థెఫ్ట్ కలిపి ఉన్న బీమా పాలసీలు తీసుకోవడం మంచిది. ఈ తరహా ఉత్పత్తులు చాలా తక్కువ వ్యయంతోనే అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఇవి 50శాతం పైగా తక్కువ వ్యయం అవుతాయి. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవడంలో ఇవి సహకరిస్తాయి. అలాగే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంటిపట్టన ఉంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటాయి. కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవడం కన్నా ఈ మూడూ కలిపి అందిస్తున్న పాలసీలను ఎంచుకోవడం మంచిది. –సజ్జా ప్రవీణ్ చౌదరి, పాలసీ బజార్ డాట్ కామ్ -
ఆన్లైన్ మోసం: రూ.16.50 లక్షలు లూటీ!
సాక్షి, చిత్తూరు అర్బన్: ‘‘ హలో సర్! మీరు తీసుకున్న పాలసీల ప్రీమియం మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ఓ రూ.60 వేలు కడితే మీకు రూ.3.20 లక్షలు వస్తాయి..’’ అని ఓసారి.. ‘‘మీరు చెల్లించిన రూ.60 వేలతో కలిపి మీ బీమా సొమ్ము రూ.7 లక్షలకు మెచ్యూర్ అయ్యింది. మరో రూ.30 వేలు కడితే జీఎస్టీ క్లియరెన్స్ అవుతుంది. మీకు మొత్తం నగదు ఇచ్చేస్తాం..’’ అంటూ మరోసారి.. ఇలా నాలుగేళ్లుగా ఓ వ్యక్తిని మోసం చేస్తూ రూ.16.50 లక్షలు లూటీ చేశారు. బాధితుడు మంగళవారం చిత్తూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సందీప్ కిషోర్ దుర్గానగర్ కాలనీలో కాపురం ఉంటున్నాడు. 2013లో ఇతను ఓ ప్రైవేటు సంస్థ నుంచి అభయ్ (ఏటా రూ.10 వేల ప్రీమియం), పీఎన్బీ (ఏటా రూ.30 వేల ప్రీమియం) పాలసీలు తీసుకున్నాడు. రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించాడు. 2016లో ఇతనికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తాను ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు దీపక్ పేరిట పరిచయం చేసుకున్నాడు. ప్రీమియం మధ్యలో చెల్లించి వదిలేయడం వల్ల ఆటో రెన్యువల్ అ య్యిందని, రూ.40 వేలు చెల్లిస్తే రూ.3.20 లక్షలు వస్తా య ని నమ్మించి ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టించుకున్నాడు. తరువాత కూడా వేర్వేరు వ్యక్తులు ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ సందీప్ నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, నెఫ్ట్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ఏటీఎంల ద్వారా 32 సార్లు లావాదేవీలు నిర్వహించి రూ.16.50 లక్షలు వసూలు చేశారు. చివరగా ఈనెల 17న సైతం రూ.48,360 చెల్లించా డు. చివరకు పాలసీ డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్లపాటు అతడు ఇలా మోసపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టూటౌన్ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి సైబర్‌క్రైమ్ విభాగానికి బదిలీ చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రేవ్ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..) -
రుణానికి ముందే ప్రీమియం చెల్లింపు
♦ ఆ విధంగా రైతుల తరఫున బ్యాంకులకు అనుమతివ్వాలి ♦ కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయ శాఖ నిర్ణయం ♦ రుణానికి, ప్రీమియం చెల్లింపునకు మధ్య గందరగోళం సాక్షి, హైదరాబాద్: రుణాలు ఇవ్వడానికి ముందే పంటల ప్రీమియాన్ని రైతుల తర ఫున బ్యాంకులు బీమా కంపెనీలకు చెల్లిం చాలని, ఈ విషయమై బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. పంట సాగు కాలం, వాటి బీమా ప్రీమియం చెల్లింపు గడువు, బ్యాంకు రుణాల పంపిణీ మధ్య అగాధం నెలకొనడంతో వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, మిర్చి పంటలకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు గడువు తేదీలు లేవని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తికి బీమా ప్రీమియం చెల్లించేందుకు జూన్ 15, మిర్చికి జూలై 9వ తేదీ వరకే గడువుంది. పత్తికి జూలై 31 వరకూ పొడిగించారు. 40 శాతానికి మించని చెల్లింపు.. రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పంట అత్యధికంగా సాగవుతోంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం కావడం గమనార్హం. పత్తికి ఆదరణ ఉన్నా, రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు వస్తున్నా గడువు తేదీలు అనుకూలంగా లేకపోవడంతో 101 శాతం పత్తి సాగైనా 40 శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దీంతో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదముందంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయాధికారులు లేవనెత్తారు. ముందే ఏ పంట సాగు చేస్తారో, దానికి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లింపునకు రైతుల నుంచి లిఖితపూర్వక అంగీకారం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని బ్యాంకు వర్గాలు వ్యవసాయ శాఖకు చెప్పాయి. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటే అమలు చేస్తామని స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాస్తామని పార్థసారథి వివరించారు. నష్టపోతున్న రైతులు.. ఆయా పంటలకు వాతావరణ పంటల బీమా పథకం కింద రైతులు బీమా ప్రీమియం చెల్లించాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా ప్రీమియం చెల్లింపు గడువు నాటికి పత్తి, మిర్చి పంటల సాగు పూర్తికాదు. పైగా బ్యాంకులు కూడా జూన్, జూలై నెలల్లో పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులంతా ఆగస్టు, సెప్టెంబర్‌లోనే రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అప్పటికే వాతావరణ పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించే గడువు తేదీలు ముగిసిపోతున్నాయి. దీంతో బ్యాంకు రుణం ద్వారా బీమా ప్రీమియం చెల్లించాల్సిన రైతులంతా నష్టపోతున్నారని, ఈ అంశాన్ని లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకు వర్గాలు కూడా ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాయన్నారు. -
బీమాపై జీఎస్టీ ప్రభావం అంతంతే..
♦ పర్సనలైజ్డ్ పథకాలపై సంస్థల దృష్టి ♦ బీమా సదస్సులో ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో ప్రతిపాదిత శ్లాబ్‌తో బీమా ప్రీమియంలు స్వల్పంగా పెరగొచ్చని, అయితే మొత్తం మీద ఇన్సూరెన్స్ రంగంపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండబోదని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. గతంలోలాగానే ప్రస్తుతం కూడా పన్ను రేట్ల పెంపు ప్రభావాలకు బీమా పరిశ్రమ సర్దుకోగలదని ఆయన వివరించారు. మంగళవారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య ఫ్యాప్సీ .. ఇన్సూరెన్స్ రంగంలో కొత్త పోకడలపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలు చెప్పారు. ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ట్యాక్స్ రేటు జీఎస్టీ విధానంలో 18 శాతానికి పెరగనున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వివిధ రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా భారత్‌లో శాఖలు ప్రారంభిస్తున్నాయని విజయన్ తెలిపారు. రిస్కు ప్రొఫైల్ ఆధారంగా పర్సనలైజ్డ్ పథకాలు అందించడంపై బీమా కంపెనీలు దృష్టి పెడుతున్నాయన్నారు. ఇందుకోసం డేటా అనలిటిక్స్ మొదలైన టెక్నాలజీ ఉపయోగపడుతోందని తెలిపారు. అలాగే వివిధ రకాల బీమా కవరేజీని ఒకే పాలసీలో అందించేలా కాంబీ ప్రోడక్ట్స్‌పైనా ఇన్సూరెన్స్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయని విజయన్ చెప్పారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ తరహా పాలసీలు కొన్ని అందిస్తున్నాయని తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల పోర్టబిలిటీని ప్రవేశపెట్టే అంశం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారు. అటు దేశవ్యాప్తంగా పాతికవేల పైగా ఆస్పత్రులు, చికిత్స ఖర్చులు మొదలైన వాటితో డేటాబేస్‌ను రూపొందించడం ద్వారా చికిత్స వ్యయాలకు సంబంధించి ప్రామాణిక స్థాయిలను నిర్దేశించే ప్రక్రియ కొనసాగుతోందని విజయన్ చెప్పారు. డిజిటల్ సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో పాలసీల రూపకల్పన, విక్రయాలు, క్లెయిమ్‌లు, ప్రీమియంల నిర్ధారణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు రాగలవన్నారు. పెరగనున్న విలీనాల డీల్స్.. దేశీయంగా బీమాపై అవగాహనతో పాటు కవరేజీ కూడా పెరుగుతోందని సెమినార్లో పాల్గొన్న న్యూ ఇండియా అష్యూరెన్స్ సీఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ పెరగడంతో పాటు బీమా ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. భారత్ రీఇన్సూరెన్స్ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలమైన వనరులు ఉన్నాయన్నారు. 2025 నాటికి జనరల్ ఇన్సూరెన్స్ విభాగ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగలదని ఐసీఐసీఐ లాంబార్డ్ సీఈవో భార్గవ్ దాస్ గుప్తా చెప్పారు. టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటివి బీమా రంగంలో కీలక పాత్ర పోషించగలవన్నారు. ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
సాధారణ బీమా ప్రీమియం వసూళ్లలో 33% వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమాయేతర ప్రీమియం వసూళ్లు మంచి జోరుమీదున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 33 శాతం అధికంగా రూ. 10,287 కోట్లు వసూలు అయింది. గతేడాది ఇదే నెలలో వసూలైన స్థూల ప్రీమియం రూ.7,710 కోట్లే. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం... ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం రూ.5,289 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.4,998 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ప్రభుత్వ కంపెనీల ప్రీమియంలో వృద్ధి 35 శాతం, ప్రైవేటు కంపెనీల వసూళ్లలో 32 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం వసూళ్లు 31.7 శాతం వృద్ధితో రూ.1,13,942 కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు ఇదే కాలంలో రూ.86,526 కోట్లుగా ఉంది. 11 నెలల కాలంలో ప్రభుత్వరంగ కంపెనీల ప్రీమియం ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.61,096 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు 34.1 శాతం వృద్ధితో రూ.39,401 కోట్లుగా ఉన్నాయి. -
రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!
-
రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!
అమరావతి : రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఆర్సీటీసీ కల్పిస్తున్న ఆన్లైన్ రిజర్వేషన్ విధానంలో జారీ చేసే టికెట్లకు మాత్రం బీమా చెల్లింపునకు ఆప్షన్ విధానం కల్పించారు. ఈ ఆప్షన్ విధానాన్ని తొలగించి తప్పనిసరి చేస్తూ ఆన్లైన్ రిజర్వేషన్ విధానానికి సవరణలు చేయనున్నారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుల్లో 823 మందికి గాను 695 మంది ఆన్లైన్లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు. 128 మంది రైలు ప్రయాణ బీమా పొందారు. ఈ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. రైలు ప్రయాణ బీమా పొందిన వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.10 లక్షలు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, గాయాలైతే రూ.10 వేలు, రైలు ప్రయాణంలో సామాగ్రి పోతే రూ.5 వేలు పరిహారంగా అందుతాయి. -
వాహన బీమా ఇక మరింత ప్రియం
ఏప్రిల్ 1 నుంచి 40% పెరగనున్న థర్డ్ పార్టీ ప్రీమియంలు న్యూఢిల్లీ: వాహనదారులకు షాక్ నిచ్చేలా కార్లు, బైకుల బీమా ప్రీమియంలు ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని 40 శాతం పెంచాలని నిర్ణయించినట్లు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వెల్లడించింది. దీని ప్రకారం చిన్న కార్లకు (1,000 సీసీ సామర్థ్యం దాకా) థర్డ్ పార్టీ వాహన బీమా ప్రీమియం రూ. 1,468 నుంచి 39.9 శాతం పెరిగి రూ. 2,055కి చేరనుంది. అలాగే మిడ్ సెగ్మెట్ కార్లకు (1,000-1,500 సీసీ) 40 శాతం పెరుగుతుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలకు (1,500 సీసీ) ఇది 25 శాతంగానే ఉండనుంది. దీని ప్రకారం వీటి బీమా ప్రీమియంలు ప్రస్తుతమున్న రూ. 4,931 నుంచి రూ. 6,164కి పెరుగుతాయి. అటు బైకులు, స్కూటర్ల విషయానికొస్తే 75 సీసీ దాకా సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాల ప్రీమియంలు రూ. 519 నుంచి రూ. 569కి, 75-150 సీసీ టూవీలర్లకు 15 శాతం పెరుగుదలతో 619కి చేరతాయి. ఇక 150-350 సీసీ బైక్‌ల ప్రీమియం 25 శాతం మేర ఎగియనుంది. అయితే, 350 సీసీ మించిన బైక్‌ల ప్రీమియంలు మాత్రం రూ. 884కి తగ్గనున్నాయి. అటు త్రిచక్ర వాహనాల బేసిక్ థర్డ్ పార్టీ ప్రీమియం కూడా పెరుగుతోంది. ఆరుగురు ప్రయాణికుల సామర్థ్యం ఉండే ఈ-రిక్షా కేటగిరినీ ప్రవేశపెట్టిన ఐఆర్డీఏఐ వీటికి స్థిరంగా రూ. 1,125 ప్రీమియం నిర్ణయించింది. అటు పబ్లిక్ క్యారియర్ల ప్రీమియంలు 15-30 శాతం పెరగనుండగా, 12 టన్నుల సామర్ధ్యం ఉండే గూడ్స్ వాహనాల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. కాస్ట్ ఇన్ఫ్లేషన్ సూచీ (సీఐఐ) క్రిత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో 1024 నుంచి 1081కి పెరిగిందని, దానికి అనుగుణంగానే ప్రీమియంలు మార్చినట్లు కొత్త రేట్లను నోటిఫై చేస్తూ ఐఆర్డీఏఐ తెలిపింది. -
మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?
ఇక డిజిటల్ రూపంలోనే వాహన బీమా పాలసీ ⇒ గతనెల నుంచే తొలిసారి అమల్లోకి తెచ్చిన తెలంగాణ ⇒ వచ్చే ఏడాదికల్లా మిగిలిన రాష్ట్రాలూ చేయాలన్న ఐఆర్డీఏ ⇒ డిజిటల్ కాపీని మొబైల్లో స్టోర్ చేసుకుంటే చాలు ⇒ ట్రాఫిక్ పోలీసులు అడిగితే మొబైల్లోనే చూపించొచ్చు ⇒ వారు ధ్రువీకరించుకోవటానికి వీలుగా దాన్లోనే క్యూ.ఆర్. కోడ్ ⇒ అంతటా అమల్లోకి వస్తే బీమా ప్రీమియంలోనూ తగ్గుదల సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం: స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్చటంతో సుధీర్ హడావుడిగా తన కార్లో బయల్దేరాడు. దార్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న పోలీసులు సుధీర్ వాహనాన్ని కూడా ఆపారు. డ్రైవింగ్ లెసైన్స్.. ఆర్సీ రెండూ చూపించటంతో పోలీసులు ఇన్సూరెన్స్ పత్రాలడిగారు. సుధీర్ ఈ ఏడాది వాహన బీమా రెన్యువల్ చేయించాడు గానీ... ఆ పత్రాల్ని కార్లో ఉంచుకోవటం మర్చిపోయాడు. అంతే! కారు ఆపి కిందికి దిగాల్సిందిగా పోలీసులు చెప్పారు. ఇంటికి ఫోన్‌చేసి మొబైల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటానని, చూపిస్తానని సుధీర్ చెప్పినా వాళ్లు వినలేదు. తమకు ఒరిజినల్ బీమా పాలసీ పత్రాన్ని చూపించాలని, జిరాక్స్ కూడా పనికిరాదని కచ్చితంగా చెప్పేశారు. అసలే అర్జంటుగా వెళదామనుకున్న సుధీర్‌కు ఈ సంఘటన చాలా చికాకు తెప్పించింది. చివరకు పోలీసులు చెప్పిన జరిమానా చెల్లించి బతుకు జీవుడా... అనుకుంటూ బయటపడ్డాడు. అదండీ సుధీర్ కథ. అయినా సుధీర్ ఒక్కడికే కాదు. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఫైన్ చెల్లించటమో... లేకపోతే పోలీసుల్ని బతిమాలుకొని వారికే ఎంతో కొంత చెల్లించటమో చేసి ఉంటాం. అయినా! బీమా పాలసీ లేనివారైతే ఇలాంటివి చెయ్యొచ్చు. ఉండి కూడా కేవలం ఆ సమయానికి తన వద్ద ఉంచుకోకపోవటం వల్ల జరిమానా కట్టడమంటే చాలా ఇబ్బందే. అందుకే..!! ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఎదురు కాకుండా ఉండేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) కొత్తగా డిజిటల్ రూపంలో ఉండే ‘ఈ-వాహన బీమా’ పాలసీలను అమల్లోకి తెచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే... గతనెల 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ-వాహన బీమా పాలసీల్ని మొట్టమొదట జారీ చేసింది, గుర్తిస్తున్నది తెలంగాణ రాష్ట్రం కావటం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రం ఒక్కటే వీటిని జారీ చేయటం, గుర్తించటం చేస్తుండగా... 2017 నాటికి అన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరించాలని ఐఆర్డీఏ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఈ-వాహన బీమా అర్థమేంటి? 1988 నాటి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికీ కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండి తీరాలి. థర్డ్ పార్టీ పాలసీ అంటే... మీ వాహనం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు మీ వల్ల ఎదుటి వాహ నానికో, వ్యక్తులకో ప్రమాదం జరగొచ్చు. అపుడు ఆ వాహనానికో, వ్యక్తులకో అయ్యే ఖర్చు మీరు భరించలేని పరిస్థితి ఉండొచ్చు. దాన్ని థర్డ్ పార్టీ పాలసీ జారీ చేసిన బీమా కంపెనీ చెల్లిస్తుందన్న మాట. మీరు డ్రైవింగ్ చేస్తూ ఏదైనా చెట్టుకో, మరోదానికో యాక్సిడెంట్ చేసినా, లేక మీ వాహనంలోని భాగాలో, వాహనమో దొంగతనానికి గురైనా ఈ థర్డ్ పార్టీ బీమా వర్తించదు. అలాంటివాటికి కూడా కవరేజీ ఉండాలంటే సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ ఉండాలి. ఇపుడు దీన్ని కూడా ఐఆర్డీఏ తప్పనిసరి చేసింది. నిజానికి చట్టం ప్రకారం బీమా తప్పనిసరి. అయినా సరే తీసుకుంటున్న వారు మాత్రం తక్కువే ఉంటున్నారన్నది ఐఆర్డీఏ ఉద్దేశం. ‘‘ఇటీవల భారత బీమా సమాచార బ్యూరో (ఐఐబీ), బీమా పరిశ్రమ కలసి ఓ సర్వే చేశాయి. దీని ప్రకారం 45-55 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉంది. ప్రయివేటు కార్లలో 50 శాతం వరకూ మొదటి ఏడాది తరవాత బీమా చేయించటం లేదు. చట్టప్రకారం బీమా లేని వాహనాలు రోడ్లపై తిరక్కూడదు. కానీ కొన్ని అక్రమ మార్గాల వల్ల, బీమా తేదీల్ని మార్చి ఫోర్జరీ చేసిన పత్రాలను పోలీసులకు చూపించటం వల్ల ఇలాంటి వాహనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరగ్గలుగుతున్నాయి. వీటిని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర కూడా తగిన యంత్రాంగం లేదు’’ అని కామ్స్.. రిపాజిటరీ సర్వీసెస్ సీఈఓ ఎస్.వి.రమణన్ చెప్పారు. బీమా రిపాజిటరీ సర్వీసులంటే పాలసీదారుల పేరిట ఈ-ఖాతాలు తెరిచి అన్ని పాలసీలనూ డిజిటలైజ్ చేసి భద్రంగా దాచే సంస్థలు, ఖాతాదారులు కూడా ఆన్లైన్లో వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే! గత నెల 2 నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఈ-వాహన బీమా పాలసీలను తెలంగాణ రాష్ట్రంలో బీమా కంపెనీలు అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతానికి వీటిని గుర్తిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దీనివల్ల స్మార్ట్ఫోన్లలో సాఫ్ట్ కాపీ ఉంటే చాలు. పోలీసులు ఒకవేళ బీమా పాలసీ అడిగితే దాన్ని చూపించాలి. అవసరమనుకుంటే వాళ్లే క్యు.ఆర్. కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకుంటారు. ‘‘ప్రత్యేకించి తెలంగాణలో ఇకపై కొత్త పాలసీలకు గానీ, రెన్యువల్ చేసుకున్న పాత పాలసీలకు గానీ డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో జారీ చేస్తాం. పాలసీదారుకు భౌతికంగా పాలసీ డాక్యుమెంట్లను పంపటంతో పాటు తన మెయిల్ ఐడీకి పీడీఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ కాపీనీ పంపిస్తాం. ధ్రువీకరణకు వీలుగా వాటిపై క్యు.ఆర్. కోడ్ కూడా ఉంటుంది’’ అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సీఐఓ టి.ఎం.శ్యాంసుందర్ చెప్పారు. ‘‘ఒకవేళ ఈ-బీమా ఖాతా ఉన్నట్లయితే అన్ని పాలసీలూ అందులోనే స్టోర్ అయి ఉంటాయి. అయితే ఇందుకు ఇన్సూరెన్స్ రిపాజిటరీలతో సదరు బీమా సంస్థ ఒప్పందం చేసుకుని ఉండాలి. ఇలాంటి ఖాతా ఉన్నవారికి బీమా కంపెనీలు భౌతిక పాలసీలను పంపించవు’’ అని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాలింకా దీన్ని అమల్లోకి తేలేదు కనక తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా భౌతిక రూపంలో పాలసీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ-వాహన బీమా పనిచేసేదిలా... ♦ కొత్త పాలసీ తీసుకున్నా, పాత బీమా పాలసీని రెన్యువల్ చేయించుకున్నా కంపెనీలు పాలసీదారు మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో ఒక పాలసీని పంపిస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటే చాలు. ♦ ఎక్కడైనా పోలీసులు ఆపి బీమా పత్రాలను చూపించమని అడిగినపుడు మొబైల్లో స్టోర్ చేసిన డిజిటల్ పాలసీని చూపించాల్సి ఉంటుంది. ఆ పాలసీపై ఉన్న క్విక్ రెస్పాన్స్ (క్యు.ఆర్.) కోడ్‌ను పోలీసులు తమ మొబైల్ ఫోన్ ద్వారా కూడా స్కాన్ చేస్తారు. ♦ ఇపుడు క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లు చాలా వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారైతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్లు వాడేవారైతే యాపిల్ స్టోర్ నుంచి వీటిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ♦ పోలీసులు ఈ క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే మొబైల్ తెరపై ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆ పాలసీ ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది? పాలసీదారు పేరు... అది అసలైనదా? నకిలీదా? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ♦ ఈ వివరాలన్నీ నిజానికి బీమా సమాచార బ్యూరో డేటా బేస్ నుంచి గానీ, బీమా కంపెనీ డాటాబేస్ నుంచి గానీ వివరాలన్నీ మొబైల్ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఈ క్యూ.ఆర్. కోడ్ ను స్కాన్ చేసే అప్లికేషన్లను మొబైల్ ఫోన్లలోకి సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులందరూ తమ మొబైల్ ఫోన్లలో వీటిని డౌన్లోడ్ చేసుకున్నారు కూడా’’ అని రమణన్ చెప్పారు. ♦ వాటి ఆధారంగా పోలీసులు ఆ పాలసీ సరైనదో కాదో అక్కడికక్కడే ఆన్లైన్లోనే పరిశీలించి ధ్రువీకరించుకునే వీలుంటుంది. డిజిటల్ పాలసీ లాభాలివీ... ♦ వాహనదారులు పాలసీ పత్రాన్ని స్టోర్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళితే చాలు. ♦ అధికారులు వాహనాల్ని ఆపితే... బీమా పత్రాల్ని ఎక్కడికక్కడ పరిశీలించి ధ్రువీకరించుకోవచ్చు. ♦ డిజిటల్ పాలసీ వల్ల పాలసీదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గుదల థర్డ్ పార్టీ పాలసీల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి ప్రీమియంను ఏటా ఐఆర్డీఏ నిర్ణయిస్తూ ఉంటుంది. ♦ కాంప్రిహెన్సివ్ పాలసీల రేట్లను బీమా కంపెనీలే నిర్ణయిస్తాయి. డిజిటల్ వల్ల ఖర్చులు తగ్గుతాయి కనుక ఆ తగ్గుదలను పాలసీదారులకు బదలాయించే అవకాశం ఉంది. ♦ ప్రస్తుతం బీమా సంస్థలు డిజిటల్‌తో పాటు భౌతిక పాలసీలనూ జారీ చేయాల్సి వస్తోంది కనుక కంపెనీలకు ఖర్చుల్లో తగ్గుదల ఉండదు. మున్ముందు అన్ని రాష్ట్రాలూ దీన్ని అమల్లోకి తెచ్చి... డిజిటల్‌ను మాత్రమే తప్పనిసరి చేస్తే తగ్గుదల ప్రయోజనం అందుతుంది. ఐఆర్డీఏ ఉత్తర్వుల్లో ఏముంది? 2015 డిసెంబర్ 1 తరవాత జారీ చేసిన వాహన బీమా పాలసీలన్నిటికీ క్యూ.ఆర్. కోడ్ తప్పనిసరిగా ఉండాలని, పాలసీ అధికారికమైనదో, కాదో ధ్రువీకరించుకోవటానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందని ఐఆర్డీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల ఎక్కువ మంది వాహన బీమా పాలసీలు తీసుకుంటారని, అవినీతి కూడా తగ్గుతుందని బీమా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భౌతికంగా పాలసీలున్న వారందరికీ క్యూ.ఆర్. కోడ్ ఉన్న డిజిటల్ పాలసీలు జారీ చేయాలని బీమా కంపెనీలకు కూడా సూచించినట్లు ఐఆర్డీఏ తెలిపింది. -
ఊరును బట్టే బీమా ప్రీమియం!
వేణుది విశాఖపట్నం. రెండు వారాల పాటు పని ఉండటంతో ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీలో ఉండగా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేయించుకుని, ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. ఆ తరవాత రీయింబర్స్ నిమిత్తం ఆసుపత్రికి చెల్లించిన రూ.50 వేల బిల్లును బీమా కంపెనీకి సమర్పించాడు. వేణుకి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంది. 100 శాతం రీయింబర్స్ వచ్చే అవకాశమూ ఉంది. కానీ కంపెనీ మాత్రం వేణుకి రూ.40 వేలే చెల్లించింది. ఎందుకో తెలుసా? * జోన్ ఆధారంగా కంపెనీల హెల్త్ పాలసీలు * ట్రీట్మెంట్లో జోన్ మారితే మాత్రం ఇబ్బందే * తీసుకున్న జోన్ ఆధారంగానే కంపెనీల చెల్లింపు ఎందుకంటే వేణు బీమా తీసుకున్న కంపెనీ భౌగోళిక జోన్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తోంది. వేణు బీమా తీసుకున్నది జోన్-2 సిటీలో. ప్రీమియం కూడా అక్కడి ధరల ఆధారంగానే చెల్లించాడు. కానీ చికిత్స చేయించుకున్నది జోన్-1 కిందికి వచ్చే నగరంలో. ఎందుకంటే జోన్-1 నగరంలో బీమా తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. అందుకే రీయింబర్స్‌లో ఆ తేడా. మరో రకంగా చూసినా... ఒకవేళ వేణు బీమా తీసుకున్న విశాఖలోనే ఆ చికిత్స కూడా చేయించుకున్నట్లయితే ఢిల్లీ కన్నా రేట్లు తగ్గి ఉండేవి కదా? అదీ కంపెనీ లాజిక్. తాము వేణు బీమా తీసుకున్న విశాఖపట్నంలోని వైద్య ఖర్చుల ఆధారంగానే బీమా ప్రీమియం నిర్ణయించామన్నది కంపెనీ వాదన. క్లెయిమ్‌లు కూడా తక్కువే... కంపెనీల డేటా చూస్తే... టైర్-1 నగరాల్లో ఉండేవారి బీమా క్లెయిములు కూడా ఎక్కువే. వారితో పోలిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో ఆరోగ్య బీమా క్లెయిములు చాలా తక్కువ. ‘‘టైర్ -1 నగరాల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాన్నే మిగతా నగరాల వారికీ వర్తింపజేసి వారిపై భారం మోపటం ఇష్టంలేక కంపెనీలు జోన్ ఆధారిత ప్రీమియాలను వసూలు చేస్తున్నాయి’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ వ్యవస్థాపక సీఈఓ నావల్ గోయెల్ చెప్పారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ హెల్త్ ఇన్సూరెన్స్, సిగ్నా టీటీకే ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటివి ఈ జోన్ ఆధారిత పాలసీలు అందిస్తున్నాయి. ఇవి నగరాల్ని, పట్టణాల్ని జోన్-1, జోన్-2, జోన్-3గా విభజించాయి. జోన్-3లో పాలసీ తీసుకునేవారు జోన్-2లో తీసుకున్న వారి కన్నా 10 శాతం తక్కువకే పాలసీ పొందొచ్చు. అలాగే జోన్-1లో ఉన్నవారు జోన్-2లో వారికన్నా 10 శాతం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. ‘‘జోన్ ఆధారిత ధరలనేవి ఇష్టప్రకారం ఎంచుకునేవి కాదు. కంపెనీయే పాలసీ తీసుకున్న ప్రాంతాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తుంది. కానీ వారు ఏ నగరంలోనైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే పాలసీలో మాత్రం ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అందరికీ ఒకేలా పూర్తిస్థాయి సేవలందుతాయి’’ అని గోయెల్ వివరించారు. ప్రీమియం ఒక్కటే ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నారు. పాలసీదారు కనక చిరునామా మారితే అది కంపెనీకి తెలియజేయాలని, ఒకవేళ జోన్ మారితే దాని ఆధారంగా ప్రీమియం ఛార్జీలను కంపెనీ సవరిస్తుందని మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సోమేష్ చంద్ర తెలియజేశారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి జోన్-1 నగరంలో మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ పాలసీ తీసుకుంటే రూ.3 లక్షల కవరేజీకి ఏడాదికి రూ.7,044 చెల్లించాల్సి ఉంటుంది. అదే విశాఖ వంటి టైర్-2 సిటీలోనైతే రూ.6,340 చెల్లిస్తే చాలు. అయితే జోన్-3లోనో, 2లోనో పాలసీ తీసుకుని... జోన్-1లో ట్రీట్మెంట్ తీసుకున్నవారికి ఈ పాలసీలతో ఇబ్బందేనని గోయెల్ చెప్పారు. అందుకే తాము ఏ జోన్లో చికిత్స తీసుకునే అవకాశం ఉందో... ఆ జోన్నే పేర్కొంటూ పాలసీ తీసుకోవటం ఉత్తమమని చెప్పారాయన. చాలా కంపెనీలు జోన్-3 నుంచి జోన్-2కు, అలాగే జోన్-1కు మారటానికి అంగీకరించవని, అలాంటపుడు ప్రీమియంలో తేడా మొత్తాన్ని చెల్లిస్తే అంగీకరిస్తాయని తెలియజేశారు. కాకపోతే ఈ జోన్ల విషయంలో కంపెనీలన్నీ ఒకేరకంగా లేవు. కొన్ని నగరాల్ని కొన్ని కంపెనీలు జోన్-2గా పేర్కొంటే... మరికొన్ని కంపెనీలు జోన్-1గా పేర్కొంటాయి. ఈ తేడాల్ని ముందే చూసుకోవాలనేది గోయెల్ సూచన. -
ప్రీమియాన్ని బీమా సంస్థలకు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని పెద్ద మొత్తంలో తమ వద్దే దాచిపెట్టుకున్న బ్యాంకులు తక్షణమే ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆ సొమ్మును జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)కి చెల్లించాలి. కానీ కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రీమియం సొమ్మును బ్యాంకులు తమ వద్దే దాచుకుంటున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాల్లో ప్రతీ బ్యాంకు బ్రాంచీలో ఎంత ప్రీమియం సొమ్మును ఈ రకంగా దాచిపెట్టుకున్నారో వెంటనే తెలపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బ్యాంకుల ద్వారానే చెల్లించాలి... ఇప్పటివరకు పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించి బీమా సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇకనుంచి బ్యాంకు రుణాలు తీసుకోని రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియాన్ని వసూలు చేసి బీమా కంపెనీలకు చెల్లించాలని..ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త రుణాల ఆలస్యంపై అసంతృప్తి... ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును విడతల వారీగా ఇస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సారి పంట రుణాల లక్ష్యం రూ. 15 వేల కోట్లు పైగా ఉండగా... ఇప్పటివరకు 35 శాతానికి మించి రుణాలు ఇవ్వలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
పంటల బీమా అందేనా..?
రాజాపేట : వాతావరణ ఆధారిత పంటల బీమా ఏడాది గడిచినా రైతులకు అందలేదు. మండలంలో 816 మంది రైతులు 1,475 ఎకరాల పత్తిపంటతోపాటు బత్తాయిపై బీమా ప్రీమియం చెల్లించారు. ఇందుకుగాను రూ.9. 75లక్షలను బ్యాంక్ డీడీ రూపంలో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారు. వాతావరణ ఆధారిత బీమా కిందఎకరానికి రూ.510 ప్రీమియం చెల్లిస్తే ఇందుకుగాను పంట పూర్తిగా నష్టం వాటిల్లితే ఎకరాకు రూ.10,400 బీమా పరిహారం చెల్లిస్తారు. బత్తాయి పంటకు ఎకరాకు రూ.792 చెల్లిస్తే నష్టపరిహారం కింద రూ.16వేలు చెల్లిస్తారు. గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు పూర్తిగా పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టాన్ని అంచనావేసి నివేదక సమర్పించారు. నేటివరకు బీమా వర్తించలేదు. ఖరీఫ్ సాగుకు అక్కరొస్తాయనుకుంటే.. బీమా డబ్బులు వస్తే తాము ఈఏడు ఖరీఫ్ సీజన్లోనైనా పెట్టుబడి పెట్టుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అధికారులకు బీమా విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం బీమా డబ్బులు చెల్లింపుపై వాయిదాలుచెపుతు దాట వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన పంటల బీమా డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. బీమా డబ్బులు త్వరలో చెల్లిస్తాం : ఏఓ వాతావరణ ఆధారిత బీమా డబ్బులు రైతులకు త్వరలోనే చెల్లిస్తామని ఏఓ ఏ.స్వాతి తెలిపారు. బీమా చెల్లించేందుకు రాజాపేట మండలాన్ని ప్రకటించారు. పంటల ప్రీమియం చెల్లించిన ప్రతీ రైతుకు బీమాకు సంబంధించిన బాండ్లతోపాటు పరిహారం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా
వైద్య చికిత్సలకయ్యే ఖర్చు భారీగా పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో మరింత ఆరోగ్య ధీమా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్డీఏ పెద్దవాళ్ల ఆరోగ్య బీమా విషయంలో కొన్ని కీలక సంస్కరణలు చేసింది. సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవచ్చు. ఈ విషయాలపై అవగాహన కల్పించేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఇప్పుడు అందరికీ ముఖ్యంగా వయోవృద్ధులకు కూడా ఆరోగ్య బీమా రక్షణను ఐఆర్డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంత కాలంగా వయసు పెరిగిన వారు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఐఆర్డీఏ పరిష్కరించింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి పాలసీ లభించేదే కాదు. ఒకవేళ ఒకటి రెండు కంపెనీలు ఇచ్చినా ప్రీమియం అందుబాటు ధరలో ఉండేది కాదు. ఇప్పుడు ఇక ఈ సమస్య లేదు. సరైన కారణం చూపించకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జారీ చేయకపోవడం, ప్రీమియం పెంచడం వంటివి చేయడానికి వీలులేదు. అలాగే చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే పాలసీదారులకు ముందుగానే అన్ని ఆరోగ్య పరీక్షలు జరిపించేవారు. ఈ పరీక్షల వ్యయంలో కొంత మొత్తాన్ని కొన్ని కంపెనీలు భరిస్తే మరికొన్ని కంపెనీలు ఒక్క పైసా కూడా చెల్లించేవి కావు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఐఆర్డీఏ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పాలసీ మంజూరు చేస్తే ఆ వ్యయంలో 50% బీమా కంపెనీ భరించాల్సి ఉంటుంది. అంతేకాదు వైద్య పరీక్షల తర్వాత పాలసీ మంజూరు చేశారు కాబట్టి క్లెయిమ్‌లను తిరస్కరించడానికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 65 ఏళ్ళ వారి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఈ నిబంధనలు మారిన తర్వాత చాలా కంపెనీలు వృద్ధులకు ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాయి. కొన్ని కంపెనీలు అయితే 70-80 ఏళ్ల వారికి కూడా పాలసీలు అందిస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం మంచిది. ఒకవేళ వయసు పెరిగిన తర్వాత తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇంటిలోని పెద్ద వయసు వారి పేరు మీద పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. వ్యక్తిగతానికి దూరం.. తల్లిదండ్రులు, అత్తమామల పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటే వ్యక్తిగత పాలసీల కంటే గ్రూపు పాలసీలకేసే మొగ్గు చూపండి. ఈ వయ సులో వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ అందిస్తుంటే అందులో వీరికి కూడా బీమా రక్షణ కల్పించే అవకాశం ఉందా లేదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ లేకపోతే వివిధ కంపెనీలు అందిస్తున్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను తీసుకోండి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు ఒకే పాలసీ కింద ఆరు నుంచి ఎనిమిది మంది రక్త సంబంధీకులకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. అదే మ్యాక్స్‌బూపా వంటి మరికొన్ని కంపెనీలు అయితే ఏకంగా 13 మంది రక్త సంబంధీకుల వరకు కూడా బీమా కల్పిస్తున్నాయి. ఇలా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల అందరికీ ఆరోగ్య బీమా రక్షణతో పాటు, చెల్లించే ప్రీమియంలో 50-60% తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. కో-పేమెంట్... ఒకవేళ కుటుంబమంతా కలసి ఒకే పాలసీ తీసుకునే అవకాశం లేని వారికి ప్రీమియం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అనేది ఒక చక్కటి మార్గం. ఈ ఆప్షన్లో క్లెయిమ్ భారాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. కో-పేమెంట్ అంటే క్లెయిమ్ మొత్తం బీమా కంపెనీ చెల్లించకుండా కొంత మొత్తం మీరు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు 10 నుంచి 20% కో-పేమెంట్‌గా నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మీరు తీసుకున్న పాలసీలో కో-పేమెంట్ 20 శాతంగా ఉందనుకుందాం. ఇప్పుడు మీ క్లెయిమ్ మొత్తం రెండు లక్షలు అయితే అందులో బీమా కంపెనీ కేవలం రూ.1.60 లక్షలే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40 వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కో-పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం వలన ఆ మేరకు ప్రీమియం భారం కొంత మేర తగ్గుతుంది. అంతేకాదు కో-పేమెంట్ ఆప్షన్లో మీకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అనవసర చికిత్సా వ్యయాలు ఉండవన్న భావనతో బీమా కంపెనీలు ఈ ఆప్షన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పటికే వ్యాధులు ఉంటే... ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వంటి ఆర్యోగ సమస్యలు సహజం. అందులో వయసు పెరిగిన వారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండటం అంతే అత్యంత సహజం. పాలసీ తీసుకునే సమయానికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తప్పకుండా ముందే తెలియచేయండి. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ఇప్పుడు చాలా బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధులకు వివిధ నిబంధనలతో కూడిన బీమా రక్షణను అందిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సా వ్యయంలో సగం భారాన్ని భరిస్తుంటే, మరికొన్ని కంపెనీలు రెండు మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఉదాహరణకు స్టార్ హెల్త్ అందిస్తున్న రెడ్‌కార్పెట్ పాలసీ మొదటి ఏడాది నుంచే అప్పటికే ఉన్న వ్యాధులకూ బీమా రక్షణ అందిస్తోంది. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే అప్పటికే ఉన్న వ్యాధుల క్లెయిమ్ విషయంలో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం మర్చిపోవద్దు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మరవద్దు కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా తీసుకున్న బీమా రక్షణ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రైడర్లో ఎనిమిది నుంచి 10 తీవ్రమైన వ్యాధులకు బీమా రక్షణ లభిస్తుంది. -
పసుపు పంటకు ధీమా లేనట్లే!
బాల్కొండ : పంటల బీమాలో పలు మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పసుపు రైతులను మాత్రం పట్టించుకోలేదు. నూతన వ్యవసాయ పంటల బీమా పథకంలో పసుపు ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ప్రకృతి బీభత్సం వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు జిల్లా యూనిట్‌గా తీసుకుని బీమా క్లయిమ్ చెల్లించేవారు. కానీ కొత్త రాష్ట్రంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరికి గ్రామం యూనిట్‌గా తీసుకున్న సర్కార్.. పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, కంది, తదితర తొమ్మిది పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ఆదేశించింది. ఈ తొమ్మిది పంటల్లో పసుపు లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న ధీమా లేకుండా పోయింది. గతంలో పంట రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకర్లు బీమా ప్రీమియం మినహాయించుకుని రుణం ఇచ్చేవారు. ఎకరానికి రూ. 6 వేల బీమా ప్రీమియం వసూలు చేసేవారు. కానీ పంట నష్టపోయినా ఏనాడూ బీమా క్లయిమ్ అందలేదు. అప్పట్లో జిల్లాను యూనిట్‌గా తీసుకుని బీమా చేయడం వల్లే పరిహారం అందలేదు. జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతింటేనే అప్పట్లో బీమా క్లయిమ్ చెల్లించేవారు. దీంతో ఎప్పుడూ రైతులకు పంట ప్రమాద బీమా డబ్బులు అందలేదు. ప్రస్తుతం పంట బీమాలో మార్పులు చేయడం వల్ల కొంత మేలు జరగవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కానీ పసుపు రైతులకు ఆ సౌకర్యం కల్పించ లేదు. నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తారు. సుమారు 20 వేల హెక్టార్లకుపైగా ఈ పంట సాగవుతుంది. ఎకరం విస్తీర్ణంలో పంట సాగుకు లక్ష రూపాయలనుంచి లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసే పంటకు బీమా రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బీమా ధీమా కూడా లేదాయె!
తుపానుతో 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం రైతుకు బీమా వర్తించకుండా పోయిన వైనం రుణమాఫీ హామీతో కొత్తగా రుణాలు ఇవ్వని బ్యాంకులు అప్పులిచ్చినట్టైతే బ్యాంకులు అప్పుడే బీమా ప్రీమియం తీసుకునేవి రుణాలు రాకపోవడంతో పునరుద్ధరణ కాని పంటల బీమా దిక్కుతోచని స్థితిలో రైతాంగం హైదరాబాద్: రుణ మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ తుపానులో పంటలు కోల్పోయి న రైతుల పాలిట శాపంగా మారింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకపోవడమే కాకుండా పంటల బీమాను కూడా పునరుద్ధరించుకోలేదు. దీంతో హుదూద్ తుపాను కారణంగా భారీఎత్తున పంటలు నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. హు దూద్ బీభత్సంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. ప్రకృతి బీభత్సాలతో నష్టపోయే రైతుల్ని ఆదుకునేందుకు గ్రామం యూనిట్‌గా వర్షాధారిత పం టల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంట వేసింది మొదలు కోసిన తర్వాత పంట కల్లాల్లో ఉన్నప్పుడూ 14 రోజుల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. మామూలుగా రైతు లు ఖరీఫ్ సీజన్లో (ఏప్రిల్ నుంచి జూలై మధ్య) బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అప్పు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రైతులు వేసే పంటలకు అనుగుణంగా బీమా ప్రీమియా న్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తుంటాయి. అయితే రుణ మాఫీ హామీ నేపథ్యంలో ఏ రైతుకూ బ్యాంకులు ఇప్పటివరకు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని స్పష్టం చేయడంతో పం టల బీమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ పథకం గడువు గత నెలాఖరుతో ముగిసింది. గడువు ముగిసిన రెండు వారాల్లోపే తుపాను వచ్చి రైతులకు అపార నష్టం మిగిల్చి వెళ్లింది. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదారతపై ఆధారపడాల్సిందే తప్ప.. ఓ హక్కుగా బీమాను పొందే వీలును కోల్పోయారు. ఈనెల 22 తర్వా త తొలి విడతగా బ్యాంకులకు చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలయ్యే లోపే నష్టం జరిగింది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, మిరప, వేరుశన గ, జీడిమామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లిం ది.రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారే గానీ వ్యవసాయ బీమా గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసా య బీమా అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సం స్థలే చూస్తుంటాయి. ప్రభుత్వం నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప నిబంధనలు మార్చడానికి బీ మా సంస్థలు అంగీకరించవు. నీలం, పైలిన్ తుపాన్ల నష్టపరిహారమే ఇప్పటివరకు అందలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీమా వస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీకే నిధులకు కటకటలాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు పెట్టుబడి రాయితీని ప్రకటించారు. అరుుతే ఇది నిర్దిష్ట గడువులోపు అందితే తప్ప రైతులు కోలుకునే స్థితి లేదు. పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని, పరిహారం ఇవ్వదల్చుకుంటే ఎప్పటిలోగా ఇస్తారో ప్రకటించాలని అంటున్నారు. బీమా ఉంటే ఎకరాకు రూ. 23 వేల వరకు వచ్చేవి.. ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పడం వల్ల 90 శాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో రైతులందరూ ఖరీఫ్‌లో బీమా అర్హత కోల్పోయారు. ప్రభుత్వం లేదా రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ జరిగి ఉంటే తుపాను ప్రభావం వల్ల పంట పోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.23 వేల వరకు బీమా అందేది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఆర్బీఐ నిబంధనల మే రకు తీసుకున్న రుణ మొత్తం ఒకేసారి చెల్లిస్తే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏడాదికి 20శాతం మే ర చెల్లిస్తామంటే రైతులకు తిరిగి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వాటిని రాని బకాయిలు గా చూపి రైతులకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. పంట రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. - రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే.. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. తుపాను కారణంగా చెరకు, అరటి ఇతర పంటలన్నీ నేల కొరిగాయి. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం సంభవించింది. తిరిగి పంట వేయాలన్నా ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంక ర్లు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రభుత్వం, బ్యాంకర్లు స్పం దించకుంటే మున్ముందు పంటలు వేసుకోలేం. - సత్యనారాయణ, రైతు,సిరివాడ, తూ.గో.జిల్లా ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలి. దెబ్బతిన్న పంట పొలాలను సందర్శిస్తున్నా సహాయంపై ఇప్పటివరకు ఎవరూ మా ట్లాడటంలేదు. సర్వే చేయిస్తామని చెబుతున్నా ఎక్కడా చేయించలేదు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి. - కె.రామచంద్రరావు,సిరివాడ,తూ.గో.జిల్లా రైతులకు రెండు విధాలా నష్టం రైతులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించని పరిస్థితి ఏర్పడింది. తుపానుతో పంట కోల్పోయిన రైతులు రుణమాఫీ అందక, బీమా రాక అప్పుల ఊబిలో మరింత మునిగిపోయూరు. - దడాల సుబ్బారావు, కౌలు రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా -
తెలివిగా వాడితే క్రెడిట్ మీదే..
ఆర్థిక లావాదేవీలన్నీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కానిచ్చేస్తున్నారు. సినిమా టికెట్ దగ్గర నుంచి విమానం టికెట్ల వరకు, టెలీఫోన్ బిల్లు దగ్గర నుంచి బీమా ప్రీమియం వరకు, పెన్‌డ్రైవ్ దగ్గర నుంచి ఖరీదైన ఎల్ఈడీ టీవీ వరకు ఇలా అన్నీ ఆన్లైన్లో కొనేస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, జీరో వడ్డీరేటుకే ఈఎంఐ వంటి ఆఫర్లను ఇబ్బడిముబ్బడిగా ప్రకటిస్తున్నాయి. అందులో ఇది పండుగల సీజన్ కావడంతో ఈ ఆఫర్లు మరింత జోరందుకున్నాయి. ఈ ఆఫర్ల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకోకుండా వినియోగించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. కార్డు తీసుకునేటప్పుడు ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక ఫీజులు, వడ్డీరేట్లు, గ్రేస్ పిరియడ్, చెల్లింపులు ఆలస్యం అయితే విధించే అపరాధ రుసుము వంటి విషయాలపై పూర్తి స్పష్టత తీసుకోండి. అవసరమైతే ఈ విషయంలో క్రెడిట్ కార్డు సంస్థ నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా వార్షిక ఫీజులు ఎక్కువ ఉన్న కార్డులు దూరంగా ఉండండి. ఇక లావాదేవీల విషయానికి వస్తే సకాలంలో చెల్లించ గలిగితే అన్ని లావాదేవీలకు క్రెడిట్ కార్డును వినియోగించుకోవచ్చు. దీని వల్ల రివార్డు పాయింట్లతో పాటు ఇటు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు అన్ని కార్డులు యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై 5-10 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు మీరు రూ. 1,000 కరెంట్ బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే దానిపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే రూ. 50 తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఈ విలువకు సమానమైన రివార్డు పాయింట్లు పొందుతారు. చాలా క్రెడిట్ కార్డులు పూర్తిగా వాడిన మొత్తం కాకుండా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తాయి. తప్పని పరిస్థితుల్లో తప్ప ఈ అవకాశాన్ని వినియోగించుకోవద్దు. దీనివల్ల వచ్చే నెల చెల్లించే మొత్తం పెరగడమే కాకుండా వడ్డీ భారం పెరుగుతుంది. అంతే కాదు క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది కనిపించిన కార్డుకల్లా దరఖాస్తు చేస్తుంటారు. అనేక కార్డులు కలిగి ఉండటం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఇన్ని కార్డుల నిర్వహణ అనేది కూడా కష్టమవుతుంది. చివరగా చెప్పేది ఏమిటంటే అప్పు లభిస్తోంది కదా అని వాడకుండా తిరిగి కట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే క్రెడిట్ కార్డును వినియోగించండి. అప్పుడే పూర్తి ప్రయోజనాలను పొందుతారు. రివార్డు పాయింట్లు అన్ని కార్డులు, లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఒకే విధంగా ఉండవు. సాధారణంగా వినియోగించిన ప్రతీ రూ. 100 - 150లకు ఒక రివార్డు పాయింటును ఇస్తుంటాయి. ఇలా కూడబెట్టుకున్న రివార్డు పాయింట్లను ఉపయోగించుకొని కంపెనీ అందించే వివిధ వస్తువులు లేదా సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. 5,000 రివార్డు పాయింట్లు ఉంటే ఆ విలువకు సమానమైన వస్తువు కొనుగోలు చేయలేరు. రివార్డు పాయింట్ల మొత్తంలో 20 నుంచి 30 శాతానికి విలువైన వస్తువులను కొనగలరు. ఇప్పుడు అన్ని క్రెడిట్‌కార్డు సంస్థలు ఆన్లైన్ ద్వారానే ఈ రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న వస్తువులు సేవల్లో రిడీమ్ పాయింట్లకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. రిడీమ్ పాయింట్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఒకటి నుంచి మూడేళ్లుగా ఉంటుంది. అలాగే ఈ పాయింట్లను రీడీమ్ చేసుకున్నప్పుడు చాలా కంపెనీలు సర్వీస్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి. -
బీమాపై రైతులకేదీ ధీమా?
ప్రీమియం చెల్లించేందుకు పదిరోజులే గడువు రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల విముఖత రైతులు నష్టపోయినా పరిహారం లేనట్టే గడువు నెల రోజులు పొడిగించాలని వినతి నర్సీపట్నం రూరల్: పంటల బీమా ఈ ఏడాది ఖరీఫ్‌లో నిరుపయోగం కానుంది. ఒకవైపు బీమా గడువు ముగుస్తోంది. మరోవైపు పంటల సాగు, రుణాల పంపిణీ ముందుకు సాగలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.27 లక్షల హెక్టార్లలో వరితో పాటు కంది, పెసర, మిరప, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయాలని లక్ష్యం చేసుకున్నారు. రైతు పంట నష్టపోతే ఆదుకునేందుకు జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పంటలకు విధించిన గరిష్ట పరిమితిలో 12.5 శాతాన్ని ప్రీమియం గా చెల్లించాలని షరతు విధించింది. దీనిలో 5 శాతం ప్రభుత్వం భరిస్తుం డగా, మిగిలిన దాన్ని రైతే నేరుగా చెల్లించాలి. ప్రీమియం చెల్లించేందుకు జూలై నెలాఖరు వరకు గడువుంది. ఈ ప్రీమియాన్ని రుణం తీసుకున్న రైతు ఖాతా నుంచి మినహాయించేవారు. రుణం తీసుకోని రైతుల నుంచి నేరుగా అధికారులు వసూలు చేసేవారు. జిల్లాలో అధిక శాతం రైతులు వారు తీసుకున్న రుణాల నుంచే బీమా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.700 కోట్ల రుణాలివ్వాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. రుణాల రీ షెడ్యూల్ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో బ్యాంకులు ఖరీఫ్ రైతులకు ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో నాట్లు వేయలేదు. ప్రస్తుతం విత్తనాలు వేసి, నారు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీమా ప్రీమియం చెల్లించేందుకు వీల్లేక పోయింది. రైతులు పంటలు సాగు చేశాకే బీమా ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉండటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఖరీఫ్ రైతులకు అన్ని విధాలుగా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో బీమా చెల్లించేందుకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి మరో పది రోజులే గడువుండటంతో ఏం చేయాలో పాలుపోక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరో నెల రోజులైనా గడువు పొడిగించకపోతే నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. -
బీమా ధీమా లేనట్టే !
రుణ మాఫీపై ప్రభుత్వం ఎటూ తేల్చని దుస్థితి! రుణాల రీషెడ్యూలుపై కూడా సర్కారుది దాటవేతే కొత్త రుణాల పంపిణీకి బీమా ప్రీమియంకు లింకు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఖరీఫ్‌లో రైతుకు బీమాపై ధీమా సన్నగిల్లుతోంది. కొత్త రుణాలు పంపిణీ చేస్తే.. అందులోనే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుంటారన్న రైతన్న ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రుణ మాఫీపై స్పష్టత ఇచ్చేదాకా కొత్త రుణాల పంపిణీ చేసే ప్రసక్తే లేదని బ్యాంకర్లు స్పష్టీకరిస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగుచేస్తారు. వరి, కంది, మిరప వంటి పంటలు మరో 1.50 లక్షల హెక్టార్ల వరకూ సాగుచేస్తారు. వేరుశనగకు వాతావరణ బీమా.. వరి, కంది పంటలకు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వీటికి ప్రీమియం చెల్లింపు గడువును ఈనెల 31గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది రూ.2,793 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయించారు. కానీ.. ఇప్పటిదాకా ఒక్క రూపాయిని కూడా కొత్తగా పంట రుణాల రూపంలో ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు ప్రభుత్వ వైఖరే. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రుణ మాఫీ చేయడం బదులు.. విధి విధానాలను రూపొందించడానికి కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏమైందన్నది చంద్రబాబుకే ఎరుక. ఈలోగా రుణాల రీషెడ్యూలును తెరపైకి తెచ్చారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాత్రం కరవు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూలు చేసేందుకు అంగీకరించింది. 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు రూ.1,438 కోట్లను పంట రుణాలుగా పొందారు. అంటే.. ఆర్బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల పంట రుణాలు మాత్రమే రీషెడ్యూలు చేస్తారన్న మాట. అదీ కూడా రీషెడ్యూలు చేసిన రుణాలను మూడేళ్లలోగా చెల్లిస్తామన్న షరతుకు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరిస్తేనే..! ఆర్బీఐ నిబంధనలకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్కిన 7.50 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధన రూపంలో అందిస్తే ఆ రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. అటు ఆర్బీఐ విధించిన షరతుకుగానీ.. ఇటు బ్యాంకర్ల డిమాండ్కుగానీ చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. పంట రుణాల మాఫీపై రోజుకో మాట మాట్లాడుతోంది. రుణల మాఫీపై స్పష్టత వస్తేనే కొత్తగా పంట రుణాలు పంపిణీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. పంట రుణాలు పంపిణీ చేసే సమయంలోనే వాతావరణ, పంటల బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని సంబంధిత రైతుల పేర్లపై జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు. కానీ.. ఇప్పుడు కొత్తగా పంట రుణాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు నగదు రూపంలో బీమా ప్రీమియం చెల్లించే పరిస్థితి లేదు. ఇప్పటికే కరవు మేఘం ఉరుముతోంది. అరకొర పదునులో సాగుచేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పంట నష్టపోతే పరిహారం వస్తుందన్న ధీమా కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో తరిగిపోతున్న పెయ్యి దూడలను వృద్ధి చేసేందుకు ఆ దూడల్ని పెంచుతున్న పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. ‘సునందిని’ పథకం ద్వారా ఈ దూడల్ని అభివృద్ధి చేస్తున్నారు. 9వేల పెయ్యి దూడల్ని జిల్లాలో వృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.3,62,25,000 నిధుల్ని ఈ శాఖ కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం బాగా వర్తింపజేసేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఒక్కో రైతు రెండేసి దూడలకు ఈ ప్రోత్సాహకాలు తీసుకునేలా అవకాశం కల్పించారు. రైతు ఇంట గేద లేక ఆవుకు ఈనికలో వచ్చిన 3-4నెలల వయసున్న పెయ్యిదూడను స్థానిక వెటర్నరీ వైద్యాధికారి నిర్ధారిస్తారు. అలాంటి దూడకు సంబంధించిన యూనిట్ ధర రూ.5వేలు ఉంది. గేద లేక ఆవు పెయ్యి దూడ ఒక్కో దూడకు చెందిన పాడిరైతు తన వాటాగా రూ.975 చెల్లించాలి. పశు సంవర్థక శాఖ తన వాటాగా 4,025 ఇస్తోంది. దూడ దాణాకే రూ.4,100 కేటాయించారు. నెలనెలా డీవార్మింగ్‌కు రూ.300 కేటాయిస్తారు. దూడకు బీమా పాడి రైతుకు ధీమా... లబ్ధిదారుడు చెల్లించిన రూ.975లో ఒక్కోదూడకు రూ.600 బీమా ప్రీమియంకే చెల్లిస్తారు. రెండేళ్ల వరకూ ఈ బీమా దూడకు పనిచేస్తుంది. ప్రీమియం చెల్లించిన తొలి 15రోజుల వరకూ బీమా వర్తించదు. ఆరు నెలల దూడ చనిపోతే రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు, ఏడాదిన్నరకు రూ.15వేలు, రెండేళ్లకు రూ.20వేల చొప్పున బీమా ఇస్తారు.