ఊరును బట్టే బీమా ప్రీమియం! | If treatment of the trouble zone | Sakshi
Sakshi News home page

ఊరును బట్టే బీమా ప్రీమియం!

Published Mon, Dec 28 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

ఊరును బట్టే బీమా ప్రీమియం!

ఊరును బట్టే బీమా ప్రీమియం!

వేణుది విశాఖపట్నం. రెండు వారాల పాటు పని ఉండటంతో ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీలో ఉండగా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేయించుకుని, ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. ఆ తరవాత రీయింబర్స్ నిమిత్తం ఆసుపత్రికి చెల్లించిన రూ.50 వేల బిల్లును బీమా కంపెనీకి సమర్పించాడు. వేణుకి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంది. 100 శాతం రీయింబర్స్ వచ్చే అవకాశమూ ఉంది. కానీ కంపెనీ మాత్రం వేణుకి రూ.40 వేలే చెల్లించింది. ఎందుకో తెలుసా?
 

* జోన్ ఆధారంగా కంపెనీల హెల్త్ పాలసీలు  
* ట్రీట్‌మెంట్‌లో జోన్ మారితే మాత్రం ఇబ్బందే
* తీసుకున్న జోన్ ఆధారంగానే కంపెనీల చెల్లింపు

ఎందుకంటే వేణు బీమా తీసుకున్న కంపెనీ భౌగోళిక జోన్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తోంది. వేణు బీమా తీసుకున్నది జోన్-2 సిటీలో. ప్రీమియం కూడా అక్కడి ధరల ఆధారంగానే చెల్లించాడు. కానీ చికిత్స చేయించుకున్నది జోన్-1 కిందికి వచ్చే నగరంలో. ఎందుకంటే జోన్-1 నగరంలో బీమా తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. అందుకే రీయింబర్స్‌లో ఆ తేడా.

మరో రకంగా చూసినా... ఒకవేళ వేణు బీమా తీసుకున్న విశాఖలోనే ఆ చికిత్స కూడా చేయించుకున్నట్లయితే ఢిల్లీ కన్నా రేట్లు తగ్గి ఉండేవి కదా? అదీ కంపెనీ లాజిక్. తాము వేణు బీమా తీసుకున్న విశాఖపట్నంలోని వైద్య ఖర్చుల ఆధారంగానే బీమా ప్రీమియం నిర్ణయించామన్నది కంపెనీ వాదన.
 
క్లెయిమ్‌లు కూడా తక్కువే...
కంపెనీల డేటా చూస్తే... టైర్-1 నగరాల్లో ఉండేవారి బీమా క్లెయిములు కూడా ఎక్కువే. వారితో పోలిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో ఆరోగ్య బీమా క్లెయిములు చాలా తక్కువ. ‘‘టైర్ -1 నగరాల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాన్నే మిగతా నగరాల వారికీ వర్తింపజేసి వారిపై భారం మోపటం ఇష్టంలేక కంపెనీలు జోన్ ఆధారిత ప్రీమియాలను వసూలు చేస్తున్నాయి’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ వ్యవస్థాపక సీఈఓ నావల్ గోయెల్ చెప్పారు.

మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ హెల్త్ ఇన్సూరెన్స్, సిగ్నా టీటీకే ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటివి ఈ జోన్ ఆధారిత పాలసీలు అందిస్తున్నాయి. ఇవి నగరాల్ని, పట్టణాల్ని జోన్-1, జోన్-2, జోన్-3గా విభజించాయి. జోన్-3లో పాలసీ తీసుకునేవారు జోన్-2లో తీసుకున్న వారి కన్నా 10 శాతం తక్కువకే పాలసీ పొందొచ్చు.

అలాగే జోన్-1లో ఉన్నవారు జోన్-2లో వారికన్నా 10 శాతం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. ‘‘జోన్ ఆధారిత ధరలనేవి ఇష్టప్రకారం ఎంచుకునేవి కాదు. కంపెనీయే పాలసీ తీసుకున్న ప్రాంతాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తుంది. కానీ వారు ఏ నగరంలోనైనా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అయితే పాలసీలో మాత్రం ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అందరికీ ఒకేలా పూర్తిస్థాయి సేవలందుతాయి’’ అని గోయెల్ వివరించారు. ప్రీమియం ఒక్కటే ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నారు.

పాలసీదారు కనక చిరునామా మారితే అది కంపెనీకి తెలియజేయాలని, ఒకవేళ జోన్ మారితే దాని ఆధారంగా ప్రీమియం ఛార్జీలను కంపెనీ సవరిస్తుందని మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సోమేష్ చంద్ర తెలియజేశారు.
 
ఉదాహరణకు ఢిల్లీ వంటి జోన్-1 నగరంలో మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ పాలసీ తీసుకుంటే రూ.3 లక్షల కవరేజీకి ఏడాదికి రూ.7,044 చెల్లించాల్సి ఉంటుంది. అదే విశాఖ వంటి టైర్-2 సిటీలోనైతే రూ.6,340 చెల్లిస్తే చాలు. అయితే జోన్-3లోనో, 2లోనో పాలసీ తీసుకుని... జోన్-1లో ట్రీట్‌మెంట్ తీసుకున్నవారికి ఈ పాలసీలతో ఇబ్బందేనని గోయెల్ చెప్పారు. అందుకే తాము ఏ జోన్‌లో చికిత్స తీసుకునే అవకాశం ఉందో... ఆ జోన్‌నే పేర్కొంటూ పాలసీ తీసుకోవటం ఉత్తమమని చెప్పారాయన.

చాలా కంపెనీలు జోన్-3 నుంచి జోన్-2కు, అలాగే జోన్-1కు మారటానికి అంగీకరించవని, అలాంటపుడు ప్రీమియంలో తేడా మొత్తాన్ని చెల్లిస్తే అంగీకరిస్తాయని తెలియజేశారు. కాకపోతే ఈ జోన్‌ల విషయంలో కంపెనీలన్నీ ఒకేరకంగా లేవు.  కొన్ని నగరాల్ని కొన్ని కంపెనీలు జోన్-2గా పేర్కొంటే... మరికొన్ని కంపెనీలు జోన్-1గా పేర్కొంటాయి. ఈ తేడాల్ని ముందే చూసుకోవాలనేది గోయెల్ సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement