
బీమా చేసిన వ్యక్తి ఆవరణలో కాకుండా మరెక్కడైనా వాహనాన్ని ఉపయోగించి ప్రమాదం జరిగితే బీమా(Insurance) సంస్థ బాధ్యత వహించదనే పాలసీ షరతు అసంబద్ధమని సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ చేసిన వాహనం క్రేన్ కావడంతో కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రేన్లను ఉపయోగిస్తారని తెలియజేస్తూ, ఈ పరిస్థితిని ఇరు పక్షాలు వివిధ స్థాయుల్లో పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
పాలసీదారుడు తన టాటా హిటాచీ హెవీ డ్యూటీ క్రేన్‌కు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బీమా తీసుకున్నాడు. 2007లో జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ వద్ద పనులు నిర్వహిస్తుంటే క్రేన్ ప్రమాదానికి గురైంది. దాంతో పాలసీ క్లెయిమ్ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కంపెనీ తన పాలసీను తిరస్కరించింది. అందుకు పాలసీ షరతులను కారణంగా చూపింది. ప్రమాదం వల్ల నష్టం జరిగినప్పటికీ బీమా చేసిన వ్యక్తి ఆవరణ వెలుపల వాహనాన్ని ఉపయోగించినట్లయితే బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతును ఉటంకిస్తూ క్లెయిమ్‌ను తిరస్కరించింది. దాంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇలాంటి షరతు సహేతుకం కాదని, ముఖ్యంగా క్రేన్లను సాధారణంగా కార్యాలయ ఆవరణలో కాకుండా నిర్మాణ ప్రదేశాల్లోనే ఉపయోగిస్తారని వివరించింది. పాలసీ కొనుగోలు, రెన్యువల్ సమయంలో ఈ షరతును పరిష్కరించకపోవడంపై కోర్టు ఇరు పక్షాలపై అసహనం వ్యక్తి చేసింది. బీమా కంపెనీలు పాలసీదారులకు స్పష్టమైన, న్యాయమైన నిబంధనలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాలసీదారుకు వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.
ఇదీ చదవండి: ఎఫ్‌ఐఐల తీరుపై ఉదయ్‌కోటక్ స్పందన
ఈ తీర్పు బీమా పరిశ్రమలో అనుసరిస్తున్న కొన్ని షరతులను సడలించేలా చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారిందని కొందరు భావిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, బీమా పాలసీల్లో పారదర్శకతను పెంపొందించడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పు హైలైట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment