
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్‌లో (ఐఎఫ్‌ఎస్‌సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు.
వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్‌ఎస్‌సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్‌నర్ ఆదిత్య హన్స్ చెప్పారు.