బడ్జెట్ ప్రతిపాదనల ఎఫెక్ట్
క్యూ3 ఫలితాలకూ ప్రాధాన్యం
విదేశీ అంశాలూ కీలకమే
ఈ వారం ట్రెండ్‌పై నిపుణులు
ముంబై: లోక్‌సభలో వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్పందించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రంగాలవారీగా పెట్టుబడుల కేటాయింపులు, పథకాలు తదితర ప్రతిపాదనల ఆధారంగా స్టాక్స్ కదలికలు నమోదుకానున్నట్లు తెలియజేశారు. రూ. 12 లక్షలవరకూ ఆదాయంపై పన్ను చెల్లింపులు లేకపోవడంతో శనివారం ట్రేడింగ్‌లో వినియోగ రంగ కౌంటర్లు జోరు చూపాయి.
బీమా రంగానికి బూస్ట్‌నిస్తూ ఇప్పటివరకూ 75 శాతంగా అమలవుతున్న ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బడ్జెట్‌లో యువత, మహిళలు, రైతులకు సైతం మద్దతుగా పలు చర్యలు ప్రతిపాదించారు. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరిన్ని రంగాలవైపు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వినియోగ రంగం మరింత జోరు చూపవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా, యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ప్రణవ్ హరిదాసన్ అంచనా వేశారు.
7న పాలసీ నిర్ణయాలు
కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్‌లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
దిగ్గజాలు రెడీ
ఈ ఏడాది(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే వేడెక్కింది. మరిన్ని దిగ్గజాలు ఈ వారం క్యూ3((అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఎల్‌ఐసీ, టైటన్, ఎన్‌హెచ్‌పీసీ, టాటా పవర్, పీసీ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు వివిధ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకునే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోనున్నట్లు ఏంజెల్ వన్ డెరివేటివ్స్ సీనియర్ విశ్లేషకులు ఓషో కృష్ణన్ పేర్కొన్నారు.
ఇతర అంశాలు
ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ మార్కెట్లో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఇటీవల బలహీనపడుతుంటే చమురు ధరలు పటిష్టంగా కదులుతున్నాయి. మరోపక్క యూఎస్ డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ మరింత పుంజుకుంటే సెంటిమెంటుపై ప్రభావంపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఎఫ్‌పీఐలు 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లు అంచనా.
గత వారమిలా
గత వారం(జనవరి 27–ఫిబ్రవరి1) దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ నికరంగా 1,316 పాయింట్లు(1.7 శాతం) బలపడి 77,506 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 390 పాయింట్లు(1.7 శాతం) పుంజుకుని 23,482 వద్ద స్థిరపడింది. కాగా.. ఎఫ్‌పీఐల అమ్మకాల కారణంగా జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం క్షీణించగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ 9 శాతం చొప్పున పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment