
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్‌లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్‌లోని నిర్దిష్ట డేటా, మ్యాప్‌లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్‌పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి.