Private Sector
-
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్‌ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్‌పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
ఇక వాహనాల తుక్కు యూనిట్లు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది. అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్‌కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు. తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది. జిల్లాకు రెండు యూనిట్లు జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్నెస్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్‌ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ..గుజరాత్‌ను అధిగమించి సత్తా
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్‌కు డిమాండ్.. గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది. విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
విస్తృతంగా వసతులు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్‌ను అభివృద్ధి చేసేలా నూతన పారిశ్రామిక విధానం 2023–27లో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే పార్కుల్లో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నివాసానికి అనువుగా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. నివాసం నుంచి ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లే విధంగా వాక్ టు వర్క్ విధానంలో పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో ఉన్న 10 పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదు పార్కులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. కేవలం భారీ పారిశ్రామిక పార్కులే కాకుండా పీపీపీ విధానంలో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్ చైన్లను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలను పారిశ్రామిక పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు ప్రైవేట్ రంగంలో పార్కులు అభివృద్ధి చేసేందుకు కనీస ప్రారంభ పెట్టుబడి రూ.200 కోట్లుగా నిర్ణయించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కనీసం 50 ఎకరాలకుపైగా ఉండాలి. అదే ఏపీఐఐసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పోతే కనీస పరిమితిని 100 ఎకరాలుగా నిర్ణయించారు. అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులో నివాస, వాణిజ్య సముదాయాల పరిమితి 33 శాతం మించి అనుమతించరు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ కోసం 33 శాతం కేటాయించాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ రంగంలో పార్కును అభివృద్ధి చేస్తే ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి భూమిని బదలాయించాలి. ఒకవేళ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటే ఎస్పీవీలో పెయిడ్ క్యాపిటల్‌గా 2 – 11 శాతం వాటా ప్రభుత్వానికి కేలాయించాల్సి ఉంటుంది. ఈ పార్కులో 90 శాతం వినియోగంలోకి వచ్చిన తర్వాత వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ డెవలపర్ పార్కును అభివృద్ధి చేయడానికి వస్తే దీర్ఘకాలిక లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రైవేట్ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేయడంలో డెవలపర్ విఫలమైతే ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి పారదర్శకంగా బిడ్డింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పీపీపీ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ డెవలపర్స్ ఎంపిక జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో కూడా ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రెడీ టు బిల్డ్.. అంటే తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకునే విధానంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను కనీనం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పార్కుల మౌలిక వసతుల నిర్మాణ వ్యయంలో 25 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. స్టాంప్ డ్యూటీ, భూ వినియోగ మారి్పడి చార్జీలు (నాలా) వంద శాతం రీయింబర్స్చేస్తారు. రుణాలపై మూడేళ్లపాటు మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కులో 50 శాతం వినియోగంలోకి రాగానే 50 శాతం ప్రోత్సాహకాలు అందిస్తారు. 100 శాతం వినియోగంలోకి వస్తే మిగిలిన 50 శాతం కూడా చెల్లిస్తారు. లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, శీతల గిడ్డంగుల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ రంగంలో లాజిస్టిక్ పార్కులు, ఇన్లాండ్ కంటైనర్ డిపోలను అభివృద్ధి చేయడానికి కనీస పెట్టుబడిని రూ.50 కోట్లుగా నిర్ణయించారు. గోడౌన్ల నిర్మాణానికి రూ.5 కోట్లు, శీతల గిడ్డంగులకు రూ.3 కోట్లుగా నిర్ణయించారు. లాజిస్టిక్స్ వేర్‌హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడంతోపాటు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ల రిజిస్ట్రేషన్స్ వ్యయంలో 75 శాతంతో పాటు పారిశ్రామిక పాలసీ 2020–23లో పేర్కొన్న రాయితీలను వర్తింపచేస్తారు. -
ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్‌పై నిర్వహించిన 10వ వెబినార్‌లో భాగంగా ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మూలధన వ్యయాల లక్ష్యాన్ని చారిత్రక గరిష్ట స్థాయి అయిన రూ.10 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి ప్రశంసలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీసహా ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల పన్నుల భారం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని.. 2013–14 నాటికి 11 లక్షల కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2023–24 నాటికి రూ.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు. -
విశ్రాంత జీవనం.. హాయిగా..!
ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్శాల’ వ్యవస్థాపకులు వివేక్ లా ఏం చెబుతున్నారో చూద్దాం... రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. చేస్తున్న పనికే రిటైర్మెంట్ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది. వాయిదా సరికాదు.. రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది. కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్ ఫండ్ కావాలి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ 45–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్ ఫండ్ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు. 25–30 ఏళ్ల కెరీర్లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది. ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది. అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అవ్వడంతో, వారికి పెన్షన్ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్ పెన్షన్ అనేది లేదు. ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగులు లేదని చెప్పుకోవద్దు.. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెటు మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. సమకూర్చుకునేది ఎలా? రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్‌కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు నెరవేరతాయి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. -
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీఓ ఓకే
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) విజయవంతమైంది. మంగళవారం(31) చివరిరోజుకల్లా పూర్తిస్థాయిలో బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 5.08 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. నాన్రిటైల్ ఇన్వెస్టర్లు ప్రధానంగా భారీ సంఖ్యలో బిడ్స్ దాఖలు చేయడం ఇందుకు సహకరించింది. నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 96.16 లక్షల షేర్లను రిజర్వ్ చేయగా.. మూడు రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 1.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి అంతంతమాత్ర స్పందనే లభించినట్లు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. రిటైలర్లకు 2.29 కోట్ల షేర్లు కేటాయించగా.. 12 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగులకు పక్కనపెట్టిన 1.62 లక్షల షేర్లకుగాను 55 శాతానికే స్పందన లభించింది. ఎఫ్పీవోకింద కంపెనీ మొత్తం 6.14 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. యాంకర్ ఇన్వెస్టర్లుసహా ఇతరుల నుంచి 6.45 కోట్ల షేర్లకు డిమాండ్ నమోదైంది. షేరు అప్ ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. ఇష్యూ ముగింపు నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం బలపడి రూ. 2,975 వద్ద ముగిసింది. గత వారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 33 ఫండ్స్‌కు 1.82 కోట్ల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 3,276 ధరలో జారీ చేసింది. షేర్లను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్ల జారబితాలో అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరాలి, గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ (మారిషస్), మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్), నోమురా సింగపూర్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషన్ తదితరాలున్నాయి. యాంకర్బుక్లో దేశీ దిగ్గజాలు ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ తదితరాలున్నాయి. ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,689 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత ఎయిర్‌పోర్టుల పనులు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తదితరాలకు వినియోగించనుంది. -
ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్, స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంకు దేశీ ప్రయివేట్ రంగ సంస్థగా కొనసాగనున్నట్లు ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. వ్యూహాత్మక విక్ర యం తదుపరి మిగిలిన 15% ప్రభుత్వ వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్‌గా పరిగణించనున్నట్లు తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా(ఎంపీఎస్) విషయంలో బ్యాంకు కొత్త యాజమాన్యానికి అధిక గడువును అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బ్యాంకును గెలుపొందిన బిడ్డర్ అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణను చేపట్టడంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. బ్యాంకు కొనుగోలులో భాగంగా ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సందేహాలకు సమాధానమిచ్చే ప్రక్రియకింద ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ఈ అంశాలపై వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకు విక్రయానికి ప్రభుత్వం అక్టోబర్ 7న బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. డిసెంబర్ 16కల్లా కొనుగోలుదారులు ఈవోఐలను దాఖలు చేయవలసి ఉంటుంది. సంయుక్తంగా విక్రయం ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. పబ్లిక్ వాటా 5.2 శాతంగా నమోదైంది. దీంతో కొనుగోలుదారుడు 5.28 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి వస్తుంది. విక్ర యంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభు త్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
విక్రమ్–ఎస్ ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు. ప్రైవేట్‌రంగంలో తొలి రాకెట్ కావడంతో దీనిని ప్రారంభ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రాకెట్ మూడు అతిచిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ పేలోడ్స్ రోదసీలో భూమికి అతి తక్కువ దూరం అంటే 81 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ఇది 83 కేజీల మూడు పేలోడ్స్‌ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఘన ఇంధనంతో కూడిన సింగిల్ స్టేజ్ రాకెట్ కావడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్ ద్వారా స్పేస్‌కిడ్జ్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థకు చెందిన 2.5 కేజీల ఫన్–శాట్‌ను కక్ష్యలోకి పంపుతున్నారు. దీనిని ఐఐటీ విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు సంయుక్తంగా తయారుచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్–స్పేస్ టెక్, ఆర్మేనియాకు చెందిన బజూమ్‌క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన పేలోడ్లను రాకెట్ మోసుకెళ్లనుంది. -
‘విక్రమ్’ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా ప్రైవేట్‌రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది. నవంబర్ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు. -
విస్తరణపై ‘ప్రైవేట్’ దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు. కార్పొరేట్ సుపరిపాలన కారణంగా సీపీఎస్ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు. దీంతో వాటాదారులకు సీపీఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్‌లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ), కంటెయినర్ కార్పొరేషన్(కంకార్), వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్‌కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు. -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
ప్రైవేట్‌పై నమ్మకమే అభివృద్ధికి దన్ను
గాంధీనగర్: దేశ పురోగతి, అభివృద్ధి సాధనలో ప్రైవేట్ రంగంపై నమ్మకం ఉంచడం కీలకమని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని విశ్వసించిందని, దేశ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి.. ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో ఉండేలా పరిశ్రమను ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. అలాగని ప్రైవేట్ రంగంలో లోపాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ .. ప్రైవేట్ రంగాల సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని చూస్తే ప్రైవేట్ వైపే సానుకూలాంశాల మొగ్గు కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఈ 60–65 ఏళ్లు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను చూసిన మీదట .. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంపై ఆధారపడటం ద్వారా భారత్ ముందుకు వెళ్లగలదు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు‘ అని భార్గవ చెప్పారు. మారుతీ సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాబోయే 10–20 ఏళ్లలో దేశీయంగా ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై స్పందిస్తూ భార్గవ ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అంత సమర్ధమంతంగా లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిమితులు, లీగల్ విధానాలు, అలాగే నియంత్రణలు.. పర్యవేక్షణ మొదలైన అంశాలు కారణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు భార్గవ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, దివాలా కోడ్, జీఎస్టీ అమలు, కార్పొరేట్ ట్యాక్స్‌లను తగ్గించడం మొదలైన సంస్కరణలు ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ‘కొన్నేళ్ల క్రితం దేశీయంగా పారిశ్రామిక వృద్ధిపై నేను నిరాశావాదంతో ఉన్నాం. బోలెడన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏదీ జరిగేది కాదు. కానీ ఒక్కసారిగా సంస్కరణల రాకతో భారత్ మారుతోందని నాకు తోచింది. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని అనిపించింది‘ అని భార్గవ తెలిపారు. ఈసారి అత్యధిక ఉత్పత్తి.. సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డులు నమోదు చేయగలదని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ‘భారత్‌లోను, కార్ల పరిశ్రమలోను 2022–23లో ఉత్పత్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. నేను కేవలం మారుతీ గురించి మాట్లాడటం లేదు. మొత్తం కార్ల పరిశ్రమ గురించి చెబుతున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. 2018–19లో దేశీయంగా రికార్డు స్థాయిలో 33,77,436 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 30,69,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. -
నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్‌ను కేటీఆర్ సందర్శించి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్‌ఫోన్ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది.. తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి
సాక్షి, హైదరాబాద్: దేశ మౌలిక వసతుల వ్యవస్థను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేటు రంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్‌కు పుష్కలమైన శక్తి సామర్థ్యాలున్న ప్రస్తుత సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలన్నారు. మౌలిక వసతుల వృద్ధిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు. శనివారం సీఈవో క్లబ్స్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తోందన్నారు. పారిశ్రామిక రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, పోటీ వాతావరణంలో సృజనాత్మకంగా ముందుకెళ్లాలని కోరారు. సంపదను పెంచుకోవడంతోపాటు ఉపాధి కల్పనకు బాటలు వేయాలని సూచించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సమన్వయం అవసరమని సూచించారు. డిజిటల్ సేవలు, తయారీ రంగం వంటి ఎన్నో రంగాల్లో మన దేశంలో అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. కావలసిందల్లా వాటిని గుర్తించి, ప్రోత్సహించి సద్వినియోగపరచుకోవడమేనని చెప్పారు. కార్యక్రమంలో సీఈవో క్లబ్స్ అధ్యక్షుడు శ్రీ కాళీప్రసాద్ గడిరాజు, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ కృష్ణ ఎల్ల, సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల, ట్రెండ్ సెట్ బిల్డర్స్ చైర్మన్ డాక్టర్ కె.ఎల్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యవిద్యా రంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించండి..ప్రైవేట్ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: భాషాపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ మన విద్యార్థులు ఇతర చిన్నచిన్న దేశాలకు సైతం వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోకడను నివారించేందుకు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యకు అవసరమైన భూ కేటాయింపులకు రాష్ట్రాలు సులభమైన విధానాలను తీసుకురావాలన్నారు. దేశంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని మన వద్దనే తయారు చేసుకోవచ్చని చెప్పారు. శనివారం ప్రధాని కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యరంగానికి కేటాయింపులపై ఒక వెబినార్‌లో ప్రసంగించారు. దేశంలోనే వైద్య విద్యకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న మన వైద్యులు తమ నైపుణ్యంతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు పనులు సాగుతున్నట్లు వివరించారు. -
ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెరగనున్న జీతాలు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో గత రెండు సంవత్సరాలుగా వేతనాల విషయంలో నిరాశను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ ఏడాది పంట పండనుంది. వారి వేతనాలు 9 శాతం వరకు పెరగొచ్చని ‘మెర్సర్స్ టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ తెలిపింది. 2020లో వేతన పెంపులు తగ్గడం తెలిసిందే. కానీ, ఈ ఏడాది కరోనా పూర్వపు స్థాయిలో వేతన పెంపులను కంపెనీలు చేపట్టొచ్చని ఈ సర్వే పేర్కొంది. 988 కంపెనీలు, 5,700 ఉద్యోగ విభాగాలకు సంబంధించి అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. కన్జ్యూమర్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలు 2022లో ఇతర రంగాల కంటే అధిక వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఈ సర్వే తెలిపింది. ‘‘సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయమై కరోనా పూర్వపు స్థాయిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం కీలకమైన సానుకూలత. 2022లో అన్ని రంగాల్లోనూ వేతన పెంపు 9 శాతంగా ఉండనుంది. 2020లో ఇది 7.7 శాతమే. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్‌ను ఇది తెలియజేస్తోంది’’ అని రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ మన్సీ సింఘాల్ పేర్కొన్నారు. ►సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్అండ్డీ, విక్రయాలకు ముందు సేవలు, డేటా సైన్సెస్ విభాగాల్లో 12 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి. ► టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వారికి ఈ ఏడాదే కాకుండా, రానున్న రోజుల్లోనూ ఎక్కువ వేతన ప్రయోజనాలు లభించనున్నాయి. ►ఆరంభ స్థాయి ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాల రూపంలో ఫ్రెషర్లను తీసుకుంటున్నందున.. టెక్నో ఫంక్షనల్ బాధ్యతల్లోని వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది. -
‘ప్రైవేటు’తోనే ఉద్యోగావకాశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పెట్టుబడులే ఆర్థికాభివృద్ధికి చోదకాలని, ఆర్థికాభివృద్ధి లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించ లేమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి చర్యలతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు వెల్ల డించారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమ్మిళిత అభివృద్ధి, రవాణా వనరుల అనుసంధానం బడ్జెట్‌కు 4 మూల స్తంభాలన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు బడ్జెట్లో భారీగా రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించామన్నారు. ప్రజలపై భారం మోపేలా ఎలాంటి పన్నులను పెంచలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో ఆహార పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణం దిగి వస్తోందన్నారు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని జారీ అవకాశాలపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు అవుతుందని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రగతిశీల బడ్జెట్‌ను కేంద్రం తీసుకొచ్చిందని ఆస్కీ చైర్మన్ కె.పద్మనాభయ్య అన్నారు. -
పెట్టుబడులు పెంచండి
న్యూఢిల్లీ: ‘టీమ్ ఇండియా’ (భారత జట్టు)లో చేరి, భారత ప్రభుత్వ మూలధన వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచాలని ప్రైవేటు రంగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరాల్లోనూ భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా గుర్తింపు నిలబెట్టుకునేందుకు సాయంగా నిలవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లను చేరుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేటు రంగం నుంచి సైతం ఇతోధిక పెట్టుబడులకు మార్గం చూపుతుందన్నారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులకు ఇది అవకాశాల తరుణం. మీ సామర్థ్యాలను విస్తరించుకోండి. కరోనా మహమ్మారి రావడానికి ముందుతో పోలిస్తే కార్పొరేట్ పన్ను తగ్గించాం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను’’ అంటూ పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం గమనార్హం. ‘‘ముందుకు రండి. వీలైనంత మెరుగ్గా కృషి చేయండి. టీమ్ ఇండియాలో భాగస్వాములై ఈ ఏడాది, వచ్చే ఏడాది, తర్వాతి సంవత్సరాల్లోనూ భారత్ మెరుగైన వృద్ధి నమోదు చేసేందుకు మద్దతుగా నిలవండి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. -
క్యూ2లో టాటా స్టీల్ జోరు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 12,548 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,665 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39,158 కోట్ల నుంచి రూ. 60,554 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,000 కోట్ల నుంచి రూ. 47,135 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 7.25 మిలియన్ టన్ను(ఎంటీ)ల నుంచి 7.77 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు మాత్రం 7.93 ఎంటీ నుంచి 7.39 ఎంటీకి వెనకడుగు వేశాయి. కాగా.. స్టాండెలోన్ నికర లాభం రూ. 2,539 కోట్ల నుంచి రూ. 8,707 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 21,820 కోట్ల నుంచి రూ. 32,964 కోట్లకు జంప్‌చేసింది. నాట్‌స్టీల్ విక్రయం..: సింగపూర్ అనుబంధ సంస్థ నాట్‌స్టీల్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. దేశీ బిజినెస్‌తోపాటు.. యూరోపియన్ కార్యకలాపాలు సైతం పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అయితే బొగ్గు ధరలు, ఇంధన వ్యయాల కారణంగా భవిష్యత్‌లో మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. 5 ఎంటీ వార్షిక సామర్థ్యంతో చేపట్టిన కళింగనగర్ రెండో దశ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ బీఎస్ఎల్ విలీనాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇటీవలే అధిక నాణ్యతగల గంధల్పాడ ఇనుపఖనిజ గనులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రూ. 11,424 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,299 వద్ద ముగిసింది. రూ. 1,324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.