
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేటు కోత
న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి చేరింది. జూన్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కనీస రుణ రేటు తగ్గడం వల్ల దీనితో అనుసంధానమైన వాహన, గృహ, విద్యా రుణ రేట్లు తగ్గే వీలుంటుంది. ఇంతక్రితం ఏప్రిల్ 13న బ్యాంక్ రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతానికి చేరింది. తాజా నిర్ణయంతో ఈ రేటు మరో 15 బేసిస్ పాయింట్లు తగ్గినట్లయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2న రెపో రేటును పావుశాతం తగ్గించింది. ఈ ఏడాది మొత్తంలో 0.75 శాతం తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనంలో కొంత కస్టమర్లకు బదలాయిస్తున్నాయి.
ఎస్‌బీబీజే కూడా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే) కూడా బేస్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10.10% నుంచి 9.95 శాతానికి తగ్గింది. ఈ రేటు జూన్ 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ బీఎస్‌ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది