న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు.
జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment