
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూఈ) ప్రాంతాల అభివృద్ధికి ప్రైవేటు రంగం కూడా భాగస్వామిగా ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సంబంధిత రాష్ట్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు మొదలు అభివృద్ధి పనుల వరకు ప్రైవేటు సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపింది. 2015లో ఇందుకు సంబంధించిన జాతీయ విధానం, కార్యచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల లోక్‌సభలో తెలిపారు.
కేంద్ర సాయుధ పోలీసు దళాల బెటాలియన్లు, శిక్షణ, రాష్ట్ర పోలీసు దళాల ఆధునీకరణకు నిధులు, పరికరాలు, ఆయుధాలు, నిఘా భాగస్వామ్యం, పోలీస్‌స్టేషన్ల నిర్మాణంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రైవేటు రంగాలతో కలసి సహకారం అందిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో 17,589 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, 14,618 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
టెలికాం కనెక్టివిటీ కోసం 10,505 మొబైల్ టవర్లను మంజూరు చేయగా 7,768 టవర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆమోదం పొందిన 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలు, 61 నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో 46 ఐటీఐలు, 49 ఎస్‌డీసీలు పనిచేస్తున్నట్లు వివరించారు. ఆయా జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలతో తపాలా శాఖ 5,731 పోస్టాఫీసులను ప్రారంభించినట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.