
ప్రత్యేకంగా కమ్యూనికేషన్ ఏజెన్సీని నియమించనున్న ప్రభుత్వం
ఆసక్తి వ్యక్తీకరణకు ప్రకటన విడుదల
సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, పాలనపై సానుకూల ప్రచారం రావడం లేదని, ప్రతికూల ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనిని సమర్థంగా చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ ఏజెన్సీ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
తొలుత జనవరిలోనే కమ్యూనికేషన్ ఏజెన్సీ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసినప్పటికీ పరిపాలన పరమైన అంశాల్లో సవరణలు చేసి మళ్లీ తాజాగా జారీ చేశారు. ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆసక్తిగల సంస్థలు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున గత మూడేళ్లు టర్నోవర్ కలిగి ఉండాలని, కనీసం 100 మంది జర్నలిజం, మీడియాలో నిష్ణాతులైన ఉద్యోగులు ఉండాలనే నిబంధనలు విధించారు. వీటితోపాటు సమాచార శాఖ అధికారులు పేర్కొన్న నిబంధనలను పరిశీలిస్తే చంద్రబాబు ప్రభుత్వం తమ ప్రచారం కోసం ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయనున్నట్లు స్పష్టం అవుతోంది.
ఏజెన్సీ ఏం చేయాలంటే...
ప్రధానంగా ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సంప్రదాయ మీడియాతోపాటు దూరదర్శన్, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలతోపాటు ఇతర ప్రముఖ భాషల్లోనూ ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రభుత్వ ప్రతిష్ట పెంచే కథనాలను ఆయా మీడియాల్లో వచ్చేలా చూడాలి.
మీడియా కవరేజ్, ట్రాకింగ్, విశ్లేషణ చేయడంతోపాటు వివిధ శాఖలకు చెందిన వార్తలను మీడియా సంస్థలకు తెలియజేయాలి. అవసరం మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో ట్రిప్‌లను నిర్వహించాలి. సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారుల ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, ఎఫ్‌ఎం రేడియో చానళ్లలో వచ్చేలా చూడాలి. దేశీ, విదేశాల్లోని మీడియా రంగ ముఖ్యులకు ప్రభుత్వ సమావేశాల గురించి తెలియజేయాలి. ప్రభుత్వ సానుకూల, ప్రతికూలతలపై ప్రజాభిప్రాయం సేకరించాలి. వాటికి అనుగుణంగా వ్యూహాలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 360 డిగ్రీల్లో భారీ ఎత్తున చంద్రబాబు సర్కారు గురించి ప్రచారం చేయాల్సి ఉంటుంది.