సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది.
2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి.
నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్‌కు డిమాండ్..
గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి.
కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది.
విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment