industrial corridors
-
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం ఏపీ
సాక్షి, అమరావతి: మూడు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీసీ) అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశం గురువారం ఢిల్లీ వేదికగా జరిగింది. డీపీఐఐటీ, నిక్‌డిక్ట్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎన్ఐసీడీసీ ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏపీ పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ), విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌బీఐసీ)లలోని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్, కొప్పర్తి, శ్రీకాళహస్తి – ఏర్పేడు, ఓర్వకల్ నోడ్లలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిక్‌డిక్ట్ నిధుల ద్వారా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతాయన్నారు. ఇవి పూర్తయితే 2040 కల్లా ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, 5.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో నక్కపల్లి క్లస్టర్, గుట్టపాడు క్లస్టర్లను కూడా పారిశ్రామికంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు కారిడార్లకు ప్రణాళికాబద్ధంగా నిధులను సమీకరించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. భూ సమీకరణ, ప్రాజెక్టుపై పూర్తి నివేదిక తయారు చేయడం, నీరు, విద్యుత్ సరఫరా, టెండర్లు సహా కీలకమైన పనులను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిక్‌డిక్ట్ (ఎన్ఐసీడీఐటీ) నిధులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో కారిడార్ల అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని మంత్రి కోరారు. ఈ సమావేశంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ బేరీ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం నుంచి మంత్రితోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక కారిడార్లపై కీలక ముందడుగు
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా.. ఈ అంశంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్‌పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా.. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరై కారిడార్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన రాష్ట్రంలో కారిడార్లు, నోడ్స్లో పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. నిధులు త్వరితగతిన ఇచ్చేందుకు హామీ ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన 51 శాతం పనులను ఇప్పటికే పూర్తి చేశామని.. కేంద్రం వాటా 49 శాతం నిధుల్ని గ్రాంట్ రూపంలో కేటాయించాలని పరిశ్రమల శాఖ అధికారులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సోమ్‌ప్రకాష్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా 11 కారిడార్లు, 32 పారిశ్రామిక నోడ్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఇందులో 5 నోడ్స్ను ఏపీకి కేటాయించామన్నారు. కారిడార్లు, నోడ్స్‌కు సంబంధించిన డీపీఆర్‌లు, మాస్టర్ ప్లాన్లను జూన్ నాటికి సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా రూ.4 వేల కోట్లను త్వరితగతిన కేటాయించేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అన్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్స్‌తోపాటు ఎగుమతులకు ఎక్కువ అవకాశాలుండే పరిశ్రమలపై దృష్టి సారించాలన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. జనావాసాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీలకు భూకేటాయింపులు తగ్గించేలా చూడాల, వీలైనంత త్వరగా గ్రాంట్ కేటాయించి రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్ల అధికారులు పాల్గొన్నారు. -
కరోనా కాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి: మంత్రి గౌతం రెడ్డి
సాక్షి, అమరావతి: కరోనా కాలంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని గౌతంరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను అవలంభిస్తున్నామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. చదవండి: 15 వేల గ్రామ సచివాలయాల్లో ఏఆర్‌సీలు -
ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్‌కే వెళ్తుంది. హై స్పీడ్ రైలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు ఉన్నా ముంబై వద్దే ఆగిపోతుంది. ప్రగతి పథంలో పరిగెత్తే రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరుతున్నాం. ప్రధాని మోదీ చెప్పే మాటలపై విశ్వాసం ఉండాలంటే అవి ఆచరణలోకి రావాలి’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. చదవండి: (త్వరలో ఐటీకి కొత్త పాలసీ) తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘రెండ్రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడాన్ని ప్రశంసించింది. పరస్పర విమర్శలతో కాలం గడపకుండా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతాం. అభివృద్ధి, సరికొత్త సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం’అని కేటీఆర్ ప్రకటించారు. పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినా, కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 2021–22 బడ్జెట్లో నిధులు కేటాయించి రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరిశ్రమల వివరాలతో బ్లూ బుక్.. ‘రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థల వివరాలతో ‘బ్లూ బుక్’తయారు చేస్తున్నాం. తద్వారా భారీ పెట్టుబడులతో వచ్చే బహుళ జాతి కంపెనీలతో స్థానిక పరిశ్రమలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో గత ఆరేళ్లలో రూ.2.04 లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన 13,826 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, 14 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి దక్కుతోంది. స్థానికులకు 80 శాతానికి పైగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిద్ధంగా ఉంది’అని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం లాంటి బహుళ ప్రయోజన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిందని పేర్కొన్నారు. ధాన్యం దిగుబడి పెరిగి ఈశాన్య భారతంతో పాటు తైవాన్, మధ్య ప్రాచ్య దేశాలకు సోనా బియ్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో 18 కేటగిరీల్లో ఎంపిక చేసిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు రమాకాంత్ ఇనానీ, ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి, అనిల్ అగర్వాల్, అవార్డుల కమిటీ చైర్మన్ రవీంద్ర మోదీ పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్‌తో ఒరిగిందేమీ లేదు.. ‘కోవిడ్–19 కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మందికి కూడా ప్రయోజనం కలగలేదు. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మంచి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆర్థిక పునరుజ్జీవనానికి కేంద్రం బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం. గత 12 త్రైమాసికాల్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవాలని కోరుకుంటున్నాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హై స్పీడ్ ట్రైన్, ఇండస్ట్రియల్ కారిడార్లు, డిఫెన్స్ ప్రొడక్షన్ క్లస్టర్లు వంటి అంశాలపై కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. వచ్చే కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలి. పెద్ద ఎత్తున పారిశ్రామికవృద్ధికి బాటలు వేసే ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ, టెక్స్టైల్ పార్కులు, ఐటీఐఆర్ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహించకపోతే పరిగెత్తలేం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ లకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల్ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్ జెవిఎన్ సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ ఎండీ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఈడీ పి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘‘భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ విమానాశ్రయం నుంచి విశాఖ సిటీకి సత్వరమే చేరుకునేలా వేగంగా బీచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావాలి. పోలవరం నుంచి విశాఖకు పైపు లైను ద్వారా తాగు నీటి సరఫరా ప్రాధాన్యతా అంశాలు. పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీఆపీఆర్) వెంటనే సిద్ధం చేయాలి. పైమూడు పనులకు సంక్రాంతిలో శంకుస్థానకు అధికారులు సన్నద్ధం కావాలని’’ సీఎం ఆదేశించారు. (చదవండి: ఒకసారి నువ్వు.. ఒకసారి నేను) మూడు పోర్టులు–పనులు: కాగా, రామాయపట్నం పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరిలో మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని అధికారులు వెల్లడించారు. భావనపాడు పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని తెలిపారు. మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని అధికారులు తెలిపారు. రెండున్నర ఏళ్లలో..: ఈ మూడు పోర్టుల పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్‌లోని విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును వివరించిన ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించ వచ్చని, ఇంకా కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయని సీఎం తెలిపారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్‌లో కార్యకలాపాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎయిర్ కార్గో అవసరాన్ని కూడా వివరించారు. తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఓర్వకల్ నోడ్‌లో కార్యకలాపాలను అధికారులు వివరించారు. పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్ వాటర్‌ను వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు. లీటరు నీరు 4 పైసలకు మాత్రమే వస్తుందని, దీని వల్ల తాగునీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక వాడల్లో మురుగునీటి పారిశుద్ధ కేంద్రాల (ఎస్పీటీ) ఏర్పాటు తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మీదుగా వెళ్లే ప్రధాన రహదారుల వెం బడి రెండు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో ఈ కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గతేడాది ఈ రెండు కారిడార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పంపించింది. ఆ తర్వాత కూడా సీఎం కేసీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ కేంద్రం వద్ద ఈ ప్రతిపాదనపై ప్రస్తావిస్తూ వచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పూర్తి స్థాయిలో కారిడార్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కారిడార్లలో చమురు శుద్ధి, చేనేత వస్త్ర పరిశ్రమలు, హస్తకళలు, కాగితం, మైనింగ్, ఇంజనీరింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ కారిడార్ల వెంబడి రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే సౌకర్యాలు కూడా మెరుగవుతాయి. ఈ మార్గాల్లో హైస్పీడ్ రైళ్ల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కారిడార్ వెంట ఉన్న రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. -
త్వరలో ఆ పనులు షురూ
రెండు పారిశ్రామిక కారిడార్లపై డీఐపీపీ భేటీలో సీఎం వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కారిడార్లపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్(డీఐపీపీ) శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజంటేషన్ ఇచ్చింది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కూడా వీటి పరిధిలో చేర్చాలని ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి డీఐపీపీకి సూచించారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), చెన్నై-బెంగుళూరు కారిడార్‌కు జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) ఆర్థిక సాయం అందిస్తోందని డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. రెండు కారిడార్ల పరిధిలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, ఏర్పేడు-శ్రీకాళహస్తిని ముఖ్యమైన నోడ్లుగా గుర్తించి, అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)ను త్వరలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతామని అమితాబ్ చెప్పారు. ఆ సంస్థకు సీఆర్డీఏ పరిధిలో 100 ఎకరాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చైనా బృందంతో ముఖ్యమంత్రి భేటీ చైనాకు చెందిన శానీ గ్రూపు చైర్మన్ లియాంగ్ వెంగెన్ నేతృత్వంలో 20 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఆయనతో చర్చించింది. పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆఫర్లను చైనా ప్రతినిధులు తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. రేపు తిరుమలకు సీఎం :సీఎం చంద్రబాబు ఆదివారం తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఉదయం 9.45 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన కోసం టీటీడీ సేకరించిన ఏడు తీర్థాల పుణ్యజలం, ఏడు కొండల పుట్టమన్ను స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. -
‘స్మార్ట్ సిటీ’లకు సహకరించండి
ఏడీబీకి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి బకూ/న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు, రైల్వేలు, మౌలిక రంగాల అభివృద్ధికి తద్వారా ఉపాధి కల్పనకు సన్నిహిత సహకారం అందించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)కు విజ్ఞప్తి చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ డెవలప్మెంట్’ కార్యక్రమాల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి భారత్ గట్టి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నా రు. అజర్బైజాన్ రాజధాని బకూలో శనివారం ప్రారంభమైన నాలుగు రోజుల 48వ ఏడీబీ వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న జైట్లీ, ఈ సందర్భంగా ‘ఫస్ట్ బిజినెస్ సెషన్’లో మాట్లాడారు. ముఖ్యాంశాలు... ⇒ 2015, 2016ల్లో 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందని భారత్ భావిస్తోంది. భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోందనడానికి ఇది సంకేతం. అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం లోపే ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ⇒ భారత్ వృద్ధి రేటును పటిష్టంగా, స్థిరంగా కొనసాగించడం మా ప్రధాన లక్ష్యం. మౌలిక వృద్ధి, నైపుణ్యం పెంపుదల, వ్యాపార అవకాశాల మెరుగుదలకు చర్యలు, ఆర్థిక సంస్కరణల ద్వారా పటిష్ట వృద్ధి లక్ష్యాన్ని భారత్ కోరుకుంటోంది. ⇒ 2020 నాటికి ఏడీబీ వార్షిక వ్యాపారం 20 బిలియన్ డాలర్లకు పెరగాలి. ఇది ఏడీబీకి ఒక కార్పొరేట్ లక్ష్యం కావాలి. ఏడీబీ కార్యకలాపాలు పెరగడమేకాదు, ఆయా కార్యకలాపాల ద్వారా ఒనగూడే ప్రయోజనాలు సైతం పెరగాలి. 2014లో ఏడీబీ మొత్తం రుణాలు, గ్రాంట్స్ విలువ 13.5 బిలియన్లు. ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌ను చూస్తే... ఈ పరిమాణం 9 బిలియన్ డాలర్లు. ⇒ ఏడీబీకి భారత్ అతిపెద్ద భాగస్వామి. ఈ భాగస్వామ్యం మరింత ముందుకు సాగాలి.