శరవేగంగా జరుగుతున్న రామాయపట్నం పోర్టు పనులు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు.
అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి.
కోవిడ్‌లోనే కొప్పర్తి నోడ్ రెడీ
ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్‌లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది.
ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది.
ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గత ప్రభుత్వానికి భిన్నంగా..
టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు.
ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు.
60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి
పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి.
ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు.
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.
జాతీయ స్థాయిలో గుర్తింపు..
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్‌ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్‌ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా..
పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష.
– గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
వ్యయం తగ్గించడమే లక్ష్యం
పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్‌లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు.
– కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఎంవోయూల కంటే ఎక్కువగా
మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం.
– ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు.
Comments
Please login to add a commentAdd a comment