పారిశ్రామికోత్సాహం  | Establishment of new industries Arrangements to start by CM Jagan | Sakshi
Sakshi News home page

పారిశ్రామికోత్సాహం 

Published Sun, Nov 26 2023 4:17 AM | Last Updated on Sun, Nov 26 2023 5:03 PM

Establishment of new industries Arrangements to start by CM Jagan - Sakshi

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్‌ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. 

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు.

వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్‌ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌ న్యూట్రాస్యూటికల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఏర్పాటు చేసిన సిమెంట్‌ యూనిట్‌ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
 
ఎంఎస్‌ఎంఈలకు పెద్ద పీట 
అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎఫ్‌ఎఫ్‌సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్‌ నవోదయం, రీస్టార్ట్‌ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్‌ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి.  

రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్‌ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్‌ పోర్టల్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం.

వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్‌ కోటా సీసేమి యూనిట్‌ను ప్రారంభిస్తారు.

ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్‌ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్‌ తయారు చేసే బ్లూఫిన్‌ ఎంటర్‌ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్‌ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్‌ ఏర్పాటు చేయనున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు, ఎన్‌టీఆర్‌ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్‌ బ్యాటరీ స్టోరేజ్‌ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. 
 
వాస్తవ రూపంలోకి జీఐఎస్‌ ఒప్పందాలు 
విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు (జీఐఎస్‌)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్‌ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది.

గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్‌ఎస్‌బీ ట్రాన్స్‌మిషన్స్, గోద్రేజ్‌ ఆగ్రోవెట్, సీసీఎల్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్‌ఎల్‌పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. 
 
చేయిపట్టి నడిపిస్తున్నాం.. 
జీఐఎస్‌లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 
– ఎన్‌ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి 
 
ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం 
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది.  
– చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement