గేమ్‌ ఛేంజర్‌.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు  | CM Jagan working hard for next generations says MLAs Ministers | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు 

Published Sun, Mar 19 2023 1:59 AM | Last Updated on Sun, Mar 19 2023 3:21 PM

CM Jagan working hard for next generations says MLAs Ministers - Sakshi

సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమి­స్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మె­ల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌’ (ఏపీ జీఐఎస్‌)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.

ఈ చర్చలో పరి­శ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరా­యన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్‌ గేమ్‌ చేంజర్‌ అని కొనియాడారు.  

వ్యూహాత్మక విధానాలతో విజయం
రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్‌ నిర్వహించడానికి ముందు రోడ్‌షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమా­వేశాలు, కర్టెన్‌రైజర్‌ కార్య­క్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారి­శ్రామికవేత్తలు అయిన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, కరణ్‌ అదానీ, నవీన్‌ జిందాల్, భారత్‌ బయోటెక్‌ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్‌ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్‌కు హాజరయ్యారు.
ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్‌ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్‌ వన్‌ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్‌లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి.

మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్‌ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే.

ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్‌ ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.

మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్‌లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్‌ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్‌ ప్లాంట్‌ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు.  
    – గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి

విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు
సీఎం జగన్‌ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరి­శ్రమలకు విద్యుత్‌ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.    

2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం.

ఏ రాష్ట్రానికైనా పవర్‌ ఇచ్చేలా 2020లో  రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీని తీసుకు­వచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి.  29 పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల టెక్నికల్‌ కమర్షియల్‌ ఫీజబుల్‌ రిపోర్ట్‌ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం.

మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది.
    – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి 

ఆయనకు లోకజ్ఞానం ఉందా?
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక­వేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్‌ పట్ల వారు ఎంత నమ్మకంగా, సాను­కూ­లంగా ఉన్నారో అర్థం చేసుకో­వాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు.

ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగా­హన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామిక­వేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్‌ ప్రచారాన్ని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు.

దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నా­రని స్వయంగా ముఖేష్‌ అంబానీ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్‌.. జే అంటే జోష్‌.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జగన్‌తోనే సాధ్య­మని పునీత్‌ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్‌ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం.   
 – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి 


టార్చ్‌ బేరర్‌ సీఎం జగన్‌  
5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశ­లను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్‌ బేరర్‌ సీఎం జగన్‌. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవి­ష్యత్‌కు భరోసానిచ్చేలా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కార్య­క్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు.

ఈ సమ్మిట్‌ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్‌ బ్లాంక్‌ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్‌ ది. సీమెన్స్‌ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది.
– అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement