సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్‌కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ
ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం.
పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం.
తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం
ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది.
కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఫోన్ కాల్ దూరంలో..
ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు.
శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్
పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ..
1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్
తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు.
2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు.
3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి.
4. శర్వాణి బయో ఫ్యూయల్
బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు.
5. నాగార్జున ఆగ్రో కెమికల్స్
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి.
6. రవళి స్పినర్స్
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి.
7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్
శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు..
1.డీపీ చాక్లెట్స్
తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి.
2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్‌లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది.
3. ఓరిల్ ఫుడ్స్
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్‌స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం.
4. నేటివ్ అరకు కాఫీ
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది.
5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు.
6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment