Industries Department
-
కాసులిస్తేనే నచ్చిన చోటు
రాష్ట్రంలో అధికారికంగా బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసినప్పటికీ పరిశ్రమల శాఖలో కీలక పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. పైసలు ఇస్తేనే బదిలీ ఆర్డర్లు ఇస్తామంటూ కీలకస్థాయి అధికారి బేరం పెట్టడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. జనరల్ మేనేజర్ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల బదిలీల వరకు ఎన్నడూ లేనివిధంగా గడువు ముగిసినా ఆర్డర్లు జారీ చేయకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించిన వారికి నచ్చిన చోటకు బదిలీ చేస్తూ పాత తేదీ (బ్యాక్ డేట్)తో ఉత్తర్వులు ఇస్తామంటూ ఉద్యోగులతో నేరుగా బేరాలు సాగిస్తుండటంతో జిల్లాస్థాయి అధికారులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఎప్పటినుంచో బదిలీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆర్డరు కాపీని తొక్కిపెట్టారంటూ ఒక ఉద్యోగి వాపోయారు. ఈ విధంగా పైస్థాయి అధికారి నేరుగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్లు చేసి అడగడం ఇప్పటివరకు ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి నేరుగా ఆయనే ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. సాక్షి, అమరావతిగృహ నిర్మాణ శాఖలో కాసుల పంట గృహ నిర్మాణ శాఖలో సాధారణ బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండించాయి. సీనియారిటీ, స్పౌజ్ వంటి నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ సిఫార్సులు, వసూళ్లకు పెద్దపీట వేశారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తన ఓఎస్డీ ద్వారా కీలక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపారు. ఓఎస్డీ నేరుగా డీఈ, ఈఈ, ఎస్ఈలకు ఫోన్లు చేసి వసూళ్ల వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆపైన ముట్టచెప్పిన వారికే కోరిన స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు, డబ్బు ఇవ్వని వారికి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టింగ్ కావాల్సిన చోట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు తీసుకోవడం కోసం అక్కడ కూడా రూ.లక్షల్లోనే ఉద్యోగులు ముట్టజెప్పారు. రాజకీయ సిఫార్సులు, డబ్బు చెల్లించిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడం కోసం ఏడాది, రెండేళ్ల క్రితం నియమించిన వారిని వేరే చోటకు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆదివారంలోగా బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే, సిఫార్సులు, వసూళ్ల ఆధారంగా కోరుకున్న చోట ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో సోమవారానికి తుది జాబితా గృహ నిర్మాణ శాఖకు అందినట్టు తెలిసింది. పోరుబాటలో ఇంధన శాఖ ఉద్యోగులు! విద్యుత్ సంస్థల్లో బదిలీలకు ముందే సిఫారసు లేఖలు ఇచ్చిన వైనం బయట పడటంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు కనీస అర్హత ఉన్నవారికే సిఫారసులను అన్వయించేలా తీవ్రంగా కసరత్తు చేశారు. అయినప్పటికీ.. తాము అనుకున్న విధంగానే బదిలీలు జరగాలని, తమ సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి నేతలు పట్టుబట్టారు. ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ వారిని ప్రతిపాదించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో 22వ తేదీకే పూర్తవ్వాల్సిన బదిలీలు 23న కూడా కొనసాగాయి. డిస్కంలలో జూనియర్ లైన్మెన్ స్థాయి నుంచి డిప్యూటీ ఇంజనీర్ స్థాయి వరకూ వందల మందిని బదిలీ చేశారు.రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. బీసీ, ఓసీ సంఘాల నేతలకు బదిలీ నుంచి మినహాయింపు (ప్రొటెక్షన్) ఇవ్వలేదు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రెండు సంఘాల ఉద్యోగులు సోమవారం ప్రకటించారు. -
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న విధానాల కంటే మెరుగైన విధానాలను అమలు చేయాలని యోచిస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన టీజీ ఐపాస్ (గతంలో టీఎస్ ఐపాస్) చట్టంలో సమూల మార్పులు చేస్తూ కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. రెండు పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సర్కార్ నూతన పాలసీలో ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం టీజీ ఐపాస్‌ను అమలు చేసింది. మరోవైపు పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేసింది. టీ ఐడియా (జనరల్ కేటగిరీ), టీ ప్రైడ్ (ఎస్సీ, ఎస్టీ) స్కీమ్‌ల కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ, సేల్స్ టాక్స్ తదితరాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని, నూతన పారిశ్రామిక విధానంలో తాము వీటికి పెద్దపీట వేస్తామన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. పేరుకు పోయిన బకాయిలు కొత్త ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.3,736.67 కోట్లు. వీటిలో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఇచి్చన రూ.684 కోట్ల విలువైన చెక్కులు చెల్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు చెల్లించేలా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇక సులభంగా ఎంఎస్ఎంఈ వివాదాల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈల వివాదాల పరిష్కారానికి కొత్తగా నాలుగు చోట్ల ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాత్రమే ఉండటంతో వివాదాల పరిష్కారానికి ఇంత దూరం రావడానికి ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ప్రాంతీయ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. కన్సిలేషన్స్ (ఇరు పార్టీలను కూర్చొపెట్టి మాట్లాడి పరిష్కరించడం) స్థాయి వివాదాలను ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేలా, ఆర్బిట్రేషన్ స్థాయి వివాదాలను రాష్ట్రస్థాయి కౌన్సిల్లో పరిష్కరించేలా చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) సూచించిన ప్రతినిధి, ఏపీఎస్ఎఫ్సీ జిల్లా బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసీ సూచించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ కౌన్సిల్‌కు ఉంటాయి. ప్రభుత్వ అండతో వేగంగా పరిష్కారం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. మరోపక్క ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల బకాయిలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. బకాయిల కోసం కౌన్సిల్‌ను సంప్రదించే పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. ఈ సంఖ్య పెరుగుతుండటంతో వివాదాలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పరిధి, విధివిధానాలను నిర్దేశించింది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎస్ఎంఈ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ కౌన్సిళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ.. విశాఖపట్నం ప్రాంతీయ కౌన్సిల్: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలు విజయవాడ కౌన్సిల్: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తిరుపతి కౌన్సిల్ : ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు కర్నూలు కౌన్సిల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్‌ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్‌లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో ‘ఎంఎస్ఎంఈ’ల రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి. 2023–24లో ఎంఎస్ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ పోర్టల్ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండు రెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. 2022–23లో ఎంఎస్ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని దాటేసిన తొమ్మిది జిల్లాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్‌లో కనీసం 1.50 లక్షల ఎంఎస్ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశి్చమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. -
జీఐఎస్ ఒప్పందాల్లో మరో 36 కార్యరూపంలోకి తేవాలి
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు (జీఐఎస్)లో పరిశ్రమల శాఖకు చేసుకొన్న అవగాహన ఒప్పందాల్లో మరో 36 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలని, వాటికి డిసెంబరు నెలాఖరులోగా శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. జీఐఎస్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి రూ. 3.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 2.38 లక్షల మందికి ఉపాధి కల్పించే 107 ఒప్పందాలు జరగ్గా, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాలన్నీ త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగంగా ఏర్పాటవ్వాలని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను ఆదేశించారు. వీటిపై నెలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. అంతకు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, జీఐఎస్‌లో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల ఏర్పాటుపై ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయండి పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై కూడా పరిశ్రమలు, ఏపీఐఐసీ తదితర విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను వేగవంతం చేయాలని, గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపేట, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ పవర్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య రంగానికి దిక్సూచి.. మెడ్‌టెక్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్.. వైద్య ఉపకరణాల తయారీలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు, సంస్థలకు కూడా కేరాఫ్‌గా మారింది. వైద్య రంగానికే దిక్సూచిలా మారుతోంది. కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ని తయారు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న మెడ్ టెక్ జోన్ అదే జోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ఇటీవల ఇక్కడ ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ కూడా ప్రారంభమైంది. ఇలాంటి విప్లవాత్మక సంస్థలు ఎన్నో ఈ జోన్లో చోటు కోసం క్యూ కడుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో.. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన కిట్లు, ఉపకరణాలను మెడ్‌టెక్ జోన్ అందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోల్బియో డయాగ్నోస్టిక్స్ కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది. ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను అందించింది. ప్రతి రోజూ 100 వెంటిలేటర్లు, 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసేది. దీంతో ప్రపంచం దృష్టి మెడ్‌టెక్ జోన్‌పై పడింది. పరిశోధనలు, ఆవిష్కరణలు: ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100 సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు, ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ జోన్ ముందు వరసలో నిలుస్తోంది. ఎమ్మారై పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాల్ని తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఇటీవలే తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 టెస్లా ఎమ్మారై కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ మాత్రం మరింత శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేస్తున్నారు. ఎమ్మారైని తయారు చేసే సంస్థకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుండటం విశేషం. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు టెలీ రేడియాలజీ సొల్యూషన్స్ (టీఆర్ఎస్) కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 70 శాతానికిపైగా గ్రామీణ ప్రాంత ప్రజలు రేడియాలజీ సేవల కోసం పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) మార్గదర్శకాల మేరకు మెడ్ టెక్‌లో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్‌ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక రేడియేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. వైద్యం, వ్యవసాయం, సీ ఫుడ్‌లో నాణ్యమైన ఎగుమతులకు గామా రేడియేషన్ సేవల కేంద్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం కోబాల్ట్–60ని ఉపయోగించనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు. దిగుమతుల నుంచి ఎగుమతులకు.. గతంలో భారత్.. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది. ఎప్పుడైతే.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరందుకుందో.. ఈ పరిస్థితి మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కోట్లాది రూపాయల విలువైన అత్యాధునిక యంత్రాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఎమ్మారై యంత్రాలను దిగుమతి చేసుకోవాలంటే రూ.4.5 కోట్లు ఖర్చవుతుంది. మెడ్‌టెక్‌లో కేవలం రూ.98 లక్షలకే వీటిని తయారు చేస్తున్నారు. దీనివల్ల అత్యాధునిక ఎమ్మారై స్కానర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక్కో యంత్రానికి దాదాపు రూ.3.5 కోట్లు ఆదా అవుతుంది. తద్వారా ఎంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మరిన్ని ఆస్పత్రులు ఎమ్మారై యంత్రాలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కలిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా.. హెల్త్ క్లౌడ్ వైద్య పరికరాల పరిశ్రమల అవసరాల్ని తీర్చేందుకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్‌టెక్ జోన్ మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్‌తో కలిసి కొద్ది నెలల క్రితం ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించి హెల్త్ క్లౌడ్ని రూపొందించింది. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అలయన్స్, రేడియాలజీ ఇమేజింగ్ సర్వీసులు, హెల్త్ డిజిటల్ డేటా.. ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానించేలా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు హెల్త్ కేర్ సౌకర్యాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ హెల్త్ క్లౌడ్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందనున్నాయి. ఎంఎస్ఎంఈతో ఒప్పందం ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్ఎంఈతోనూ మెడ్‌టెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలోని ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయుక్తం కానుంది. ఇలా.. విభిన్న రీతుల్లో విప్లవాత్మకమైన వైద్య పరికరాల్ని ప్రపంచానికి అందించేలా.. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్‌టెక్ జోన్ కృషి చేస్తోంది. -
ఫార్మాసిటీ మృతులకు.. రూ.25 లక్షలు చొప్పున పరిహారం
మధురవాడ (భీమిలి)/పరవాడ (పెందుర్తి)/మహారాణిపేట : అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేశామని, సేఫ్టీ ఆడిట్స్ చేయాలని ఆదేశించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 80–90 వరకు ప్రమాదకర పరిశ్రమలున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో భద్రతాపరమెన ఆడిట్స్ చేయాలని ఆదేశించినట్లు అమర్నాథ్ చెప్పారు. పరవాడ ఫార్మాలో ప్రమాద ఘటన ఎందువల్ల జరిగింది? అందులో ఎవరి తప్పిదం ఉందో సమగ్రంగా విచారణ జరిపించాలని అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం ఇక ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్‌బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడ్ల సతీష్ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం మరోవైపు.. దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. -
పెట్టుబడుల్లో ఫస్ట్.. దేశంలోనే మొదటి స్థానం
సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్కో సోలార్, ఇసుజు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్ లాంటి సంస్థలున్నాయి. సింగిల్ విండోలో అనుమతులు.. ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన! రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
దేశంలో రిటైల్ పరిశ్రమ జోరు..19 శాతం వృద్ధితో
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ పరిశ్రమ తన జొరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనాకు ముందు 2019 సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి కనిపించింది. క్యూఎస్ఆర్, పాదరక్షల విభాగాలు ఈ కాలంలో బలమైన పనితీరు నమోదు చేయడం ద్వారా వృద్ధికి మద్దుతుగా నిలిచినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఈ రెండు విభాగాల్లో అమ్మకాల వృద్ధి 30 శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు భారత్‌లో రటైల్ పరిశ్రమ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతంలో 19 శాతం వృద్ధి కనిపించగా, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. సౌందర్య, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమల్లో వృద్ధి 2019 ఇదే కాలంతో పోల్చినప్పుడు కేవలం 7 శాతం నమోదైనట్టు రాయ్ తెలిపింది. వినియోగదారులు తిరిగి స్టోర్లకు వచ్చి షాపింగ్ చేస్తున్నారని, ఆన్లైన్లో కొనుగోళ్లను సైతం వారు ఆస్వాదిస్తున్నారని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో భారత రిటైల్ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్టు రాయ్ చైర్మన్ బిజో కురియన్ తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైలర్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం పెద్ద ఎత్తున పెరిగినట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతర మార్కెట్ల కంటే భారత్‌లో రిటైల్ పరిశ్రమ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఓమ్నిచానల్ రిటైల్ (ఆఫ్‌లైన్, ఆన్లైన్) అన్నది రిటైలర్లకు సాధారణ నియమంగా మారింది’’అని కురియన్ వివరించారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) వల్ల లక్షలాది చిన్న వర్తకులు సైతం డిజిటల్ కామర్స్‌లో భాగస్వాములు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి
సాక్షి, అమరావతి: ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటాలు, బిర్లాలు, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతుంటే టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం పారిశ్రామిక ప్రగతి క్షీణించిందంటూ దుష్ప్రచారం చేయటాన్ని పరిశ్రమల శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో వీసమెత్తు నిజం లేకపోగా పారిశ్రామిక ప్రగతిలో కేంద్రం కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనపరుస్తోందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్న ఆరోపణలు అబద్ధమని, రూ.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయనడం నిరాధారమని పేర్కొంది. కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పరుగులు తీస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంఎస్ఎంఈలు రెట్టింపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన జూన్ 2019 నుంచి నేటి వరకూ రాష్ట్రానికి 107 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఎంఎస్ఎంఈలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటయ్యాయి. గత మూడున్నరేళ్లలో 1,06,249 ఎంఎస్ఎంఈలు ఏపీకి రావడం ద్వారా రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా మరో 57 మెగా పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చెందిన నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. కియా అదనపు పెట్టుబడులు.. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ తరలనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయి. కియా అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖ మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్ (ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ / బిజినెస్ పార్క్) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ రుషికొండ ఐటీ సెజ్ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదు. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు రూ.వేల కోట్ల విలువైన భూములను తీసుకుని గడువులోగా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి వెనక్కు తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్స్ పేపర్ పరిశ్రమ ఒప్పందం సాంకేతిక కారణాలతో రద్దయింది. కొత్తగా మూడు పారిశ్రామిక నగరాలు విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్, ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను కల్పించింది. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలను కల్పించింది. అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 6,740 ఎకరాలను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేసింది. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళుతోంది. రూ. 2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం పూర్తయింది. తద్వారా రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. గత సర్కారు బకాయిలూ చెల్లింపు.. పారదర్శకంగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020 – 23 తెచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం‘ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.3409 కోట్ల ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి రూ.1324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిలు (7,039 ఎంఎస్ఎంఈలకు మంజూరు) కూడా అందచేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్ చేసింది. వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్టైల్ యూనిట్లకు రూ.242.13 కోట్లు విడుదల చేసింది. కేంద్ర సగటు కంటే అధికంగా.. గత సర్కారు హయాంలో 2018–19లో పరిశ్రమల రంగం జీవీఏ వృద్ధి రేటు (స్థిరమైన ధరల వద్ద) 3.17% మాత్రమే ఉంది. 2020–21లో లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికోత్పత్తి ఆగిపోయింది. ఆ ఏడాది కేంద్రం జీవీఏ –3.33 శాతం నమోదు కాగా రాష్ట్రంలో వృద్ధి రేటు 0.33%గా నమోదైంది. 2021–22లో కేంద్ర పారిశ్రామికోత్పత్తిలో 8% శాతం వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం రెండంకెల వృద్ధి 11% సాధించింది. కోవిడ్ సంక్షోభం వచ్చినా రెండేళ్లు కేంద్ర సగటు కంటే రాష్ట్రం మెరుగైన పనితీరును కనపరచింది. ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక నగరం చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ను తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాలలో క్రిస్ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం రూ.1,448 కోట్లను వెచ్చిస్తూ టెండర్లను పిలిచింది. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించడమే కాకుండా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దావోస్ పర్యటనతో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనలో అదానీ, అరబిందో, గ్రీన్కో గ్రూప్, ఏస్ అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్, సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టŠస్ నెలకొల్పేలా రూ. 1,26,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా రాష్ట్ర యువతకు 38 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో 25 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గత మూడేళ్లలో 107 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వచ్చే మూడు నెలల్లో మరో 25 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటైన బ్లూస్టార్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు చెందిన ఎయిర్ కండీషనర్స్, దేశంలోనే తొలి లిథియం బ్యాటరీ తయారీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. రూ.6,700 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అన్‌రాక్ అల్యూమినియం, కర్నూలు జిల్లాలో రూ.2,938 కోట్లతో ఏర్పాటైన స్టీల్ పరిశ్రమ, అనకాపల్లి జిల్లాలోని రూ.2,000 కోట్లతో స్థాపించిన సెయింట్ గోబిన్, రూ.1,500 కోట్లతో నెలకొల్పిన శారద మెటల్స్ ఫెర్రో అల్లాయిస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం 25 యూనిట్ల ద్వారా రూ.16,148 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపంలోకి రానున్నాయని, వీటి ద్వారా 19,475 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటవుతున్న అసాగో బయోఇథనాల్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజ జరగనుంది. వీటితో పాటు త్వరలోనే విశాఖలో రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ సౌర విద్యుత్‌కు చెందిన ఉపకరణాల తయారీ యూనిట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడుల ప్రవాహం గత మూడేళ్లలో 107 పెద్ద యూనిట్లు ప్రారంభం కావడం ద్వారా రూ.46,002 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇదే సమయంలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా మరో రూ.91,243.13 కోట్ల విలువైన 57 ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ పూర్తయితే 1,09,307 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలోకి టాటా, బిర్లా, అదానీ, సంఘ్వీ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, యాసెంచర్ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల యూనిట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉత్తుత్తి పెట్టుబడుల ఒప్పందాలు కాకుండా వాస్తవం రూపం దాల్చేలా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
అంతర్జాతీయ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న కీలక రంగాలపై భారీ సదస్సులను నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉండటంతోపాటు ఒకేసారి 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా నవంబర్ 18న విశాఖలో మారిటైమ్ సదస్సు నిర్వహించనున్నారు. అలాగే, వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ వివరాలను తెలియచేసేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో అగ్రి ఎక్స్పోను నిర్వహించనున్నారు. డిసెంబర్లో ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ అలాగే రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి అనేక ప్రోత్సహకాలిస్తూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రాయితీలు విడుదల చేస్తుండటంతో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ను డిసెంబర్ మూడో వారంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టం చేయడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్స్, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ కాలేజీలు, తిరుపతి, చెన్నైలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధిలోని అవకాశాలను వివరించే విధంగా స్కిల్ ఆంధ్రా పేరుతో మరో కాన్క్లేవ్ను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న మారిటైమ్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ వెల్లడించారు. వీటితో పాటు హైదరాబాద్, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్‌పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం విజయవంతం అయ్యేందుకు దేశవిదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలతో పాటు తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్, దావోస్‌ల్లో రోడ్‌షోలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. దేశంలో జరిగే రోడ్‌షోల్లో మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొనిసుదీర్ఘ తీరప్రాంతంతో పాటు మూడు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధిచేస్తున్న పారిశ్రామిక పార్కులు, ప్రభుత్వ కల్పిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడి ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అందించే హ్యాండ్ హోల్డింగ్ వంటి వివరాలను తెలియజేయనున్నారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాలతోపాటు జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వేదికగా వినియోగించుకోనున్నారు. ఇక అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర అధికార బృందం వెళ్లి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్‌షోలను పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నిర్వహించనుంది. రోడ్‌షోల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను సిద్ధంచేశామని, వచ్చే మూడునెలల్లో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ఎస్. ప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా.. మరోవైపు.. కేవలం రోడ్‌షోలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలనూ ప్రచారానికి వినియోగించుకోనున్నారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటుచేసిన వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. అలాగే, పెట్టుబడుల సదస్సుకు ప్రచారం కల్పించేందుకు వివిధ రాష్ట్రాల పత్రికలు, జాతీయ ఛానల్స్‌లో కూడా ప్రచారం కల్పిస్తారు. -
కడప స్టీల్‌కు ఇనుప గనుల కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. -
పర్యావరణహిత ఇంధన వినియోగం పెరగాలి: నితిన్ గడ్కరీ
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని పెంచేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీర్లకు సూచించారు. ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల సూచనలను తెలుసుకునేందుకు ’మంథన్’ పేరుతో బెంగళూరులో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో–ఆపరేషన్, కమ్యూనికేషన్, కో–ఆర్డినేషన్‌తో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్ఫ్రా ఫోకస్’ అవార్డు
సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్నాథ్ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. సముద్ర వాణిజ్యంపై దృష్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్: మంత్రి అమర్నాథ్ 974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
భారీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడిదారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణపై సోమవారం సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు. ఈ రంగాలే కీలకం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగావాట్లకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 12 వేల మెగావాట్లకు ఈ సదస్సులో పెట్టుబడులు తేవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు సూచించారు. ఫార్మా పరిశ్రమలకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6 వేల ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబుకు సూచించారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను ఆహ్వానించాలని ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తొలుత సీఐఐ ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సదస్సు ప్రయోజనాలు, లక్ష్యాలు, ఫలితాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐటీ కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత పాల్గొన్నారు. -
Andhra Pradesh: పెట్టుబడుల ప్రవాహం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాలనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వీటి ద్వారా రూ.20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానాసోనిక్ లైఫ్ సైన్స్సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా 2021లో రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ.40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో చేయూత పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇదే విషయాన్ని పలు కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రకటించడమే కాకుండా రెండో దశ విస్తరణ పనులకు కూడా శ్రీకారం చుట్టడం తెలిసిందే. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం సింగిల్ డెస్క్ విధానంలో వేగంగా మంజూరయ్యాయని తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిచినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామని, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సులభతర వాణిజ్యంలో మూడో ఏడాదీ మొదటి స్థానం గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ.5856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ డెస్క్ విధానంలో అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాదీ ఏపీ మొదటి స్థానంలో నిలబడటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఎంఎస్ఎంఈలతో కలిపి 28,343 యూనిట్లు ప్రారంభం భారీగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవి కాకుండా సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి.