సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్ కల్పించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్ డి్రస్టిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు స్థానికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. హస్తకళలు, చేనేత, ఆహారం, వ్యవసాయం, ఖనిజాలు, బొమ్మల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
ఓడీఓపీ సెల్
నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను విక్రయించడం ద్వారా బ్రాండ్ ఏపీ పేరు ఇనుమడించే విధంగా చేయడం కోసం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ముడి పదార్థం ఎంపిక దగ్గర నుంచి తుది ఉత్పత్తి విక్రయించే వరకు ఉత్పత్తిదారులకు సహకరించేలా అన్ని మౌలిక వసతులు, ప్రత్యేక క్లస్టర్లు, ఉమ్మడి సౌకర్యాల వేదికలను అభివృద్ధి చేయనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సిడ్బీ, స్ఫూర్తి వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.
కేంద్రం సహకారాన్ని కోరాం
వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 స్థానిక ఉత్పత్తులను ఎంపిక చేశాం. ఈ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని ఇప్పటికే కోరాం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదావన్‌లతో ఈమేరకు మాట్లాడాము.
– గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి
ఆన్‌లైన్ మార్కెట్‌పై దృష్టి
బ్రాండ్ ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తద్వారా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త రకాలను రూపొందించే విధంగా నిఫ్ట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. సంస్థలకు ఆరి్థక సహకారం అందించడానికి సిబ్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు.
చూడగానే ఆకర్షించేలా ఉత్పత్తులను తీర్చిదిద్దడానికి ప్యాకేజింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment