ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల జాబితాతో బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్, బీఈఈ డైరెక్టర్ వినీత, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది.
ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఆదర్శంగా ఏపీ
సిమెంట్, స్టీల్, పవర్‌ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్‌టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది.
49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది.
అదితితో సమన్వయం
పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment