
సాక్షి, అమరావతి: ఇంధన వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం పరిధిలోకి కొత్తగా మరికొన్ని పరిశ్రమలు, సెక్టార్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పథకం పరిధిలో ఉన్న సెక్టార్ల నుంచి కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించారు. అదనంగా 4›పారిశ్రామిక సెక్టార్లను పాట్ పథకంలోకి తేవడం ద్వారా మరో 85 పరిశ్రమలకు పథకం వర్తిస్తుంది.
బీఈఈకి ప్రతిపాదనలు
పరిశ్రమల్లో విద్యుత్, ఇతర ఇంధన వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు వీలవుతుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో 2031 నాటికి దేశవ్యాప్తంగా 47.5 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్) ఇంధనం ఆదా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
రాష్ట్రంలో 36 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు చేయటం ద్వారా రూ.5709 కోట్ల విలువైన 0. 818 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. క్లోర్–ఆల్కలీ, స్టీల్, సిమెంట్, వాణిజ్య భవనాలు (ఎయిర్ పోర్ట్, హోటళ్లు), టెక్స్‌టైల్స్ తదితర సెక్టార్లలో కొత్తగా 143 పరిశ్రమలను పాట్ పథకంలోకి తీసుకొస్తోంది. కొత్తగా ఫార్మా, ఇంజనీరింగ్ , ఆటోమొబైల్, సిరామిక్స్, ఆహారం, మత్స్య పరిశ్రమల సెక్టార్లకు చెందిన 85 పరిశ్రమలను పాట్ పథకంలోకి తెచ్చేందుకు బీఈఈకి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
పాట్ ప్రగతి నివేదిక విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పాట్ పథకం ప్రగతి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం విడుదల చేశారు. అన్ని శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, శాఖల విభాగాధిపతులకు సూచించారు. ఏపీఎస్‌ఈసీఎం, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment