ఆంధ్రప్రదేశ్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి | Industries department says that state is running with flow of investments | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి

Published Thu, Nov 3 2022 4:36 AM | Last Updated on Thu, Nov 3 2022 3:16 PM

Industries department says that state is running with flow of investments - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటాలు, బిర్లాలు, అదానీ, ఆర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతుంటే టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం పారిశ్రామిక ప్రగతి క్షీణించిందంటూ దుష్ప్రచారం చేయటాన్ని పరిశ్రమల శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో వీసమెత్తు నిజం లేకపోగా పారిశ్రామిక ప్రగతిలో కేంద్రం కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనపరుస్తోందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్న ఆరోపణలు  అబద్ధమని, రూ.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయనడం నిరాధారమని పేర్కొంది. కోవిడ్‌ సంక్షోభాన్ని తట్టుకొని పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పరుగులు తీస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఎంఎస్‌ఎంఈలు రెట్టింపు
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన జూన్‌ 2019 నుంచి నేటి వరకూ రాష్ట్రానికి 107 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఎంఎస్‌ఎంఈలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటయ్యాయి. గత మూడున్నరేళ్లలో 1,06,249 ఎంఎస్‌ఎంఈలు ఏపీకి రావడం ద్వారా రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా మరో 57 మెగా పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయి.

వీటి ద్వారా రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చెందిన నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమైన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపింది.

కియా అదనపు పెట్టుబడులు.. 
కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్‌ తరలనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయి. కియా అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖ మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్‌ (ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్‌ / బిజినెస్‌ పార్క్‌) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

విశాఖ రుషికొండ ఐటీ సెజ్‌ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదు. లులూ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థలు రూ.వేల కోట్ల విలువైన భూములను తీసుకుని గడువులోగా పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి వెనక్కు తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఏషియన్‌ పల్స్‌ పేపర్‌ పరిశ్రమ ఒప్పందం సాంకేతిక కారణాలతో రద్దయింది. 

కొత్తగా మూడు పారిశ్రామిక నగరాలు
విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌లను తీర్చిదిద్దింది. నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్, ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను కల్పించింది. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలను కల్పించింది. అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో 6,740 ఎకరాలను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేసింది. కొప్పర్తి కేంద్రంగా మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు, ఎంఎస్‌ఈ సీడీపీ, వైఎస్సార్‌ ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళుతోంది. రూ. 2595.74 కోట్ల నిక్‌డిక్ట్‌ నిధులతో కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే  పరిశ్రమల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం పూర్తయింది. తద్వారా రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది.

గత సర్కారు బకాయిలూ చెల్లింపు..
పారదర్శకంగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020 – 23 తెచ్చింది. ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం‘ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన  రూ.3409 కోట్ల ప్రోత్సాహకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించి రూ.1324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిలు (7,039 ఎంఎస్‌ఎంఈలకు మంజూరు) కూడా అందచేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్‌ చేసింది. వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్‌టైల్‌ యూనిట్లకు రూ.242.13 కోట్లు విడుదల చేసింది.  

కేంద్ర సగటు కంటే అధికంగా..
గత సర్కారు హయాంలో 2018–19లో పరిశ్రమల రంగం జీవీఏ వృద్ధి రేటు (స్థిరమైన ధరల వద్ద) 3.17% మాత్రమే ఉంది. 2020–21లో లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికోత్పత్తి ఆగిపోయింది. ఆ ఏడాది కేంద్రం జీవీఏ –3.33 శాతం నమోదు కాగా రాష్ట్రంలో వృద్ధి రేటు 0.33%గా నమోదైంది. 2021–22లో కేంద్ర  పారిశ్రామికోత్పత్తిలో 8% శాతం వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం రెండంకెల వృద్ధి 11%  సాధించింది. కోవిడ్‌ సంక్షోభం వచ్చినా రెండేళ్లు కేంద్ర సగటు కంటే రాష్ట్రం మెరుగైన పనితీరును కనపరచింది.  

ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక నగరం
చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ను తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో 2,500 ఎకరాలలో క్రిస్‌ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం రూ.1,448 కోట్లను వెచ్చిస్తూ టెండర్లను పిలిచింది. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.  హైదరాబాద్‌ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించడమే కాకుండా ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

దావోస్‌ పర్యటనతో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులు 
దావోస్‌ పర్యటనలో అదానీ, అరబిందో, గ్రీన్‌కో గ్రూప్, ఏస్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ సంస్థలతో పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్, సోలార్‌ పవర్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టŠస్‌ నెలకొల్పేలా రూ. 1,26,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా రాష్ట్ర యువతకు 38 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement