సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం విజయవంతం అయ్యేందుకు దేశవిదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలతో పాటు తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్, దావోస్‌ల్లో రోడ్‌షోలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు.
దేశంలో జరిగే రోడ్‌షోల్లో మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొనిసుదీర్ఘ తీరప్రాంతంతో పాటు మూడు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధిచేస్తున్న పారిశ్రామిక పార్కులు, ప్రభుత్వ కల్పిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడి ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అందించే హ్యాండ్ హోల్డింగ్ వంటి వివరాలను తెలియజేయనున్నారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాలతోపాటు జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వేదికగా వినియోగించుకోనున్నారు.
ఇక అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర అధికార బృందం వెళ్లి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్‌షోలను పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నిర్వహించనుంది. రోడ్‌షోల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను సిద్ధంచేశామని, వచ్చే మూడునెలల్లో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ఎస్. ప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు.
సామాజిక మాధ్యమాల వేదికగా..
మరోవైపు.. కేవలం రోడ్‌షోలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలనూ ప్రచారానికి వినియోగించుకోనున్నారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటుచేసిన వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. అలాగే, పెట్టుబడుల సదస్సుకు ప్రచారం కల్పించేందుకు వివిధ రాష్ట్రాల పత్రికలు, జాతీయ ఛానల్స్‌లో కూడా ప్రచారం కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment