Andhra Pradesh Govt Providing Support To Industries For Investments - Sakshi
Sakshi News home page

పెట్టుబడుల్లో ఫస్ట్‌.. దేశంలోనే మొదటి స్థానం

Published Mon, Dec 26 2022 3:35 AM | Last Updated on Mon, Dec 26 2022 8:40 AM

Andhra Pradesh govt providing support to industries for investments - Sakshi

సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది.

వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందు­తు­న్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి  తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి 
రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్‌కో సోలార్, ఇసుజు, ఇండస్‌ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు
ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్‌ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్‌ లాంటి సంస్థలున్నాయి. 

సింగిల్‌ విండోలో అనుమతులు..
ముఖ్యమంత్రి జగన్‌ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్‌ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్‌ మురళీకృష్ణ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది.

మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన!
రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.  రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement