
నిన్న కర్నూలులోని లా వర్సిటీ.. నేడు కొప్పర్తిలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలింపు
ప్రాంతీయ సమతుల్యత కోసం కొప్పర్తిలో కేంద్రం అనుమతి
రూ.250 కోట్లతో 19.5 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు
ఇప్పుడీ కేంద్రాన్ని అమరావతికి తరలిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది.
విశాఖపట్నంలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్‌ఎంఈ సెంటర్‌ను సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్‌ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
రూ.100 కోట్లతో ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి
పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్‌ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.