సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విధించిన పరిమితి, నియంత్రణ చర్యలు సాధ్యమైనంత త్వరగా సడలించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. డిస్కంలు జరిమానా చార్జీలను ఆదాయ వనరుగా చూడకూడదని, నిబంధనల అమలుకు వాటిని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతల నుంచి ఉపశమనం కలిగించడం కోసం పరిశ్రమలపై ఇటీవల విధించిన ఆంక్షలపై కమిషన్ సభ్యులు పి.రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ సింగ్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్, మూడు డిస్కంల సీఎండీలతో ఏపీఈఆర్‌సీ చైర్మన్ బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుండి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల రికవరీకి సంబంధించిన సమస్యలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర్‌రంలో బొగ్గు కొరత, దానిని అధిగమించేందుకు తీసుకుంటున్న పలు చర్యలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. ఏ ధరకైనా విద్యుత్ కొనుగోలు చేసి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. విద్యుత్ రంగం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని, అనవసర పెట్టుబడులు మానుకోవాలని సూచించారు. సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ, ఈ విషయంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పనితీరు బాగోని ఏ డిస్కంను కమిషన్ ఉపేక్షించేది లేదని చైర్మన్ హెచ్చరించారు.
ఊరట ఇలా..
► విద్యుత్ ఆంక్షల అమలు కాలంలో క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి ఉండదు.
► కాంట్రాక్ట్ చేసిన డిమాండ్‌పై కాకుండా పరిమితం చేసిన డిమాండ్‌పై మాత్రమే డిమాండ్ చార్జీలు.
► ఏప్రిల్ 15 నుంచి మాత్రమే జరిమానా చార్జీల విధింపు.
► ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగం ఉన్న వినియోగదారులకు నెలవారీ విద్యుత్ కోటా పూర్తయ్యాకే జరిమానా.
► ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఓపెన్ యాక్సెస్ లభ్యత కోసం నిరభ్యంతర పత్రం జారీ.
Comments
Please login to add a commentAdd a comment