సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ వినియోగ పరిమితులను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం సడలించింది. ఈ మేరకు వివిధ పారిశ్రామికవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. హెచ్‌టీ సర్వీసుల వినియోగదారులకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. దీనికి అవసరమైన నిరభ్యంతర పత్రం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఏపీఈఆర్సీ ఆదేశించింది.
అలాగే మార్కెట్‌లో కొనే విద్యుత్‌పై క్రాస్–సబ్సిడీ సర్‌చార్జ్, అదనపు సర్‌చార్జ్‌ల నుంచి మినహాయింపునిచ్చింది. అదేవిధంగా పరిమితులు అమలులో ఉన్నంతవరకు కనీస చార్జీలు వర్తించవని.. వాస్తవ వినియోగంపైనే డిమాండ్ చార్జీలు విధించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. వినియోగదారులు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్‌ను పొందే విషయంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) ద్వారా నెలవారీ కోటా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పరిమితుల ప్రకారం జరిమానాలు విధించాలి.
డిస్కమ్‌ల అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకి 209 మిలియన్ యూనిట్లు ఉంది. దీనిలో థర్మల్ 70 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు 38 మి.యూ, హైడ్రో 6 మి.యూ, గ్యాస్, సెయిల్ 8 మి.యూ, పవన విద్యుత్ కంపెనీలు 16 మి.యూ, సౌర విద్యుత్ కంపెనీలు 25 మి.యూ, హిందుజా 12 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 0.04 మిలియన్ యూనిట్ల చొప్పున అందిస్తున్నాయి. ఇప్పటికీ పవర్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి 34 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తే తప్ప డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల 30 వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులపై విధించిన పరిమితులను పొడిగించాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది.
పరిమితుల వల్ల 290 మిలియన్ యూనిట్లు ఆదా..
దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, గృహావసరాలకు కోతలు లేకుండా సరఫరా అందించడం కోసం ఈ నెల 8 నుంచి పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు అమలులోకి వచ్చాయి. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే 290 మిలియన్ యూనిట్లను ఆదా చేసి గృహావసరాలకు నిరంతరం, వ్యవసాయావసరాలకు 7 గంటలు విద్యుత్‌ను అందించారు. ఇంకా కొరత ఉండటం, పంటలకు విద్యుత్ అవసరం వంటి కారణాలతో పరిమితులను మరికొన్ని రోజులు పొడిగించారు.
ఈ నెలాఖరు వరకు నిరంతరం నడిచే పరిశ్రమలు రోజులో వాడే విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు వాడుకోవచ్చు. మిగతా పరిశ్రమలకు వారంలో ఒక రోజు (వారాంతపు సెలవు కాకుండా) పవర్ హాలిడే అమలు జరుగుతుంది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాదాపు 22 పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment