సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడిదారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణపై సోమవారం సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు.
ఈ రంగాలే కీలకం
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగావాట్లకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంవోయూలు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 12 వేల మెగావాట్లకు ఈ సదస్సులో పెట్టుబడులు తేవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు సూచించారు. ఫార్మా పరిశ్రమలకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6 వేల ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబుకు సూచించారు.
ఉన్నత విద్య అభివృద్ధికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను ఆహ్వానించాలని ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తొలుత సీఐఐ ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సదస్సు ప్రయోజనాలు, లక్ష్యాలు, ఫలితాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐటీ కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత పాల్గొన్నారు.
భారీ పెట్టుబడులే లక్ష్యం
Published Tue, Aug 23 2022 5:19 AM | Last Updated on Tue, Aug 23 2022 5:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment