ఎంఎస్‌ఎంఈలతో భారీ ఉపాధి | CM YS Jagan In Review Meeting On Department of Industries | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలతో భారీ ఉపాధి

Published Thu, Jun 16 2022 1:52 AM | Last Updated on Thu, Jun 16 2022 7:28 AM

CM YS Jagan In Review Meeting On Department of Industries - Sakshi

రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం. అదే చేస్తున్నాం. మనం చేసే పనుల్లో నిజాయితీ ఉంది కాబట్టే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు.      
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రం గ్రీన్‌ ఎనర్జీ, ఇథనాల్‌ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త పారిశ్రామిక విధానాలు రూపొందించాలని కోరారు.

పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పరిశ్రమలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందువల్లే పారిశ్రామిక వేత్తలు చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారన్నారు.

ఈ నేపథ్యంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో నీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తద్వారా వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

విశాఖపట్నం – చెన్నై కారిడార్‌లో నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎంఎస్‌ఎంఈలకు అత్యుత్తమ సేవలు
► రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకని ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు వారికి సకాలంలో అందేలా చూడాలి. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. 

► గత ప్రభుత్వం పెట్టిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్లస్టర్‌ పద్ధతిలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి. ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు అత్యుత్తమ సేవలు అందాలి.

కాలుష్య నివారణకు ఊతమివ్వాలి
► పరిశ్రమల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పారిశ్రామిక వాడల్లో పనిచేసే వారంతా మన కార్మికులే. వారి ఆరోగ్యాలను, పరిసరాలను, పరసరాల్లో నివాసం ఉండే వారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 

► ఇందుకోసం పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. అవి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేదా? అన్నది చూడాలి. అవసరమైతే పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలి. 

► ఎంఎస్‌ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.  కాలుష్య నివారణలో ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలి. అప్పుడే పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతాం. 

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులతో భారీగా ఉపాధి 
► గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభించనుంది. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు 66 వేల ఎకరాలకుపైగా భూమిని వినియోగించాల్సి ఉంటుంది. 

► అర హెక్టార్‌ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా, ఒక హెక్టార్‌ కంటే తక్కువ భూమి ఉన్న వారు 70 శాతం ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుంది. ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ఏటా ఎకరాకు దాదాపు రూ.30 వేలు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నాం. 

► రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేల మందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌కు వ్యాల్యూ అడిషన్‌ చేస్తున్నాం. గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టిపెట్టాం. దీనివల్ల గ్రీన్‌ ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తాం. పర్యావరణానికి కూడా మంచిది. దీనికి సంబంధించిన పాలసీ తయారు చేయాలి.

► రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారు. బియ్యాన్ని వాడుకుని ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలి. ఆయిల్‌ ఫాం ప్రాసెసింగ్‌ యూనిట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనిపై మంచి విధానాలు తీసుకురావాలి.

► ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కె వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇదీ మూడేళ్ల ప్రగతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement