ఎంఎస్‌ఎంఈలకు సీఎం జగన్‌ భారీ సాయం | CM YS Jagan In Video Conference With MSME Officials | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు సీఎం జగన్‌ భారీ సాయం

Published Fri, May 22 2020 12:38 PM | Last Updated on Fri, May 22 2020 2:17 PM

CM YS Jagan In Video Conference With MSME Officials - Sakshi

సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)ల బలోపేతం కోసం ‘రీస్టార్ట్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. 

రాష్ట్రంలోని సుక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి భరోసా ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వహయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్‌ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 

పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందించనుంది.  అంతేకాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్‌ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకి విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయడంపై ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రతినిధి డివి రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రోత్సాహక బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేయడంపై సీఎం వైఎస్‌ జగన్‌కు స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణబాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement