సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు రూ.904.89 కోట్లు విడుదల చేయడంతో పాటు, చిన్న పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్‌డ్ చార్జీలు రద్దు చేసింది. పెద్ద పరిశ్రమలకు పెనాల్టీలు లేకుండా మూడు నెలలు వాయిదా వేసింది. చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనుంది. ఈ మేరకు సీఎం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల వల్ల 97,428 చిన్న తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరడంతో పాటు వీటిల్లో పనిచేస్తున్న 9,68,269 మంది ఉపాధికి భద్రత కల్పించినట్లయ్యిందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.
రూ.188 కోట్ల ఫిక్స్‌డ్ చార్జీలు రద్దు
► ఎంఎస్‌ఎంఈలకు ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి సంబంధించి మినిమం కరెంటు డిమాండ్ చార్జీలు రూ. 188 కోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్ )కరెంటు మినిమం డిమాండ్ చార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించారు. ఎటువంటి పెనాల్టీలు, వడ్డీలు చెల్లించనవసరం లేకుండా మూడు నెలల పాటు వాయిదా వేసింది.
► ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకు, 24,252 చిన్న తరహా పరిశ్రమలకు, 645 మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా 97,428 ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేసింది.
25% ఎంఎస్‌ఎంఈల నుంచే కొనాలి
► రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు జరిపే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఎస్‌పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయి.
► ఈ 25 శాతంలో 4 శాతం ఎస్సీ,ఎస్టీలు, 3 శాతం మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.
తక్కువ వడ్డీకే రుణాలు
► ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో వర్కింగ్ కేపిటల్ అందించనుంది.
► కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీతో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందించనున్నారు. ఈ రుణాలను 6 నెలల మారిటోరియం పీరియడ్‌తో కలిపి మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది.
► అతి తక్కువ వడ్డీతో ఇచ్చే ఈ వర్కింగ్ కేపిటల్ రుణాల కోసం సిడ్బీ, ఐడీబీఐలతో కలిపి రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతంగా నిర్ణయించారు. ఈ రుణాల మంజూరుకు ఏపీఎస్‌ఎఫ్‌సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఆదాయం బాగున్నా ఐదేళ్లలో చెల్లించింది సున్నా
► ఒకపక్క లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరేళ్ల బకాయిలు తీర్చాలని ఆదేశాలు జారీ చేయడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
► రాష్ట్ర ఆదాయం బాగున్న తరుణంలోనూ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు.
► పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటితో ఎంఎస్‌ఎంఈ రంగం ఆర్థికంగా చితికిపోయిందని, ఆదుకోమని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
రెండు విడతలుగా చెల్లింపులు
లాక్ డౌన్‌తో నష్టపోయిన సంస్థలు తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు ఊతమిచ్చేలా ఆరేళ్ల రాయితీ బకాయిలు రూ.904.89 కోట్లు రెండు విడతలుగా మే, జూన్ నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించాల్సిన రూ.827.52 కోట్లతో పాటు 2019–20కి సంబంధించిన రూ.77.37 కోట్లు చెల్లించనున్నారు. దీంతో 11,238 ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో ఎస్సీలకు చెందిన 3,876 యూనిట్లకు రూ.238.9 కోట్లు, ఎస్టీలకు చెందిన 839 యూనిట్లకు రూ.46.16 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో భాగంగా మే 22న సుమారు రూ.450 కోట్లు విడుదల చేస్తామని పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పిన సంగతి విదితమే.
కోలుకోవడానికి ఊతం
క్లిష్ట సమయంలో రాయితీ బకాయిలు చెల్లించి లిక్విడిటీ కల్పించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలు తిరిగి కోలుకోవడానికి ఊతమిచ్చినట్లయ్యింది
– సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.రామకృష్ణ
కొత్త రుణాలతో ఊపిరి
ఖజానాకు రూపాయి రాని తరుణంలోనూ వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నారు. కొత్త రుణాలు ఇచ్చి ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని సీఎం జగన్ దేశంలోనే ప్రథమంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది పారిశ్రామిక రంగంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– ఏపీకే రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఎంఈ జాతీయాధ్యక్షుడు.
Comments
Please login to add a commentAdd a comment