కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇతడి పేరు పి.సుధాకర్. సొంత ఊళ్లోనే ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సుధాకర్ హైదరాబాద్‌లో తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి వచ్చేశారు. తనకున్న అనుభవంతో ఫ్యాన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. ఏపీఐఐసీ, బ్యాంకు అందించిన రుణసాయంతో ఎంఎస్‌ఎంసీ యూనిట్ నెలకొల్పారు. దానిని ప్రారంభించిన రెండేళ్లకే కరోనా ముంచుకొచ్చింది.
యూనిట్‌లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆదాయం లేకపోయినా బ్యాంకు వాయిదాలతోపాటు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతినెలా చెల్లించాల్సి వచ్చింది. అప్పటికే అప్పులు రూ.80 లక్షలు దాటేశాయి. ఇక తన పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘రీ స్టార్ట్’ పేరుతో ఎంఎస్‌ఎంఈలకు ఆపన్నహస్తం అందించారు. సుధాకర్ నెలకొల్పిన యూనిట్‌కు పాత బకాయిల రూపంలో ఒకేసారి రూ.51.50 లక్షలు చెల్లించారు. అలాగే లాక్‌డౌన్ కాలానికి మూడు నెలల విద్యుత్ చార్జీలను మాఫీ చేశారు. దీంతో అతడు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా నిలదొక్కుకోగలిగాడు. సుధాకర్ మాట్లాడుతూ.. ‘రీ స్టార్ట్ ప్యాకేజీ రూపంలో వచ్చిన మొత్తంతో బ్యాంకు రుణం తీర్చేశాను. ఖర్చులను తగ్గించుకున్నాను. వెంటిలేటర్‌పై ఉన్న నా పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రీ స్టార్ట్ పేరుతో ఊపిరిలూదటంతో కోవిడ్ కష్టాలు ఇంకా ఉన్నప్పటికీ అతిపెద్ద సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్క సుధాకరే కాదు.. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వైఎస్సార్ నవోదయం, రీ స్టార్ట్ ప్యాకేజీలు ఆపన్న హస్తం అందించాయి.
సాక్షి, అమరావతి : కోవిడ్ రూపంలో ముంచుకొచ్చిన సంక్షోభం కారణంగా రాష్ట్రంలో ఒక్క ఎంఎస్‌ఎంఈ యూనిట్ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం పుణ్యమా అని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవనోపాధి నిలబడింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గత ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిల కింద రూ.904.83 కోట్లను విడుదల చేయడంతోపాటు ఆయా యూనిట్ల రుణాల కోసం గ్యారంటీగా రూ.250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎస్సీ వర్గాలకు చెందిన 4,093, ఎస్టీ వర్గాలకు చెందిన 810 యూనిట్లు ప్రయోజనం పొందాయి. ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నమ్మకం పెరగడంతో బ్యాంకులు కూడా వాటిని రుణాలిచ్చి తమ వంతుగా ఆదుకున్నాయి. ఇదిలావుంటే.. ఎంఎస్‌ఎంఈలకు రెండో ఏడాది పారిశ్రామిక రాయితీలను సైతం ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.
లక్ష్యాలను మించి రుణాలు
ఎంఎస్‌ఎంఈ రంగానికి 2020–21 సంవత్సరంలో రూ.39,600 కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. లక్ష్యాన్ని మించి రూ.40,311.76 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులోను అత్యధికంగా సూక్ష్మ సంస్థలను ఆదుకున్నాయి. గతేడాది సూక్ష్మ సంస్థలకు రూ.18,674 కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం కాగా.. రూ.20,598.53 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. అలాగే వ్యాపారాలు లేక తీసుకున్న రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మారిపోయిన ఖాతాలను ‘వైఎస్సార్ నవోదయం’ పథకం కింద పునర్ వ్యవస్థీకరించారు. ఈ విధంగా 2020–21 సంవత్సరంలో రూ.3,236.52 కోట్ల రుణ ఖాతాలను పునర్ వ్యవస్థీకరించాయి. దీనివల్ల 1,08,292 ఖాతాలకు లబ్ధి చేకూరింది. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రుణాల లక్ష్యాన్ని రూ.44,500 కోట్లకు పెంచాయి.
పనితీరు బాగుంది
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగం పనితీరు బాగుంది. వీటికి గత ఏడాది లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్ష్యాలను అధిగమించాం. అదే విధంగా ఒత్తిడిలో ఉన్న యూనిట్లను ఆదుకునే విధంగా నిరర్థక ఆస్తులను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. ఈ ఏడాది కూడా భారీగా నిర్దేశించుకున్న రూ.44,500 కోట్ల రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం.
–వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)
ప్రభుత్వ అండతో నిలబడ్డాం
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా ఎంఎస్‌ఎంఈలకు రీ స్టార్ట్ ప్యాకేజీ ప్రకటించారు. కష్టకాలంలో పాత బకాయిలను చెల్లించడంతోపాటు రుణాల గ్యారంటీ కోసం రూ.250 కోట్లు కేటాయించారు. ఈ చర్యల వల్ల కోలుకుని 70 శాతం నిర్వహణ సామర్థ్యంతో సంస్థలు నిలదొక్కుకుని వ్యాపారం చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడ్డాం.
– ఏపీకే రెడ్డి, అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment