సాక్షి, అమరావతి: లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంస్థల (ఎంఎస్‌ఎంఈ)ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో రుణాలు చెల్లించలేని ఎంఎస్‌ఎంఈలకు ‘రుణాల ఏక కాల పునర్‌వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) చేయడంలో ఆర్థికసాయం అందించే విధంగా రూపొందించిన ‘డాక్టర్ వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 వేల యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం కోసం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ సర్టిఫికెట్లను అందజేశారు. పథకం ప్రారంభోత్సవంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈలదే కీలక పాత్ర: ఆర్థికమంత్రి
రాష్ట్రంలో రూ.30,528 కోట్ల పెట్టుబడితో 1,00,629 ఎంఎస్‌ఎంఈలు పని చేస్తున్నాయని ఆర్థికమంత్రి బుగ్గన వివరించారు. వీటి ద్వారా 10,84,810 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. డాక్టర్ వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యవసాయం తర్వాత అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగం గత కొంత కాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.
ఈ నేపథ్యంలోనే ‘రుణాల ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) ద్వారా వీటిని ఆదుకోవడానికి డాక్టర్ వైఎస్సార్ నవోదయం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.రుణాల బకాయలు చెలించలేని ఎంఎస్‌ఎఈలకు ఓటీఆర్ కల్పించడంతో పాటు, అవసరమయ్యే ఆడిటర్ నివేదిక వయ్యంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.2,00,000 వరకు ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీనివల్ల రుణాల చెల్లింపునకు వారికి గరిష్టంగా ఆరేళ్ల సమయం లభించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందన్నారు. బ్యాంకర్లతో కలిసి ఓటీఆర్‌లో రూ.3,493 కోట్ల మేర లబ్ధి చేకూర్చనున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment