విశ్లేషణ
‘సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి’
–వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన చట్టం ‘ఎంఎస్‌ఎమ్‌ఈ డెవలప్మెంట్ చట్టం–2006’. తయారీదారు దగ్గర కొనని వ్యాపారస్తుని ఈ చట్టం ఎలాంటి ఇబ్బందీ పెట్టదు. తయారీదారు వద్ద కొనుగోలు చేసినవాళ్లే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత 15 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో 40 శాతం మేర పాలు పంచుకోవడం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విశిష్ఠత.
పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా విస్తరించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తోడ్పడుతున్నాయి. పెట్టుబడుల కొరతను ఈ తరహా పరిశ్రమలు అధిగమించడానికి కేవలం వ్యక్తిగత హామీలతో బ్యాంకులు ఋణం అందిస్తున్నాయి. అందుకే ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పీఎమ్‌ఈజీపీ, సీజీటీఎమ్‌సీ కింద ఇచ్చే రుణాలతో పాటు ముద్రా ఋణాలూ ఇటువంటి పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఒక వ్యక్తి కాని, వ్యాపార సంస్థ కాని (కొనుగోలుదారు) వస్తువులు లేక సేవలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను నడిపేవారి (అమ్మకందారు) నుంచి పొందినట్లయితే... వారు అమ్మకందారుకు నగదు ఠంచనుగా చెల్లించాలనేది ఈ చట్టం చెప్తుంది. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం గడువు 45 రోజులు మాత్రమే ఉండాలి. దాని కోసం అమ్మకందారు ‘ఉద్యమ్ ఆధార్’లో నమోదు పొందిన తయారీదారుడు కావాల్సిన అవసరం లాంటి కొన్ని పరిమితులు నిర్దేశించడం ఈ చట్టంలోని ఒక సుగుణం.
అలా ఒప్పంద పత్రం లేకపోతే ‘నియమించిన గడువు’ అనే అంశం పరిగణనలోకి వస్తుంది. వస్తువులను లేదా సేవలను అంగీకరించిన రోజు నుంచి 15 రోజుల లోపల నగదు చెల్లించాల్సి రావడమే ‘నియమించిన రోజు’గా చట్టం చెబుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల తయారీదారుకు కొనుగోలుదారుకు మధ్య ఒప్పంద పత్రం రాతపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. అలా కానప్పుడు కొనుగోలుదారుడు 15 రోజుల్లోపల నగదు చెల్లించాల్సి ఉంటుంది.
కొనుగోలుదారుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఒప్పుదల పత్రంలో గడువు ఎక్కువ రోజులు రాసుకొన్నప్పటికీ ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ డెవలప్మెంట్ చట్టం –2006 సెక్షన్ 15 ప్రకారం విధించిన గడువు కేవలం 45 రోజులే. ఇది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలుచేసిన వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది.
పెట్టుబడి ఒక కోటి రూపాయలు లోపల ఉండి రూ. 5 కోట్ల అమ్మకాలు సాగిస్తే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమగా పరిగణిస్తారు. అదే పెట్టుబడి 10 కోట్ల రూపాయల లోపల ఉండి అమ్మకం రూ. 50 కోట్ల లోపల ఉంటే చిన్న తరహ పరిశ్రమగా పరిగణిస్తారు. తయారీ లేకుండా కేవలం అమ్మకం (ట్రేడింగ్) జరిపే వ్యాపారులకు ఈ చట్టం వర్తించదు.
కొన్న వస్తువులకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టప్రకారం వస్తువులు లేక సేవలు పొందిన ఏ వ్యక్తి అయినా సెక్షన్ 15లో చెప్పిన విధంగా చెల్లింపు జరపని కారణంగా అమ్మకందారునికి ‘వడ్డీ’ చెల్లించాలి. అదీ చక్రవడ్డీ! వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు, తన కింది బ్యాంకులకు సూచించిన రేటుకు మూడురెట్లుగా నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మూలధన లభ్యత పెరిగి అవి సజీవంగా మనుగడ సాగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
కొనుగోలుకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కట్టే వడ్డీని ఆదాయపు పన్ను లెక్కలో ఖర్చుల క్రింద పరిగణించకపోవడం మరో విశేషం. అయితే బకాయిలు చెల్లించిన సంవత్సరంలో ఖర్చు కింద చూపే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ చట్టం భారతదేశ కొనుగోలుదారులకే కాకుండా విదేశీ కొనుగోలు దారులకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ వివాదాల్ని పరిష్కరించడానికీ, చట్టాలు అమలు చేయడానికి దేశ దౌత్యవేత్తల కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి.
ఆదాయపు పన్ను సెక్షన్ 43బీ(హెచ్)కు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టం సెక్షన్ 15ను కలిపి చదివితేనే మనకు ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ప్రతి సంస్థ చట్టాలకు లోబడి ఆస్తి, అప్పుల పట్టీని తయారుచేసి లెక్కలు తనిఖీ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఏ సంస్థ అయితే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లించలేదో, వాటి బకాయిలను చెల్లించాల్సిన వడ్డీని బహిర్గతం చేయాలి. కంపెనీ అయితే కంపెనీ చట్టాలకు లోబడీ, ఇతరత్రా అయితే ఆ చట్టాలను అనుసరించీ!
2006 చట్టంగా వచ్చినప్పటికీ, అమలు చేయడంలో చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంతో ముడిపెట్టడం వల్ల చట్టం విలువ పెరిగి దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత తరుణంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ఈ చట్టం ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నదనేది కాదనలేని నిజం.
చిన్ని శ్రావణ్ కుమార్
వ్యాసకర్త చార్టర్డ్ అకౌంటెంట్
Comments
Please login to add a commentAdd a comment